కరోనా వ్యాధి లక్షణాలు ఉంటే వెంటనే కోవిడ్ పరీక్షలు చేసుకోవాలి: మంత్రి పువ్వాడ
ఖమ్మం: కరోనా వ్యాధి లక్షణాలు ఉంటే వెంటనే ప్రభుత్వ ఆసుపత్రిలో కానీ, సంచార వాహనాల వద్ద కోవిడ్ పరీక్షలు చేసుకొని తగు వైద్యం తీసికోవలని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు.
ఖమ్మం జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో రూ. 50 లక్షలతో నూతనంగా ఏర్పాటు చేసిన లిక్విడ్ ఆక్సిజన్ ట్యాంకు(LOT)ను బుధవారం మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ప్రపంచ వ్యాప్తంగా మహమ్మారిగా మారిన కరోనా వ్యాధి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. కరోనాతో ఆందోళన పడాల్సిన భయం లేదని అలాగని నిర్లక్ష్యంగా కూడా ఉండవద్దని సూచించారు. లక్షణాలు ఉంటే వెంటనే పరీక్షలు చేయించుకోవాలని, కోవిడ్ నిర్ధారణ అయితే ఇంటి వద్దనే క్వారెంటైన్ లో ఉండాలని, లేదంటే ప్రభుత్వ ఆసుపత్రిలో ఉచితంగా వైద్య సేవలు అందించేందుకు వైద్య బృందం, నర్సులు, స్టాఫ్ సిద్ధంగా ఉన్నారని చెప్పారు.
తెలంగాణ రాష్ట్రంలో కరోనా నుంచి కోలుకుంటున్న సక్సెస్ రేట్ 99 శాతం చాలా ఎక్కువగా ఉన్నదని, కేవలం 1శాతం మాత్రమే మృత్యువాత పడుతున్నారని మంత్రి పువ్వాడ పేర్కొన్నారు. కరోనా నేపథ్యంలో ఆక్సిజన్ అవసరాలు పెరిగాయని, తద్వారా వైద్య సిబ్బంది ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని గమనించి, గతంలో ఆక్సిజన్ సిలిండర్ల సరఫరాతో జరిగిన ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని శాశ్వత ప్రాతిపదికన జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో లిక్విడ్ ఆక్సిజన్ ట్యాంకును తెప్పించినట్లు పేర్కొన్నారు.
24/7 ప్రభుత్వ ఆసుపత్రిలో 1300 కేవీ సమర్థ్యంతో రూ.50 లక్షలతో ఏర్పాటు చేసిన లిక్విడ్ ఆక్సిజన్ ట్యాంక్(LOT) యూనిట్ ఒకేసారి 1400 ఆక్సిజన్ సిలిండర్ల కు సమానం అన్నారు. ప్రభుత్వ ఆసుపత్రి, కోవిడ్ వార్డు, మాతాశిశు కేంద్రంలో నిరవధికంగా 9రోజుల పాటు ప్రాణవాయులువు సరఫరా చేయొచ్చని, ప్రభుత్వమే నేరుగా ప్రాణవాయువు సరఫరా చేస్తున్నందున ఇక ఆక్సిజన్ కి కొరత ఉండదన్నారు. రూ. 50 లక్షల వ్యయంతో లిక్విడ్ ఆక్సిజన్ ట్యాంకును శాశ్వత ప్రాతిపాదికన ఏర్పాటు చేశామని మంత్రి తెలిపారు. రాష్ట్రంలో సిద్దిపేట జిల్లా తర్వాత రెండవ LOT ఖమ్మంలో నెలకొల్పమన్నారు. కరోనా నేపథ్యంలో లిక్విడ్ ఆక్సిజన్ ట్యాంకు ద్వారా నిర్విరామంగా ఆక్సిజన్ సప్లయ్ చేయనున్నట్లు చెప్పారు.
ఖమ్మంలో ప్రభుత్వ ఆసుపత్రిలో కోవిడ్ ప్రత్యేక ఆసుపత్రి ఉన్నందుని అందుబాటులో మంచి డాక్టర్లు ఉన్నారని, అవసరమైన అన్నీ మందులు అందుబాటులో ఉన్నాయని, ఆక్సిజన్ సప్లయ్ సమస్య ఇవాల్టితో శాశ్వతంగా పరిష్కారమైందని తెలిపారు. కరోనా వ్యాధి తీవ్రత ఉంటే వెంటనే ఆసుపత్రికి వెళ్లాలని, ఉచితంగా వైద్య సేవలు అందించేందుకు వైద్య బృందం, నర్సులు, స్టాఫ్ సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు. మాకేమీ కాదులే.. అనుకుని ట్రీట్మెంట్ తీసుకోకుండా వారం, 10 రోజులు నిర్లక్ష్యం చేయడంతో ఇతర అవయవాలపై ప్రభావం పడి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని ప్రజలకు హితవు చెప్పారు.
