ఘనంగా పోలీస్ అమర వీరుల దినోత్సవం, పోలీస్ ఫ్లాగ్-డే కార్యక్రమాలు: తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి
హైదరాబాద్, సెప్టెంబర్ 26 : అక్టోబర్ 21 తేదీన నిర్వహించే పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించడంతో పాటు, 21 వ తేదీ నుండి అక్టోబర్ 31 వ తేదీ వరకు పోలీస్ ఫ్లాగ్ డే పేరుతో సంస్మరణ దినోత్సవాలను నిర్వహిస్తున్నట్టు తెలంగాణ డీజీపీ ఎం.మహేందర్ రెడ్డి తెలియజేశారు. నేడు సాయంత్రం డీజీపీ కార్యాలయంలో పోలీసు అమర వీరుల దినోత్సవాల ఏర్పాటుపై సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశానికి అదనపు డీజీపీ లు గోవింద్ సింగ్, రాజీవ్ రతన్, జితేందర్, శివధర్ రెడ్డి, అభిలాష బీస్ట్, ఐజీలు నవీన్ చంద్, నాగిరెడ్డి, హైదరాబాద్ సిపీ అంజనీ కుమార్, సైబరాబాద్ సిపీ వీ.సి. సజ్జనార్ లు హాజరయ్యారు. ఈ సందర్బంగా డీజీపీ మహేందర్ రెడ్డి మాట్లాడుతూ, పూర్తిగా కోవిడ్ నిబంధనలను పాటిస్తూ నిర్వహించే ఈ పోలీసు అమరవీరుల దినోత్సవం, పోలీస్ ఫ్లాగ్ డే కార్యక్రమాలలో పౌరులను పెద్ద ఎత్తున పాల్గొనే విధంగా చర్యలు చేపడుతున్నట్టు తెలిపారు. ఈసారి అక్టోబర్ 21 వ తేదీ నుండి అక్టోబర్ 31 వ తేదీ వరకు నిర్వహించే కార్యక్రమాలను పోలీస్ ఫ్లాగ్- డే గా వ్యవహరించాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిందని వెల్లడించారు.
పోలీస్ ఫ్లాగ్-డే ఫండ్ ఏర్పాటు:
దేశ అంతర్గత భద్రతలో కీలక పాత్ర వహిస్తూ విధి నిర్వహణలో అమరులైన, వైకల్యం పొందిన పోలీసులు, వారి కుటుంబాలకు తగు ఆర్థిక సహాయం చేయడానికి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా పోలీస్ ఫ్లాగ్ డే ఫండ్ ను ఏర్పాటు చేసిందని వెల్లడించారు. ఈ ఫండ్ జాతీయ పోలీస్ మెమోరియల్ సొసైటీ (ఎన్.పీ.ఎం.ఎస్) ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. విధి నిర్వహణలో అమరులైన కుటుంబాలకు, వికలాంగులకు, పెన్షనర్లకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తగు విధంగా ఆర్థిక, ఇతర సహాయ సహకారాలు అందిస్తున్నప్పటికీ, మరింత ఆర్థిక సహాయ సహకారాలు, భద్రత, పునరావాస కార్యక్రమాలు కల్పించే ఉద్దేశ్యంతో ఈ పోలీస్ ఫ్లాగ్-డే ఫండ్ ఏర్పాటు చేశారని అన్నారు. దీనికి సంబందించిన విధి విధానాలు త్వరలోనే ప్రకటించనున్నారని చెప్పారు.
అక్టోబర్ 21 తేదీనుండి 31 వతేదీ వరకు పలు కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు వివరించారు. ఈ పది రోజులలో పోలీసులు ప్రజలకు అందిస్తున్న సేవలు, విధినిర్వహణలో వారు ఎదుర్కొంటున్న కష్టాలు, పోలీసులనుండి ప్రజలు మరే ఇతర సేవలను ఆశిస్తున్నారని విషయాలపై ప్రజలకు అవగాహన కార్యక్రమాలను నిర్వహించాలని డీజీపీ పేర్కొన్నారు.
పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం రోజున నిర్వహించే పోలీస్ పరేడ్, తదితర కార్యక్రమాలను ప్రత్యక్ష ప్రసారం చేయడం ద్వారా ప్రజలతో పాటు, రిటైర్డ్ పోలీస్ అధికారులు నేరుగా చూసే సౌకర్యాన్ని కల్పించాలని ఆదేశించారు. పోలీస్ అమరులపై హైదరాబాద్ లో ఛాయా చిత్ర ప్రదర్శన, విద్యార్థినీ, విద్యార్థులకు వ్యాస రచన, వకృత్వ పోటీలు, వివిధ స్థాయిలోని పోలీస్ అధికారులకు కూడా వ్యాసరచన పోటీలు నిర్వహించాలని అన్నారు.
ఈ పోటీలను వెబ్నార్ ద్వారా నిర్వహించాలని పేర్కొన్నారు. విధి నిర్వహణలో అమరులైన పోలీస్ అధికారుల పేరును సంబంధిత ప్రాంతాల్లో ఏదైనా ఒక వీధికి గాని, కాలనీకి గాని పెట్టే విధంగా చర్యలు చేపట్టాలని సూచించారు. సీనియర్ పోలీస్ అధికారులు పోలీస్ అమరుల ఇళ్లను సందర్శించి వారి బాగోగులు, వారి అవసరాలను తెలుసుకొని పరిష్కరించే ప్రయత్నం చేయాలని అన్నారు.