మున్నేరు బ్రిడ్జి ప్రవాహాన్ని పరిశీలించిన మంత్రి పువ్వాడ
ఖమ్మం, ఆగస్టు 21: గత మూడు రోజులుగా మళ్ళీ ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల ధాటికి వాగులు వంకలు పొంగి ప్రవహిస్తున్నాయని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. శుక్రవారం ఖమ్మం నగరంలోని మున్నేరు బ్రిడ్జి వద్ద ఉదృతంగా ప్రవహిస్తున్న మున్నేరు ప్రవాహాన్ని మంత్రి పువ్వాడ జిల్లా కలెక్టర్ RV కర్ణన్ తో కలిసి పరిశీలించారు.
ఈ సందర్బంగా మీడియాతో మంత్రి మాట్లాడుతూ.. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కురిసిన వర్షాల ధాటికి అనేక లోతట్టు ప్రాంతాల నిర్వాసితులకు ఇప్పటికే పునరావాసం కల్పించడమైందన్నారు. భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లా కలెక్టర్ల నుండి ఎప్పటికప్పుడు సమాచారం తెప్పించుకుంటున్నామని వివరించారు. ఇప్పటికే ఆయా లోతట్టు ప్రాంత ప్రజలు ఇళ్ళను ఖాళీ చేయించి పునరావాసం కల్పించి, అధికారులు అప్రమత్తం చేయడమైందన్నారు.
సమీప ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించి వారికి భోజన ఏర్పాట్లతో పాటు అన్ని సౌకర్యాలు కల్పించడం జరిగిందన్నారు. ఎలాంటి విపత్కర పరిస్థితులనైనా ఎదుర్కోవడానికి అధికారులు సిద్ధంగా ఉండాలన్నారు. వరద ఉధృతి తగ్గే వరకు గోదావరి, మున్నేరు పరివాహక ప్రాంత ప్రజలంతా అంతా జాగ్రత్తగా ఉండాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
మణుగూరు ఊరులోకి వరద నీరు చేరడంతో తక్షణ సహాయక చర్యలు చేపట్టామని, సహాయక చర్యలు కొనసాగుతూనే ఉన్నాయన్నారు. ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించే వరకు అధికారులు బాధ్యతాయుతంగా ఉండాలని ఆదేశించామన్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా చెరువుల పట్ల అధికారులు, రైతులు అప్రమత్తంగా ఉండాలని మంత్రి ఆదేశించారు.
గ్రామాల్లో చెరువులు గండి పడకుండా చూడాలని, ఒకవేళ గండి పడితే వెంటనే గండి పూడ్చివేతకు అవసరమైన చర్యలను తీసుకునే విధంగా అధికారులు రైతులు అప్రమత్తంగా ఉండాలన్నారు.