జీవాలకు మరిన్ని మెరుగైన ఉచిత వైద్య సేవలు: మంత్రి తలసాని
హైదరాబాద్: జీవాలకు మరిన్ని మెరుగైన ఉచిత వైద్య సేవలు అందించాలనేది ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ది, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చెప్పారు. బుధవారం మాసాబ్ ట్యాంక్ లోని తన కార్యాలయంలో పశుసంవర్ధక శాఖ అధికారులతో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ప్రధానంగా 1962 టోల్ ఫ్రీ తో సంచార పశువైద్యశాలల ద్వారా జీవాలకు అందుతున్న వైద్య సేవలపై సమీక్షించారు. ఈ సమావేశంలో పశుసంవర్ధక శాఖ కార్యదర్శి అనిత రాజేంద్ర, డైరెక్టర్ లక్ష్మారెడ్డి, అడిషనల్ డైరెక్టర్ రాంచందర్ లు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామాలలోని జీవాల వద్దకే వెళ్ళి వైద్య సేవలను అందించాలనే ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు నియోజకవర్గానికి ఒకటి చొప్పున 100 సంచార పశువైద్య శాలలను 2017 సంవత్సరంలో ప్రారంభించినట్లు వివరించారు. ఒక్కో వాహనంలో ఒక వైద్యుడు, ఒక పారా సిబ్బంది, హెల్పర్ ఉంటారని చెప్పారు. ఇందుకోసం నెలకు 2 కోట్ల రూపాయలను ఖర్చు చేస్తుందని తెలిపారు. జీవాలకు ఉత్తమమైన సేవలు అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఎన్ని నిధులు ఖర్చు చేసేందుకైనా వెనుకాడబోదని వివరించారు.
జిల్లా పశువైద్యాదికారులతో సమన్వయం చేసుకొని పని చేయడం ద్వారా జీవాలకు మెరుగైన వైద్యసేవలను అందించేందుకు కృషి చేయాలని సంచార పశువైద్యశాలల నిర్వాహకులైన GVK సంస్థ ప్రతినిధులను మంత్రి ఆదేశించారు. ప్రతి జిల్లా పశువైద్యాదికారి పరిధిలో ఒక కాల్ సెంటర్ ను ఏర్పాటు చేసి సంచార పశువైద్యశాలల పనితీరును నిరంతరం పర్యవేక్షించేలా చర్యలు తీసుకోవాలని పశుసంవర్ధక శాఖ కార్యదర్శి అనిత రాజేంద్రను మంత్రి ఆదేశించారు. రైతుల నుండి కాల్ సెంటర్ కు వచ్చే ప్రతి ఫోన్ కాల్ కు స్పందించి జీవాలకు వైద్యసేవలు అందేవిధంగా చూడాలని మంత్రి అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం ప్రతిరోజు సుమారుగా ఒక్కో వాహనం ద్వారా 19 వరకు జీవాలకు వైద్యసేవాలు అందిస్తున్నట్లు వివరించారు.
ప్రస్తుతం ఉదయం 7 నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు మాత్రమే 1962 సేవలు అందుతున్నాయని, ఈ సేవలను ప్రతిరోజూ రెండు విడతలుగా ఉదయం 7 నుండి మధ్యాహం 12 గంటల వరకు, సాయంత్రం 4 నుండి 7 గంటల వరకు జీవాలకు వైద్య సేవలు అందించేందుకు సంచార పశువైద్యశాలలు పనిచేసేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అన్ని వాహనాలలో పూర్తిస్థాయిలో సిబ్బంది, మందులు, పరికరాలు సక్రమంగా ఉన్నాయా? లేదా? అనే అంశాలను తప్పనిసరిగా పర్యవేక్షించాలని చెప్పారు. అంతేకాకుండా వివిధ పశువైద్యశాలలలో అదనంగా ఉన్న వైద్యులు, సిబ్బందిని అవసరమైన ఆసుపత్రులకు తరలించేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
పశుసంవర్ధక శాఖ డైరెక్టర్ కార్యాలయ ఉన్నతాధికారులు, జిల్లా అధికారులు వారంలో 2 రోజులు క్షేత్రస్థాయిలో పర్యటించి సిబ్బంది పనితీరు, జీవాలకు అందుతున్న వైద్యసేవలు, ప్రభుత్వ పథకాల అమలు తీరును పర్యవేక్షించాలని చెప్పారు. పశుసంవర్ధక శాఖ, GHMC అధికారులతో కూడిన ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి నగరంలో అక్రమంగా నిర్వహిస్తున్న స్లాటర్ హాజ్ లను గుర్తించి వాటిపై తగు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.