డ్రైవర్ ఎంపవర్మెంట్ పథకం కింద కార్లను పంపిణీ చేసిన మంత్రి సత్యవతి రాథోడ్
- డ్రైవర్ ఎంపవర్మెంట్ పథకం కింద 31 మంది గిరిజనులకు కార్లను పంపిణీ చేసిన రాష్ట్ర గిరిజన, స్త్రీ – శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్
(హైదరాబాద్, సెప్టెంబర్ 07): తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఒక్కరు సంతోషంతా, సుఖంగా ఉండాలని ముఖ్యమంత్రి కేసిఆర్ ప్రవేశపెట్టిన పథకాల్లో డ్రైవర్ కమ్ ఓనర్ పథకం నేడు అనేక మంది గిరిజనుల జీవన ప్రమాణాలు పెంచుతోందని రాష్ట్ర గిరిజన, స్త్రీ – శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. ఈ పథకం కింద గత రెండేళ్లలో దాదాపుగా 500 మంది గిరిజనులకు కార్లు ఇచ్చామని, వచ్చే ఆర్ధిక సంవత్సరం నాటికి మరో 1000 మందికి ఇవ్వాలన్న ఆలోచనతో ఉన్నామన్నారు.
గిరిజన యువకులను డ్రైవర్ల నుంచి ఓనర్లు మార్చే డ్రైవర్ ఎంపవర్మెంట్ పథకం కింద 31 మంది గిరిజన యువకులకు నేడు దామోదర సంజీవయ్య సంక్షేమ భవన్ లో మంత్రి సత్యవతి రాథోడ్ కార్లను పంపిణీ చేశారు. ట్రైకార్ సంస్థ, మారుతి సుజుకి, ఉబర్ సంయుక్తంగా ఈ గిరిజన యువతకు కార్లను పంపిణీ చేయడం, ఉత్తమ డ్రైవర్లుగా శిక్షణ ఇవ్వడం, కార్లు తీసుకున్న తర్వాత కిరాయిలు దొరకకపోతే ఇబ్బంది పడవద్దని ఉబర్ సంస్థతో ఒప్పందం చేయించడం వారికి చాలా ఉపయోగపడుతుందన్నారు.
ఒక ఎస్.బి. ద్వారానే ఇప్పటి వరకు 2500 మందికి కార్లను ఇచ్చారంటే ఈ పథకం కింద ఎంతమందికి లబ్ది చేకూరుతుందో ఆలోచించాలన్నారు.
భవిష్యత్ లో గ్రామాల నుంచి హైదరాబాద్ కు వచ్చి వేరే కంపెనీలలో, ఇతరుల వద్ద గిరిజనులు డ్రైవర్లుగా ఉండకుండా అందరినీ ఓనర్లుగా మార్చేందుకు ప్రయత్నం చేస్తున్నామన్నారు.
కేవలం డ్రైవర్లను ఓనర్లుగా చేయడమే కాకుండా గిరిజనులకు డిజిటల్ లిటరసీ ఇవ్వడం ద్వారా టెక్నాలజీలో వారిని నిష్ణాతులుగా మార్చి, టెక్నాలజీ రంగంలో ఉపాధి కల్పించే ట్రైబల్ డిజిటల్ లీడర్ షిప్ కార్యక్రమం కూడా ఈ రోజు ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమం వల్ల అడవుల్లో ఉన్న గిరిజనులు కూడా డిజిటల్ అక్షరాస్యత పొందడం ద్వారా, టెక్నాలజీలో వచ్చే మార్పులను తెలుసుకోవడం ద్వారా అందరితో పోటీ పడే విధంగా అభివృద్ది చెందుతారన్నారు.
కేంద్ర గిరిజన వ్యవహారాల శాఖ, ఫేస్ బుక్ సంయుక్తంగా గిరిజనులను డిజిటల్ లీడర్లుగా మార్చేందుకు ఈ కార్యక్రమం చేపట్టిందన్నారు. అయితే చాలా మంది యువతకు ఇందులో అవకాశం రాకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సాహంతో నిర్మాణ్ అనే సంస్థ హైసా అనే మరో సంస్థతో కలిసి దాదాపు 60 మంది గిరిజన మహిళలను ట్రైబల్ డిజిటల్ లీడర్లుగా తీర్చిదిద్దేందుకు ముందుకు రావడం అభినందనీయమన్నారు.
ఈ కార్యక్రమంలో గిరిజన సంక్షేమ శాఖ కమిషనర్, కార్యదర్శి డాక్టర్ క్రిస్టినా జడ్ చోంగ్తు, అదనపు కార్యదర్శి ఈ. శ్రీధర్, ఎస్సీ అభివృద్ధి శాఖ కమిషనర్ డాక్టర్ యోగితా రాణా, ఉబర్, మారుతి సుజుకీ, ఎస్.బి.ఐ ప్రతినిధులు పాల్గొన్నారు.