వరంగల్ ఎంజిఎంకి అదనపు హంగులు.. ఫలించిన మంత్రి ఎర్రబెల్లి సమీక్ష
హైదరాబాద్, వరంగల్, పర్వతగిరి, జూలై 21ః వరంగల్ ఎంజిఎం హాస్పిటల్ కి మరిన్ని హంగులు సమకూరాయి. హైదరాబాద్ తర్వాత అతి పెద్ద హాస్పిటల్ గా ఉన్న ఎంజిఎం వైద్యశాలకు మరిన్ని సదుపాయాలు అందుబాటులోకి వచ్చాయి. కరోనా విస్తృతి నేపథ్యంలో వైరస్ ని అదుపు చేయడం, వరంగల్ ఎంజిఎం సామర్ధ్యాన్ని మరింతగా పెంచడంపై జూలై 15న వరంగల్ లోని తన క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరాశాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు నిర్వహించిన సమీక్ష సమావేశం సత్ఫలితాలిచ్చింది.
ప్రజాప్రతినిధులు, ఎంజిఎం వైద్యులు, అధికారులతోపాటు, ప్రైవేట్ హాస్పిటల్స్ ప్రతినిధులు కూడా ఈ సమావేశంలో పాల్గొనగా, రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ తోనూ మంత్రి ఎర్రబెల్లి ఫోన్ లో మాట్లాడారు. ఈ సమీక్ష జరిగిన ఐదు రోజుల్లోనే మంచి ఫలితాలు వచ్చాయి. ఆ రోజును మంత్రి ఈటలకు నివేదించిన 15 అంశాల్లో సగానికిపైగా సాధ్యమయ్యాయి. మిగతా వాటిని సైతం త్వరలోనే సమకూర్చనున్నాయి. దీంతో మరోసారి మంగళవారం సాయంత్రం మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు వరంగల్ రూరల్ జిల్లా పర్వతగిరి నుంచి అటు హైదరాబాద్, ఇటు వరంగల్ లో ఉన్న ప్రజాప్రతినిధులు, అధికారులు తదితరులతో మరోసారి టెలీ కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు.
ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ, సమస్యలను చర్చించి, పరిష్కారాలు చూపిస్తే, వాటిని సాధించడానికి ఎంతో సమయం పట్టదన్నారు. కాపోతే, సమన్వయం, సామరస్యం, సానుకూల దృక్ఫథం ఉండాలన్నారు. కేవలం 5 రోజుల క్రితం వరంగల్ లో ఎంజిఎం సామర్థ్యం పెంపు, కరోనా వైరస్ ని అరికట్టడంపై నిర్వహించిన సమావేశంలో సగానికిపైగా అంశాలను సాధించామన్నారు.
ఎంజిఎంలో కరోనా బెడ్లు 200 మాత్రమే ఉండగా, అదనంగా 50 బెడ్లు పెంచామన్నారు. అలాగే ఇప్పుడున్న వెంటిలేటర్లకు అదనంగా 15 వెంటిలేటర్లు, 5 బై పాప్ మిషన్లు కూడా వచ్చాయని మంత్రి చెప్పారు. కరోనా బారిన వైద్యులు, సిబ్బంది కూడా పడుతున్నందున, అదనంగా 10వేల ఎన్-95 మాస్కులు, 4వేల పిపిఇ కిట్లను తెప్పించామని చెప్పారు. ఇక ఎంజిఎం హాస్పిటల్ లో పారిశుద్ధ్యాన్ని పకడ్బందీగా నిర్వహించడానికి వీలుగా మరో 40మంది పారిశుద్ధ్య కార్మికులు, 18 మంది రోగి సంరక్షకుల నియామకం కూడా జరిగిందని మంత్రి ఎర్రబెల్లి తెలిపారు. అదనంగా క్లీనికల్, మెడికల్ స్టాఫ్ ని కూడా మిగతా విభాగాల నుంచి నియామకం జరిపినట్లు మంత్రి వివరించారు. కరోనా చికిత్సలకై 5 ప్రైవేట్ హాస్పిటల్స్ కి అనుమతుల కోసం సిఫారసులు చేశామని చెప్పారు. జయ, మాక్స్ కేర్, అజరా, ఆదిత్య, అరవింద హాస్పిటల్స్ కరోనా చికిత్సలను వరంగల్ లోనే నిర్వహించడానికి ముందుకు వచ్చాయని, వాటికి త్వరలోనే అనుమతులు లభిస్తాయని మంత్రి అన్నారు.
కరోనా వైరస్ అదుపు, ఎంజిఎం సామర్థ్యం పెంపుపై జూలై 15న వరంగల్ లో నిర్వహించిన సమీక్ష ఫలితంగా ఒనగూరగా, తాజాగా తాము మరోసారి పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిపి టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించినట్లు మంత్రి ఎర్రబెల్లి చెప్పారు. వరంగల్ లోని సెంట్రల్ జైలు ఆవరణలో నిర్మాణం పూర్తి చేసుకుని ఉన్న పిఎంఎస్ఎస్ వై హాస్పిటల్ లో ఆక్సీజన్ అమర్చాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ మంత్రి ఈటల రాజేందర్ ని కోరామన్నారు. దీంతో మరో 200 పడకల సామర్ధ్యం గల హాస్పిటల్ అందుబాటులోకి వస్తుందని, ఈ హాస్పిటల్ ని పూర్తి కరోనా వైద్యశాలగా మార్చి వైద్యం అందించవచ్చని మంత్రి తెలిపారు. అలాగే, ర్యాపిడ్ యాంటీజెంట్ కిట్ల కై ఆదేశాలు జారీ చేశామన్నారు. మరిన్ని పరికరాలు అవసరం ఉందని, నియామకాలు జరగాలని, తగినన్ని మందులు అందుబాటులో పెట్టాలని నిర్ణయించినట్లు మంత్రి ఎర్రబెల్లి తెలిపారు. సిసి కెమెరాలు, సిబ్బందికి బీమా కోసం అభ్యర్థనలు చేశామన్నారు.
ఈ టెలీ కాన్ఫరెన్స్ లో... ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్, రాజ్యసభ సభ్యుడు బండా ప్రకాశ్, లోక్ సభ సభ్యుడు పసునూరి దయాకర్, వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్, కాళోజీ హెల్త్ యూనివర్సిటీ వీసీ కరుణాకర్ రెడ్డి, వరంగల్ అర్బన్ కలెక్టర్ రాజీవ్ గాంధీ హన్మంతు, సిపి ప్రమోద్ కుమార్, కెఎంసి ప్రిన్సిపాల్ డాక్టర్ సంధారాణి, ఎంజిఎం సూపరింటెండెంట్ శ్రీనివాస్, డిఎంఅండ్ హెచ్ వో లలితాదేవి తదితరులు పాల్గొన్నారు.