గజ్వేల్ ప్రాంతంలో అటవీ పునరుద్ధరణ కార్యక్రమాలు భేష్: తెలంగాణ డీజీపీ
- ప్రభుత్వం, అటవీ శాఖ కృషి ఫలించింది
- అటవీ శాఖ అధికారులు, జిల్లా కలెక్టర్ కు డీజీపీ మహేందర్ రెడ్డి కితాబు
గజ్వేల్ అటవీ ప్రాంతంలో చేపట్టిన అడవుల పునరుద్ధరణ కార్యక్రమాన్ని క్షేత్ర స్థాయిలో పరిశీలించే ముందు ములుగు అటవీ కళాశాల, పరిశోధన కేంద్రంలో సమావేశ హల్ లో అడవుల పునరుద్ధరణ పనులను అటవీశాఖ పీసీసీఎఫ్ ఆర్ శోభ, పీసీసీఎఫ్ (SF) ఆర్.ఎం.డోబ్రియాల్ డీజీపీ, పోలీస్ అధికారులకు వివరించారు.
అడవుల్లో ఉన్న రూట్ స్టాక్ ను ఉపయోగించుకొని అడవుల్లో సహజమైన పద్ధతిలో చెట్ల పెంపకం చేపట్టామన్నారు. అడవి చుట్టూ కందకాలు తీశామని, దీనివల్ల అడవికి రక్షణ ఏర్పడుతుందని బయటి జంతువులు లోపలకు రావడంగానీ, లోపలి జంతువులు బయటకు వెళ్లడంగానీ సాధ్యం కాదన్నారు. ఆ కందకాల్లో నీరు నిల్వ ఉండటం వల్ల చెట్లకు కావల్సిన తేమ అందుతుందని అన్నారు.
కందకాల కట్టలపై గచ్చకాయ చెట్లు నాటడం వల్ల అడవికి సహజమైన రక్షణ ఏర్పడుతుందన్నారు. 30 రకాల పండ్ల చెట్లు కూడా అడవుల్లో పెంచుతున్నామని, దీనివల్ల గ్రామాలు, పట్టణాల్లోని కోతులు అడవికి వాపస్ పోతున్నాయని అటవీశాఖ అధికారులు చెప్పారు. అడవుల పునరుద్ధరణ వల్ల కాలుష్యం తగ్గుతుందని, ఉష్ణోగ్రతలు కూడా తగ్గుతాయని, వర్షపాతం పెరుగుతుందని, జీవ వైవిధ్యానికి అవకాశం కలుగుతుందని అటవీశాఖ అధికారులు పోలీస్ అధికారులకు చెప్పారు.
డీజీపీ మాట్లాడుతూ.. కేరళ, మెట్టుపలాయం (తమిళనాడు) మాదిరిగా కాలేజీ, యాదాద్రి నమూనా స్ఫూర్తిగా చేపట్టిన అటవీ పునరుద్ధరణ పనులు మెరుగైన ఫలితాలు వస్తున్నాయన్నారు. అటవీ విస్తీర్ణం, పచ్చదనం ప్రణాళిక బద్దంగా పెంచేందుకు అటవీ పరిశోధన సంస్థను ప్రభుత్వం స్థాపించిందన్నారు. అటవీ పరిశోధన స్థాపన వల్ల శాస్త్రీయంగా, వేగంగా అడవులను పునరుద్ధరణ జరుగుతుందన్నారు. ప్రభుత్వం, అటవీ శాఖలు నిబద్ధతతో అటవీ విస్తీర్ణం పెంచేందుకు కృషి చేస్తున్నాయన్నారు. జిల్లా యంత్రాంగం అద్భుత సహకారం అందిస్తుందనీ డీజీపీ కితాబునిచ్చారు.
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన తెలంగాణకు హరితహరం కార్యక్రమం కేవలం అటవీ శాఖది మాత్రమే కాదని అన్ని ప్రభుత్వ శాఖలు భాగస్వామ్యం కావాలని ముఖ్యమంత్రి పిలుపునివ్వడం వల్ల అన్ని ప్రభుత్వ శాఖలు, విభాగాలు హరితహరం కార్యక్రమం లో భాగస్వామ్యం అయ్యేలా చేసిందన్నారు. పోలీస్ శాఖ కూడా హరితహారంలో ముందు వరుసలో నిలిచిందన్నారు.
జిల్లా కలెక్టర్ వెంకట్రామ రెడ్డి మాట్లాడుతూ.. ప్రజా ప్రతినిధులు, ప్రజా భాగస్వామ్యంతో జిల్లాలో పచ్చదనం పెంపొందించే కార్యక్రమాలను ప్రణాళిక బద్దంగా చేపట్టామన్నారు. ఉపాధి హామీ నిధులను పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకున్నామన్నారు. మొక్కలు నాటేందుకు గుంతలు తవ్వడం దగ్గర నుంచి రెండు సంవత్సరాలు మొక్కల సంరక్షణ సైతం ఉపాధి హామీ నిధులను ఉపయోగించుకున్నామన్నారు. మొక్కల సంరక్షణకు హరిత సైనికులను నియమించి.. అటవీ శాఖ ద్వారా శిక్షణ ఇచ్చామన్నారు.
ప్రతి గ్రామంలో కనీసం 2 వేల మొక్కలు నాటేందుకు పెద్ద ఎత్తున మొక్కలు నాటే కార్యక్రమాలు చేపట్టామన్నారు. ప్రతి గ్రామంలో ప్రవేశ, నిష్క్రమణ రోడ్డు మార్గాలలో 2 నుంచి 3 కిలో మీటర్ల మేర అవెన్యూ ప్లాంటేషన్ చేపట్టామన్నారు. ఓ వైపు అడవుల పునరుద్ధరణ కార్యక్రమాలతో పాటు గ్రామాలలో పచ్చదనం పెంపు కార్యక్రమాలకు హరిత హరంలో భాగంగా ప్రాధాన్యం ఇచ్చామన్నారు. అన్ని కార్యాలయాలు, సంస్థలలో హరిత హరంను వ్యవస్థీకృతం చేశామన్నారు. జిల్లాలో చేపట్టిన అవెన్యూ ప్లాంటేషన్ విజయవంతం అయ్యిందన్నారు. దేశ వ్యాప్తంగా గుర్తింపు లభించిందన్నారు.
కార్యక్రమంలో పాల్గొన్న పోలీస్ అధికారులు అందరికీ పీసీసీఎఫ్ ఆర్ శోభ అటవీ శాఖ తరపున కృతజ్ఞతలు తెలిపారు. అటవీ ప్రభావిత ప్రాంతాలలో స్మగ్లింగ్ నిరోధానికి అటవీ రక్షణకు అలాగే అటవీ సంబంధిత నేరాల అదుపుకు పోలీస్ శాఖ సహకారాన్ని కొనసాగించాలని ఆమె కోరారు.