మూసికి డోకాలేదు: మంత్రి జగదీష్ రెడ్డి
- ఈ తెల్లవారుజామున 4 గంటల నుండి పెరిగిన ఉధృతి
- ఊహించిన దానికి రెట్టింపుగా ప్రవాహం
- 2 లక్షల క్యూసెక్కుల పై చిలుకు ఉధృతి
- సమాచారం తెలిసిన వెంటనే అధికారులను అప్రమత్తం చేసిన మంత్రి జగదీష్ రెడ్డి
- నీటిపారుదల ఉన్నతాధికారులతో పాటు సూర్యపేట, నల్గొండ జిల్లాల కలెక్టర్లతో ఫోన్ లో సమీక్ష
- అప్రమత్తంగా ఉండాలి అంటూదిగువ ప్రాంతం ప్రజలకు సోషల్ మీడియా ద్వారా విజ్ఞప్తి
- ఉధృతి తీవ్రం అవుతున్న నేపధ్యంలో శాసనమండలి సమావేశాల నుండి మూసికి చేరుకున్న మంత్రి జగదీష్ రెడ్డి
సూర్యపేట జిల్లా రత్నపురం వద్ద గండి పెట్టి నీటిని కిందికి వదలాలి అంటూ అధికారులను ఆదేశించారు. అదే సమయంలో సోషల్ మీడియా ద్వారా ఆయకట్టు కింది ప్రజలను జాగ్రత్తగా ఉండాలి అంటూ విజ్ఞప్తి చేసారు. అయినా వరద ఉధృతి తగ్గకపోవడంతో శాసనమండలి సమావేశంలో ఉన్న ఆయన హుటాహుటిన మూసి ఆయకట్టు మీదకు చేరుకుని అత్యవసర ద్వారాలతో పాటు పూర్తిగా తలుపులు తీయించి 1.75 లక్షల క్యూసెక్కుల నీటిని కిందికి వదలడంతో ఆయకట్టు రైతాంగం ఊపిరి పీల్చుకుంది.
ఈ సందర్భంగా మంత్రి జగదీష్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ చరిత్రలో ముందెన్నడూ ఊహించని రీతిలో వరద ఉధృతి మూసికి చేరిందన్నారు. రెండు లక్షల పై చిలుకు క్యూసెక్కుల నీటి ప్రవాహం ఒక్కసారి మూసికి చేరడంతో ఈ పరిస్థితి ఉత్పన్నమైనదన్నారు.
అయితే అధికారులు అప్రమత్తంగా ఉండడంతో అటు సూర్యపేట జిల్లా రత్నపురం వద్ద గండి పెట్టడంతో పాటు అత్యవసర తలుపులతో సహా అన్నింటినీ తెరువడంతో 1.73 వేల క్యూసెక్కుల నీటిని కిందికి విడుదల చేసినట్లు ఆయన వెల్లడించారు. హైదరాబాద్ నుండీ వస్తున్న వరద ఉధృతితో పాటు బిక్కేరు నుండి వస్తున్న వరద ఉధృతిని అంచనా వేసేందుకు నీటిపారుదల అధికారులు ఇక్కడే ఉండి సమీక్షిస్తారని ఆయన తెలిపారు. అంతేగాకుండా ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులను సమన్వయం చేసుకుని నీటి ప్రవాహాన్ని కట్టడి చేసేందుకు చర్యలు తీసుకుంటారని మంత్రి జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. కాగా మంత్రి జగదీష్ రెడ్డి వెంట నల్గొండ జిల్లా ప్రజాపరిషత్ చైర్మన్ బండా నరేందర్ రెడ్డి, నకిరేకల్ శాసనసభ్యులు చిరుమర్తి లింగయ్య సూర్యపేట, నల్గొండ జిల్లాకు సంబంధించిన ఉన్నతాధికారులు ఉన్నారు.