ఏ జిల్లా కరోనా బాధితులకు ఆ జిల్లాలోనే ట్రీట్ మెంట్: మంత్రి ఈటల
- 24 గంటల పాటు విధుల్లో డాక్టర్లు, సిబ్బంది
- వరంగల్ లో అదనంగా 250 కరోనా పడకలు
- 15రోజుల్లో అందుబాటులోకి పిఎంఎస్ఎస్ వై సూపర్ స్పెషాలిటీ దవాఖానా
- ట్రీట్ మెంట్ తోపాటు... ధైర్యాన్ని నింపాలి
- డాక్టర్లు, సిబ్బంది, అధికారులు సమన్వయంతో పని చేయాలి
- సహజ చావులను కరోనా మరణాలుగా చూడొద్దు
- ప్రతి ప్రభుత్వ దవాఖానాలో ఆడిట్ కమిటీ ఉంటుంది-ఆ కమిటీయే మరణాలను నిర్ధారిస్తుంది
- ఇండియాలో కరోనా వైరస్... అమెరికా అంత సీరియస్ కాదు
- కొద్దిపాటి జాగ్రత్తలతో నయం కావచ్చు
- కేవలం 4 నుంచి 5శాతం ఇతర జబ్బులున్న సీనియర్ సిటిజెన్స్ అప్రమత్తంగా ఉండాలి
- నేటి నుంచే *నిదమ్* యాప్ ఏర్పాటు...ఫోన్ ద్వారానే రిటైర్డ్ డాక్టర్లతో సలహాలు, సూచనలు
- ప్రైవేట్ హాస్పిటల్స్ కి వెళ్ళి లక్షలు ఖర్చు చేసుకోవద్దు
- కరోనాకి మందు లేదు...నయం కావడానికి పెద్దగా ఖర్చు కాదు
- ప్రభుత్వ సూచనలు పాటించండి... ధైర్యంగా కరోనా వైరస్ ని ఎదుర్కోండి
- ప్రజలకు పిలుపునిచ్చిన రాష్ట్ర వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ మంత్రి ఈటల రాజేందర్, రాష్ట్ర పంచాయతీరాజ్,
- గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరాశాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు
- వరంగల్ ఉమ్మడి జిల్లా ప్రజాప్రతినిధులు, కలెక్టర్లు, వైద్యాధికారులతో కలిసి కరోనా వైరస్ నియంత్రణపై సమీక్ష నిర్వహించి, మీడియాతో మాట్లాడిన మంత్రులు
ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ, మన రాష్ట్రంలో 81శాతం మంది కరోనా బాధితుల్లో ఏమాత్రం వైరస్ లక్షణాలు కనిపించడం లేదు. అందులో కేవలం 19శాతం మందికి మాత్రమే జ్వరం, దగ్గు, జలుబు వంటి లక్షణాలు కనిపిస్తున్నాయి. ఇందులోనూ 14శాతం మంది నయం అవుతున్నారు. కేవలం 4 నుంచి 5శాతం అంతకుముందే జబ్బులున్న సీనియర్ సిటిజన్లకు మాత్రమే సమస్య ఉంది. వాళ్ళని కాపాడుకునే బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. ప్రభుత్వం ఆదేశాల ప్రకారం...డాక్టర్లు, సిబ్బంది, అధికారులు అప్రమత్తంగా ఉండి, సమన్వయంతో పని చేయాలి. అని ఆదేశాలిచ్చారు. ఇక నుంచి 24 గంటల పాటు కరోనాకి చికిత్స అందించే డాక్టర్లు, సిబ్బంది విధుల్లో ఉండాలి. ఏ జిల్లా కరోనా బాధితులకు ఆ జిల్లాలోనే చికిత్సలు అందించాలి. అందుకు అవసరమైన అన్ని సదుపాయాలను ప్రభుత్వం కల్పిస్తుంది. కావాల్సిన ఇండెంట్లు పెట్టండి. ఏ ఒక్క పేషంట్ కి కూడా వైద్యం అందలేదన్న పేరు రావొద్దని మంత్రులు చెప్పారు. త్వరలోనే వరంగల్ లో అదనంగా 250 కరోనా పడకలు అందుబాటులోకి వస్తాయి. మరో 15రోజుల్లో పిఎంఎస్ఎస్ వై సూపర్ స్పెషాలిటీ దవాఖానాని అందుబాటులోకి తెస్తాం. అని మంత్రులు ఈటల, ఎర్రబెల్లి వివరించారు.
*ట్రీట్ మెంట్ తోపాటు... ధైర్యాన్ని నింపాలి*
కేవలం ట్రీట్ మెంటు మాత్రమే రోగులను నయం చేయదు. అంతకంటే ధైర్యం కావాలి, కరోనా పట్ల భయాలు పోవాలి. నిజానికి మన దేశంలో కరోనా వైరస్ అమెరికా, యూరప్ వంటి దేశాల్లో మాదిరి సీరియస్ వైరస్ కాదు. కొద్దిపాటి జాగ్రత్తలతోనే నయం కావచ్చు. అందుకే ప్రజల్లో కరోనా వస్తే చస్తామనే భయాన్ని పోగొట్టాలి. నయమవుతామనే భరోసానివ్వాలి అన్నారు.