కరోనా అంటే భయపడాల్సిన అవసరం లేదని, అలాగని నిర్లక్ష్యంగా ఉండొద్దని, ఆలస్యం చేయొద్దని ప్రజలను కోరారు. ప్రతి పీహెచ్ సీ ద్వారా జిల్లా ఆసుపత్రిలో, ప్రతీ మండల కేంద్రంలో కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నట్లు, కరోనా పాజిటివ్ అని తెలగానే వ్యాధి తీవ్రతను బట్టి హోమ్ ఐసోలేషన్, ఆసుపత్రిలో అడ్మిషన్ చేయడం జరుగుతుందని మంత్రి పేర్కొన్నారు. పరీక్షలు కూడా జిల్లాలోని ప్రతీ పీహెచ్ సీ, ప్రతి ఆసుపత్రి, మండల కేంద్రాల్లో కోవిడ్ టెస్టులు చేస్తున్నట్లు, పరీక్షలకు లిమిట్ లేదని ఎంత మంది వస్తే ప్రభుత్వ కోవిడ్ ఆసుపత్రి డాక్టర్లు పరీక్షలు చేస్తారని తెలిపారు. పాజిటివ్ వచ్చిన వారికి వైద్య బృందం టచ్ లో ఉండి అవసరమైన ట్రీట్మెంట్ అందిస్తున్నట్లు మంత్రి పేర్కొన్నారు.
కరోనా పరీక్షలు కూడా చేసిన వెంట వెంటనే రిజల్ట్స్ ఇస్తున్న దరిమిలా అవసరమైన ట్రీట్మెంట్ తీసుకుని ప్రభుత్వ ఆసుపత్రి వైద్య సేవలు వినియోగించుకోవాలని మంత్రి ప్రజలను కోరారు.
కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ RV కర్ణన్, జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజ్, మేయర్ పాపాలాల్, సుడా చైర్మన్ విజయ్ కుమార్, DM&HO మాలతి, మున్సిపల్ కమీషనర్ అనురాగ్ జయంతి, డిప్యూటీ మేయర్ బత్తుల మురళి, కార్పొరేటర్లు, వైద్యులు తదితరులు ఉన్నారు.
మెరూన్ రంగు పాస్ బుక్ ను మంజూరు చేస్తాం: మంత్రి ఖమ్మం నగరంలో ప్రభుత్వ స్థలాల్లో పేదలు ఇండ్ల నిర్మించుకుని ఎలాంటి భద్రత లేకుండా ఉన్న నివాసాలకు మెరూన్ రంగు పాస్ బుక్ ను మంజూరు చేయనున్నట్లు రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తెలిపారు.
ఖమ్మం కార్పొరేషన్ పరిధిలోని 39, 40, 44వ డివిజన్లలో మంత్రి పువ్వాడ బుధవారం పర్యటించారు. తెలంగాణ ప్రభుత్వ ఆదేశాల మేరకు మెరూన్ పాస్ బుక్ పై ప్రజల్లో అపోహలు, అనుమానాలు తొలగించి చైతన్యం, అవగాహన కల్పించాలని మున్సిపల్ కమీషనర్ అనురాగ్ జయంతికి సూచించారు.
స్థానిక నివాసాల ప్రజలతో మాట్లాడారు. తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయదారులకు పట్టాదారు పాసు పుస్తకాల తరహాలో ప్రభుత్వ స్థలంలో ఇండ్ల కట్టుకుని నివాసం ఉంటున్న వారికి మెరూన్ పాసు పుస్తకాలు ఇవ్వాలని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్ణయించినందున ఆయా వివరాలతో కూడిన రికార్డును పకడ్బందీగా తయారు చేస్తున్నట్లు పేర్కొన్నారు. సిఎం కెసిఆర్ నిర్ణయం మేరకు నగరాల్లో, గ్రామాల్లోని ప్రతి ఇల్లు, అంగుళాన్ని రికార్డు చేయాలని మంత్రి సూచించారు.
కొత్త రెవిన్యూ చట్టంలో భాగంగా, వ్యవసాయ భూములకు మాదిరిగానే ఇండ్లు, ఇతర అన్ని రకాల నిర్మాణాలకు కూడా భద్రత కల్పిస్తూ, పట్టాదారు పాసు పుస్తకాల ఇవ్వాలని సిఎం కెసిఆర్ నిర్ణయించారన్నారు. భూములకు భద్రత కల్పించడంతోపాటు, ఆయా భూ, ఇండ్ల యజమానులకు భరోసానివ్వాలన్నదే ప్రభుత్వ లక్ష్యమన్నారు.
నగరంలో ఇంటి నెంబర్, విద్యుత్ మీటర్ ఉన్న ప్రతి ఇల్లు, ఇతర నిర్మాణాల వివరాలు, వ్యవసాయ క్షేత్రాల్లోని ఇండ్లు, వగైరాలన్నీ ప్రతి అంగుళం రికార్డు చేయాలని అందుకు తగ్గట్లుగా, కింది స్థాయి వరకు ఆదేశాలు వెళ్ళాలని జిల్లా కలెక్టర్ RV కర్ణన్ కి సూచించారు.
ఎలాంటి లోపాలు లేకుండా రికార్డు ప్రక్రియను ఓ ప్రణాళికాబద్ధంగా, వేగంగా పూర్తి చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు. అలాగే ప్రజల్లో అనుమానాలు, అపోహలుంటే తొలగించాలని చెప్పారు. కేవలం భద్రత కల్పించడమే తప్ప, ఇందులో హిడెన్ ఎజెండా ఏదీ లేదనే విషయాన్ని ప్రజలకు అర్థం అయ్యే విధంగా వివరించాలన్నారు. దళారులు, ఇతరులెవరికీ డబ్బులు కూడా ఇవ్వాల్సిన పని లేదని, ఆన్ లైన్ ప్రక్రియ పూర్తి ఉచితంగా జరుగుతుందన్న విషయంపై ప్రజల్లో అవగాహన, చైతన్యం పెంచాలని మంత్రి సూచించారు. అందుకు ప్రజలు సహకరించాలని కోరారు.