1,17,950 ఎకరాల భూమికి నేటి నుంచి సర్వే
- సీతారామా లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కింద నూతన ఆయకట్టు
- ఇల్లెందు, వైరా, పినపాక, కొత్తగూడెం నియోజకవర్గాలు సస్యశ్యామలం
- మంత్రి చొరవతో మహబూబాబాద్ జిల్లాలో 48,446 నూతన ఆయకట్టు
- ములుగు జిల్లాలో గోదావరి ఫ్లడ్ బ్యాంక్స్ పనులకు రూ.200 కోట్లకు మంజూరు కావాలి
- ములుగులో వాగులపై 16 చెక్ డ్యామ్ లకు అటవీ అనుమతులు లభించాలి
- సీతారామ ప్రాజెక్టుపై సమీక్షా సమావేశంలో మంత్రి సత్యవతి రాథోడ్
బయ్యారం చెరువును బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ చేయాలని, దాని స్టోరేజీ సామర్థ్యం పెంచడం వల్ల గ్రావిటీ ద్వారా దిగువ ప్రాంతమంతా సాగుబడిలోకి వస్తుందని, దీనికనుగుణంగా చర్యలు తీసుకోవాలని మంత్రి సత్యవతి రాథోడ్ కోరారు.
సీతారామా ప్రాజెక్టుగానీ, ఎస్.ఆర్.ఎస్.పి ద్వారా గానీ మహబూబాబాబాద్ రైల్వే ట్రాక్ దాటించి సాగునీరు అందకుండా మిగిలిన ప్రాంతానికంతా సాగునీరు అందించేలా డిజైన్ రూపొందించాలని అధికారులను ఆదేశించారు.
ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ప్రాంతాలన్నింటికి సీతారామా లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు ద్వారా నీరందించాలనే ఉద్దేశ్యంతో రాష్ట్ర గిరిజన, స్త్రీ – శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్, రాష్ట్ర రవాణా శాఖ మంత్రి అజయ్ కుమార్ నేతృత్వంలో నేడు రవాణా శాఖ కార్యాలయంలో సమావేశం జరిగింది. ఈ సమావేశానికి మహబూబాబాద్ ఎంపీ మాలోతు కవిత, విప్ రేగ కాంతారావు, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీ నారాయణ, ఎమ్మెల్యేలు సండ్ర వెంకటవీరయ్య, లావుడ్య రాములు, హరిప్రియ నాయక్, కందాల ఉపేందర్ రెడ్డి, సిఎం కార్యాలయ కార్యదర్శి స్మిత సబర్వాల్, ఇరిగేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ రజత్ కుమార్, ఇంజనీర్ ఇన్ చీఫ్ మురళీధర్ రావు, ఖమ్మం కలెక్టర్ కర్నన్, మహబూబాబాద్ కలెక్టర్ గౌతమ్, ములుగు కలెక్టర్ కృష్ణ ఆదిత్య, భద్రాద్రి కొత్తగూడ జిల్లా కలెక్టర్ ఎం.వి రెడ్డి, ఇతర అధికారులు హాజరయ్యారు.
సీతారామా లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కింద 7,70,150 ఎకరాల నూతన ఆయకట్టు రానుందని, దీనిలో ఇప్పటికే 6,52,200 ఎకరాలు ప్రతిపాదించగా, తాజాగా మరో 1,17,950 ఎకరాలను కొత్తగా ప్రతిపాదించడం జరిగిందని సాగునీటి అధికారులు వివరించారు.
సీతారామ ప్రాజెక్టు వల్ల మహబూబాబాద్ జిల్లాలోని బయ్యారం, గార్ల, డోర్నకల్ మండలాల్లో మంత్రి చొరవతో కొత్తగా 48,446 ఎకరాల ఆయకట్టు ఏర్పడుతుందని అధికారులు తెలిపారు.