*సహజ చావులను కరోనా మరణాలుగా చూడొద్దు*
ప్రతి రోజూ దేశంలో 3వేల మంది, రాష్ట్రంలో వెయ్యి మంది సహజంగా మరణిస్తారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రతి చావూ కారో్నా వల్లే అనడం సబబు కాదు. ప్రతి ప్రభుత్వ దవాఖానాలో ఆడిట్ కమిటీ ఉంటుంది. ఆ కమిటీయే ఆయా మరణాలను నిర్ధారిస్తుంది. అలాగని అన్ని చావులను కరో్నాకి అంటగట్ట వద్దని మంత్రులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
*ప్రైవేట్ హాస్పిటల్స్ కి వెళ్ళి లక్షలు ఖర్చు చేసుకోవద్దు*
ప్రజలు ప్రైవేట్ హాస్పిటల్స్ కి వెళ్ళి లక్షలు తగలేసుకోవద్దు. నిజానికి కోవిడ్ కి మందు లేదు. అలాగని కరోనా వైరస్ అంత సీరియస్ ది కాదు. అలాగని నిర్లక్ష్యం కూడా తగదు. కరోనా వైరస్ నుంచి బయట పడటానికి పెద్దగా ఖర్చు కాదు. ఈ విషయాలు తెలియక ప్రజలు ఆందోళన చెందొద్దు అన్నారు. కాకపోతే, ప్రాథమిక స్థాయిలోనే కరోనాని గుర్తించడం, వెంటనే చికిత్స తీసుకోవడం, సామాజిక దూరం, స్వీయ నియంత్రణ పాటించడం, మాస్కులు ధరించడం, హోం క్వారంటైన్ లోఉండటం, బలవర్ధకమైన ఆహారం తీసుకోవడం, అధైర్య పడకుండా ఉండటం వంటి జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రులు ఈటల, ఎర్రబెల్లి సూచిచంచారు.
*నేటి నుంచే *నిదమ్* యాప్ ఏర్పాటు...ఫోన్ ద్వారానే రిటైర్డ్ డాక్టర్లతో సలహాలు, సూచనలు*
నేటి నుంచే నిదమ్ యాప్ ని ప్రభుత్వం సిద్ధం చేసింది. ఫోన్ లో ఆ యాప్ ని డౌన్ లోడ్ చేసుకోవాలి. తమ సమస్యలు చెప్పి, కావాల్సిన సలహాలు, సూచనలు రిటైర్ అయిన సీనియర్ డాక్టర్ల నుంచి తీసుకోవచ్చని మంత్రులు వివరించారు. ఈ యాప్ ద్వారా హోం క్వారంటైన్ లో ఉన్న వాళ్ళకి, ఇళ్ళల్లోనే ఉండే వాళ్ళందరికీ ఎంతో మేలు చేస్తుందని మంత్రులు వివరించారు. ప్రజలు ప్రభుత్వ సూచనలు పాటించాలని, ధైర్యంగా ఉండాలని మంత్రులు ఈటల, ఎర్రబెల్లి ప్రజలకు పిలుపునిచ్చారు.
*ఎంజిఎంపై ప్రత్యేకంగా సమీక్ష*
మంత్రులు, ప్రజాప్రతినిధులు ఎంజిఎం హాస్పిటల్ పై ప్రత్యేకంగా చర్చించారు. నిబద్ధత, నిజాయితీ, సమన్వయంతో పని చేయాలని ఎంజిఎం డాక్టర్లను ఆదేశించారు. ఒక్క పేషంట్ కూడా వైద్యం అందలేదన్న పరిస్థితి రావొద్దన్నారు. కావాల్సిన మందులు, మాస్కులు, పిపిఇ కిట్లు...వెంటిలేటర్లు, ఆక్సీజన్ వంటి అన్ని సదుపాయాలను సమకూర్చుకోవాలని సూచించారు. త్వరలోనే ఎంజిఎం కి ఫుల్ టైమ్ సూపరింటెండెంట్ ని నియమిస్తామని మంత్రులు చెప్పారు.
ఈ సమీక్షలో ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్, ఎంపీలు బండా ప్రకాశ్, మాలోత్ కవిత, ఎమ్మెల్యేలు నన్నపనేని నరేందర్, పెద్ది సుదర్శన్ రెడ్డి, శంకర్ నాయక్, ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి, తాటికొండ రాజయ్య, ధనసరి అనసూయ, ఆరు జిల్లాల కలెక్టర్లు, డిఎం అండ్ హెచ్ ఓలు, డిసిహెచ్ లు, ఎంజిఎం సూపరింటెండెంట్, ఆర్ ఎం ఓలు, వైద్యశాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.