కరోనా భయం వీడండి... మేం అభయం ఇస్తున్నాం: మంత్రి ఎర్రబెల్లి
వరంగల్, జూలై 24ః కరోనా భయం వీడండి... సర్కార్ తోపాటు ప్రజాప్రతినిధులుగా మేం అభయం ఇస్తున్నాం... కేవలం భయం వల్లే అనేక మంది ఇబ్బందులు పడుతున్నారు. కాస్త రోగ నిరోధక శక్తిని పెంచుకుంటే చాలు... ఎలాంటి భయాలు అక్కర లేదు. మరో నాలుగు వారాలు మరింత జాగ్రత్తగా ఉందాం.. కరోనా బారి నుంచి బయట పడదాం... అని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరాశాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రజలకు పిలుపునిచ్చారు. కరోనా వైరస్ విస్తృతి నేపథ్యంలో వైరస్ నివారణ-పెంచాల్సిన వైద్య సదుపాయాలపై వరంగల్ రూరల్ జిల్లా పర్వతగిరి నుంచి టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి రాష్ట్ర గిరిజన సంక్షేమ, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్, ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ భాస్కర్, ఎంపీలు బండా ప్రకాశ్, పసునూరి దయాకర్, మాలోత్ కవిత, ఎమ్మెల్యేలు...డిఎస్ రెడ్యానాయక్, శంకర్ నాయక్, ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి, నన్నపనేని నరేందర్, ఉమ్మడి జిల్లాలోని కలెక్టర్లు, ఎంజిఎం సూపరింటెండెంట్జి, జిల్లాల వైద్యాధికారులు ఈ టెలీ కాన్ఫరెన్సులో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ, కరోనా వైరస్ విస్తృతి రోజురోజుకూ పెరుగుతున్నదన్నారు. నగరాలకు, జనసమ్మర్థ ప్రాంతాల నుంచి క్రమేణా పట్టణాలు, గ్రామాలకు విస్తరించి సామాజిక సమస్యగా పరణమిస్తున్నదని చెప్పారు. ప్రజల కోసం పని చేస్తున్న డాక్టర్లు, పోలీసులు, అధికారులు, రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిదులందరికీ ఈ వ్యాధి ప్రబలుతున్నదని చెప్పారు. ఈ దశలోనే ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు. మరో నాలుగు వారాల పాటు మనమంతా మరింత జాగ్రత్తగా ఉందాం. కరోనా మహమ్మారి నుంచి మనల్ని మనం రక్షించుకుందామని పిలుపునిచ్చారు. ఆరోగ్య, రోగనిరోధక శక్తిని పెంచే ఆహారాన్ని వేడిగా తీసుకుందామని చెప్పారు. కరోనా వైరస్ కంటే... భయంతోనే ఎక్కువ మంది ఇబ్బందులు పడుతున్నారన్నారు. కోవిడ్ కి భయపడాల్సిన పని లేదు...కొన్ని జాగ్రత్తలతో సులువుగా కోలుకోవచ్చు... ఇప్పటిదాకా కరోనా బారి నుంచి కోలుకున్న వారే ఇందుకు నిదర్శనమన్నారు.
*కరోనాపై ప్రజలను మరింతగా చైతన్య పరిచే కార్యక్రమాలు నిర్వహిద్దాం*
కరోనా నివారణకు ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టింది. చికిత్సలకు అవసరమైన సదుపాయాలన్నీ కల్పిస్తున్నది. మందులు సిద్ధంగా ఉంచింది. బెడ్లు, ఆక్సీజన్, వెంటిలేటర్లు...ఐసోలేషన్ సెంటర్లు... అన్నీ సిద్ధం చేశామని మంత్రి ఎర్రబెల్లి వివరించారు. అయితే, ప్రజల్లో వ్యాధి పట్ల ఇంకా చైతన్యం, అవగాహన పెంచాలని చెప్పారు. వేడిగా ఉండే విధంగా బలవర్ధకమైన ఆహారం తీసుకోవడం, స్వీయ నియంత్రణలో ఉండటం, మాస్కులు తప్పనిసరిగా ధరించడం, అవసరమైతే తప్ప బయటకు వెళ్ళకుండా ఉండటం చేయాలని చెప్పారు.
*ఎంపీ, ఎమ్మెల్యేల అభివృద్ధి నిధులను కరోనా వైద్య సదుపాయాలకే ఖర్చు చేద్దాం*
ఎంపీలు, ఎమ్మెల్యేల నియోజకవర్గాల అభివృద్ధి నిధులన్నింటినీ కరోనా వైద్య సదుపాయాల పెంపు కోసమే వినియోగించాలని ఎంపీలు, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలకు మంత్రి ఎర్రబెల్లి విజ్ఞప్తి చేశారు. ఈ విపత్తును నుంచి ప్రజలను పూర్తిగా బయట పడేసే వరకు ఇతర అభివృద్ధి పనులకంటే కరోనా నివారణకే ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలని మంత్రి వారిని కోరారు. వైద్యశాలల్లో సదుపాయాలు, పరికరాల కోసం ఆయా నిధులను వెచ్చించాలని సూచించారు.
