కరోనా తీవ్రత తగ్గింది: మంత్రి ఎర్రబెల్లి
- తగ్గుముఖం పట్టిన కరోనా వైరస్
- అతి తక్కువగా నమోదవుతున్న కేసులు
- తొర్రూరులో కొంచెం జాగ్రత్త
- టెలీ కాన్ఫరెన్సులో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, గురువారం పాలకుర్తి మండలంలో 51 మందికి పరీక్ష చేస్తే, ఒక్కరికి, కొడకండ్ల మండలంలో 41మందికి పరీక్ష చేస్తే, ఇద్దరికి, పెద్ద వంగర మండలంలో ఒక్కరికీ కూడా రాలేదని, రాయపర్తి మండలంలో 50 మందికి పరీక్ష చేస్తే, ముగ్గురికి, దేవరుప్పుల మండలంలో 31మందికి పరీక్ష చేస్తే ఒక్కరికి మాత్రమే కరోనా పాజిటివ్ వచ్చిందన్నారు.
ఒక తొర్రూరులో మాత్రమే 305 మందికి పరీక్షలు చేయగా, 26 మందికి కరోనా పాజిటివ్ వచ్చిందన్నారు. అలాగే చీకటాయపాలెం నుంచి కేసులు కొద్దిగా ఎక్కువగా ఉన్నాయని వివరించారు. కరోనా పాజిటివ్ వచ్చినవాళ్ళంతా ఇంట్లోనే క్వారంటైన్ అయ్యారని, ఎవరూ సీరియస్ గా లేరని మంత్రి ఎర్రబెల్లి చెప్పారు. దీన్ని బట్టి కరోనా తీవ్రత తగ్గిందనే విషయం అర్థమవుతున్నదన్నారు.
ప్రజలు మరికొంతకాలం అప్రమత్తంగా ఉంటే సరిపోతుందన్నారు. అధికారులు, డాక్టర్లు కరోనా పాజిటివ్ కేసులు అధికంగా ఉన్న గ్రామాలపై దృష్టి సారించాలని చెప్పారు. స్థానిక ప్రజాప్రతినిధులు ప్రతి రోజూ కరోనా బాధితులతో, వారి కుటుంబ సభ్యులతో మాట్లాడాలని, వారికి ధైర్యం చెప్పడమేగాక, నిరుపేదలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేసి, ఆదుకోవాలని మంత్రి ఎర్రబెల్లి ఆదేశించారు. ఈ టెలీ కాన్ఫరెన్సు లో వైద్యాధికారులు, పోలీసులు, స్థానిక ప్రజాప్రతినిధులు, కరోనా బాధితులు, వారి కుటుంబాల సభ్యులు పాల్గొన్నారు.