సీతారామా ప్రాజెక్టు కింద కొత్తగా 1,17,950 ఎకరాలకు సాగునీరు అందించేందుకు గుర్తించామని, దీనికి సర్వే చేసేందుకు ముఖ్యమంత్రి కేసిఆర్ అంగీకరించినట్లు తెలిపారు. నేటి నుంచే ఈ సర్వే ప్రారంభిస్తున్నట్లు వివరించారు.
సీతారామ ప్రాజెక్టు వల్ల ఖమ్మం, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లోని ఇల్లెందు, వైరా, పినపాక, కొత్తగూడెం నియోజక వర్గాల్లోని సాగుయోగ్యమైన భూములన్నింటికీ నీరు అందుతుందని తెలిపారు. భద్రాద్రి కొత్తగూడెం, గొండిగూడెం వద్ద దాదాపు 236 కోట్ల రూపాయల అంచనాతో మారెల్లిపాడు పంప్ హౌజ్ వస్తుందని, దీనికింద దాదాపు 16వేల ఎకరాలకు నీరు అందుతుందన్నారు. ఇదే జిల్లాలో పాల్వంచ మండలం, నాగారంలో కుండేటితోగు చెరువు వద్ద 15 కోట్ల రూపాయల అంచనాతో పంప్ హౌజ్ వస్తుందని, దీనికింద 3000 ఎకరాలకు సాగునీరు అందుతుందన్నారు.
లలితాపురం, రోళ్లపాడు, రోంపేడు ట్యాంక్స్ ద్వారా ఇల్లెందు నియోజక వర్గంలోని దాదాపు 1,38,705 ఎకరాలకు సాగునీరు అందుతుందన్నారు. ఈ ట్యాంకుల నుంచి బయ్యారం చెరువు వరకు నీరు చేరి గార్ల, బయ్యారంలోని 33,576 ఎకరాలు కూడా సాగులోకి రానున్నాయన్నారు.
ములుగు జిల్లాలో ఏటూరు నాగారం, రామన్న గూడెం, మంగంపేట వద్ద గోదావరి ఫ్లడ్ బ్యాంక్స్ కోసం దాదాపు 200 కోట్ల రూపాయలకు పరిపాలన అనుమతులు ఇవ్వాలని కోరారు. ఈ అంశాన్ని గౌరవ సిఎం కేసిఆర్ దృష్టికి తీసుకొచ్చి మంజూరు చేయిస్తామని అధికారులు తెలిపారు.
వెంకటాపురం మండలంలోని పాలెం వాగు, వాజేడు మండలంలోని మోడికుంట వాగు పనులు సగం చేసి ఆగిపోయాయని వీటిని పూర్తి చేయడం ద్వారా దిగువ ప్రాంతంలో పెద్ద ఎత్తున సాగునీరు అందుతుందని మంత్రి కోరడంతో గౌవర సిఎం కేసిఆర్ దృష్టికి తీసుకెళ్లి మిగిలిన పనులు పూర్తి చేయిస్తామని హామీ ఇచ్చారు. సమ్మక్క బ్యారెజీ(తుపాకుల గూడెం)కి అటవీ అనుమతులు వచ్చాయని, అందువల్ల దీనిని త్వరగా పూర్తి చేయాలని మంత్రి సమావేశంలో అధికారులను కోరారు.
ములుగు జిల్లాలో ఉన్న వివిధ వాగుల మీద 16 చెక్ డ్యామ్ లకు అటవీ శాఖ అనుమతులు వచ్చేలా సమన్వయం చేయాలని, తద్వారా చాలామంది ఆదివాసీలు, గిరిజనులకు లబ్ది చేకూరుతుందని కోరడంతో వెంటనే మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు.
శ్రీరామ్ సాగర్ ఆయకట్టు కింద స్థిరీకరణకు ప్రత్యేకంగా ములుగులో సమావేశం పెట్టుకుని, క్షేత్ర స్థాయిలో సమస్యలన్నీ అధ్యయనం చేసి పరిష్కారం చేయాలని మంత్రి కోరడంతో అధికారులు అంగీకరించారు.