*త్వరలోనే పిఎంఎస్ ఎస్ వై హాస్పిటల్ ని అందుబాటులోకి తెద్దాం*
వరంగల్ సెంట్రల్ జైలు ఆవరణలో నిర్మితమైన పిఎంఎస్ఎస్ వై హాస్పిటల్ ని సాధ్యమైనంత వేగంగా అందుబాటులోకి తేవాలని అధికారులను మంత్రి ఆదేశించారు. నిధులకు సంబంధించిన సమస్యలేమైనా ఉంటే వాటిని అటు కేంద్రం, ఇటు సిఎం కెసిఆర్ తో మాట్లాడి పరిష్కరించాలని నిర్ణయించారు. అలాగే వరంగల్ ఆయుదర్వేద హాస్పిటల్ ని ఐసోలేషన్ కేంద్రంగా వాడుకోవాలని అందులోని బెడ్లు, రూమ్ లను ఉపయోగించుకోవాలని మంత్రి ఎర్రబెల్లి అధికారులను ఆదేశించారు.
*గ్రామీణ ప్రాంతాల్లోని పెద్ద పట్టణాల్లోనూ క్వారంటైన్ కేంద్రాలు ఏర్పాటు చేయాలి*
గ్రామీణ ప్రాంతాల్లోనూ కరోనా వైరస్ విస్తరిస్తున్నందున పెద్ద పట్టణాలు, అందుబాటులోని ప్రధాన పెద్ద భవనాలను ఔసోలేషన్ కేంద్రాలుగా వినియోగించుకోవడంపై దృష్టి సారించాలని మంత్రి అధికారులకు సూచించారు. గ్రామాల్లోనూ పెరుగుతున్నందున గ్రామాల పారిశుద్ధ్యంపై కలెక్టర్లు దృష్టి సారించాలని ఆదేశించారు. పనిలోపనిగా...అన్ని జిల్లా కేంద్రాల్లోనూ వైద్యశాలలో సౌకర్యాలు మరింతగా మెరుగు పరచాలని అధికారులకు చెప్పారు. అయా హాస్పిటల్స్ లో ఆక్సిజన్, వెంటిలేటర్లు, సానిటేషన్ వంటి ఇతర సదుపాయాలు పెంచాలని చెప్పారు.
*తరచూ నిర్వహిస్తున్న సమీక్షలు, పెరిగిన వైద్య సదుపాయాలతో మెరుగైన చికిత్సలు అందిద్దాం*
ఇలా తరచూ నిర్వహిస్తున్న మౌఖిక, టెలీ సమీక్షల ద్వారా మంచి ఫలితాలు వస్తున్నాయని మంత్రి తెలిపారు. ఈ నెల 15వ తేదీన నిర్వహించిన సమీక్ష అనంతరం ఐదు రోజుల్లోనే ఎంజిఎం వైద్యశాలకు అవసరమైనవి సమకూరాయాని చెప్పారు. వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ చొరవతో మరిన్ని సదుపాయాలు సమకూర్చుకోవాలని ఇద్దరు మంత్రులు ఎర్రబెల్లి, సత్యవతి రాథోడ్ నిర్ణయించారు. అలాగు ఉమ్మడి వరంగల్ జిల్లాతోపాటు... తాజాగా ఏర్పడ్డి జిల్లాల వారీగా కూడా సమీక్షలు నిర్వహించాలని మంత్రులు నిర్ణయించారు.
*కరోనాతో ఎవరికీ ఏమీ కాదు ః కరోనా నుంచి కోలుకుని...తన అనుభవాన్ని పంచుకున్న ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి*
కరోనా వైరస్ తో భయపడాల్సిన పనే లేదని ఆ వైరస్ బారిన పడి పూర్తిగా కోలుకున్న జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి తెలిపారు. 60ఏళ్ళ పైబడి ఉన్న తాను, తనకంటే పెద్ద వాళ్ళైన తన కుటుంబ సభ్యులు, బంధువులు, తన కంటే చిన్నవాళ్ళైన తన సిబ్బందీ మొత్తం ఎలాంటి మందులు వాడకుండానే కోలుకున్నామన్నారు. బలవర్ధకమైన ఆహారం వేడిగా తీసుకోడం, స్వీయ నియంత్రణలో విశ్రాంతి తీసుకుని కోలుకున్నట్లు చెప్పారు. రోగ నిరోధక శక్తి పెరిగేలా ప్రజలంతా జాగ్రత్త వహించాలన్నారు. తన అనుభవాన్ని టెలీ కాన్ఫరెన్సులో మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులతో పంచుకున్నారు.
*కల్లాలు, గోదాములు, రైతు వేదికలు మూడు నెలల్లోగా పూర్తి చేయాలిః అధికారులకు మంత్రి ఎర్రబెల్లి ఆదేశాలు*
అలాగే సిఎం కెసిఆర్ కరోనా కష్టంలోనూ ప్రజల సంక్షేమాన్ని, అభివృద్ధిని వీడలేదని, అందకనుగుణంగా అధికారులు రైతు వేదికలు, కల్లాలు, గోదాముల నిర్మాణాలను ఎట్టి పరిస్థితుల్లోనూ 3 నెలల్లోగా పూర్తి చేయాలని మంత్రి ఎర్రబెల్లి ఆదేశించారు.