జనసేన పార్టీకి సేవ చేసిన ప్రతి ఒక్కరితో భేటీ అవుతా: పవన్ కల్యాణ్
పార్టీకి అపారమైన కేడర్ ఉన్నప్పటికీ అనుభవం ఉన్నవారు తక్కువగా ఉండడం వల్ల ఇప్పటి వరకు పార్టీ కమిటీలను పూర్తి స్థాయిలో వేయలేకపోయామని, ఇప్పుడు అనుభవం ఉన్నవారు కూడా తోడవడంతో పార్టీకి పూర్తి స్థాయిలో కమిటీలను నియమించుకుందామని జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్‌కళ్యాణ్ గారు స్పష్టం చేశారు. సోమవారం మధ్యాహ్నం విజయవాడలోని జనసేన పార్టీ రాష్ట్ర కార్యాలయంలో పార్టీ ముఖ్యనేతలతో సమావేశం అయ్యారు. సమావేశానికి ఆంధ్రప్రదేశ్ పూర్వ అసెంబ్లీ స్పీకర్ శ్రీ నాదెండ్ల మనోహర్, తమిళనాడు మాజీ చీఫ్ సెక్రటరీ శ్రీ పి.రామ్మోహన్రావు, మాజీ ఐఏఎస్ అధికారి, పార్టీ సీనియర్ నాయకుడు శ్రీ తోట చంద్రశేఖర్, మాజీ ఐపిఎస్ అధికారి శ్రీ వి.వి. (జె.డి.) లక్ష్మీనారాయణ, మాజీ ఐఆర్ఎస్ అధికారి శ్రీ చింతల పార్ధసారధి, శ్రీ టి. శివశంకర్, దళిత ఉద్యమ నేత శ్రీ భరత్ భూషణ్, తాడేపల్లిగూడెం మాజీ మునిస్పల్ చైర్మన్ శ్రీ బొలిశెట్టి శ్రీనివాస్, గుంటూరు లోక్‌సభ జనసేన అభ్యర్ధి శ్రీ బోరబోయిన శ్రీనివాస్ యాదవ్, శ్రీ కోన తాతారావు, మాజీ శాసనమండలి సభ్యులు శ్రీ కందుల దుర్గేష్ తదితరులు పాల్గొన్నారు. పార్టీని బలోపేతం చేయడానికి పార్టీలోని ప్రతి ఒక్కరు కృషి చేయాలని, ముఖ్యంగా మీ అమూల్యమైన సమయం, సలహాలు, మద్దతు పార్టీకి అందించాలని నాయకులకు శ్రీ పవన్‌కళ్యాణ్ గారు విజ్ఞప్తి చేశారు. జనసేన పార్టీ స్థాపన నాకు ఒక తపస్సు లాంటిది అని ఆ పార్టీని కడ వరకు ముందుకు తీసుకువెళ్తానని స్పష్టం చేశారు. అభిమానులే మన పార్టీకి ఎంతో బలం అని, అయితే వారిలోని ఉద్వేగాన్ని పార్టీకి ఉపయోగపడేలా మార్చుకోవాల్సిన అవసరం ఉందన్నారు. పరాయి పార్టీ వాళ్లు మన పార్టీ మీద నిందాపూర్వక విమర్శలు చేసినప్పుడు దానిని మనం బలంగా తిప్పికొట్టాలని, ముక్తకంఠంతో మాట్లాడాలని ఆయన ఉద్ఘాటించారు. పార్టీకి సేవ చేసిన ప్రతి ఒక్కరితోనూ నేను భేటీ అవుతానని అయితే దీనికి కొంత సమయం పడుతుందని అన్నారు. ప్రస్తుతం రాష్ట్ర స్థాయి కమిటీల నిర్మాణం పూర్తి చేసి ఆ తర్వాత లోకల్ కమిటీల నిర్మాణం చేపడదామని చెప్పారు. కొత్త తరం నాయకులను తీర్చిదిద్దే పనిని మనం చేస్తున్నాం. దేశానికి మంచి నాయకులను జనసేన పార్టీ అందిస్తుందని అన్నారు. తెలంగాణ స్థానిక ఎన్నికల్లో నేను ఒక్కసారి కూడా ప్రచారం చేయకపోయినా అక్కడ నేను సంతృప్తి పడే రీతిలో ఓట్లు వచ్చాయని ఆనందం వ్యక్తం చేశారు. ఒక పార్టీని స్థాపించి ముందుకు తీసుకువెళ్లడం ఎంత కష్టమో అందరికీ తెలిసిందేనని అన్నారు. పార్టీ నిర్మాణంలో ప్రతి నాయకుడు అభిలషనీయమైన స్థాయిలో బాధ్యత తీసుకోవాలని ఆయన కోరారు. ప్రతి ఒక్కరు పార్టీలో ముఖ్య భూమిక పోషించాలని అన్నారు. ఈ సమావేశంలో పాల్గొన్న ముఖ్య నాయకులు మాట్లాడుతూ రాష్ట్రంలో రాజకీయ శూన్యత ఉందని ఇది జనసేన పార్టీకి ఎంతో ఉపయోగకరమని అభిప్రాయపడ్డారు. దీర్ఘకాలిక స్వల్పకాలిక ప్రజా సమస్యలపై ప్రణాళికా బద్దమైన పోరాటాన్ని జనసేన పార్టీ చేయాలని అన్నారు. పార్టీ బలోపేతానికి తామంతా శక్తివంచన లేకుండా కృషి చేస్తామని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు.
ఈ సమావేశంలో ఇంకా డాక్టర్ హరిప్రసాద్, శ్రీమతి పాలవలస యశస్విని, శ్రీమతి రేఖా గౌడ్, శ్రీ మహేందర్‌రెడ్డి, శ్రీ ఏ.వి రత్నం, శ్రీ శంకర్‌గౌడ్, శ్రీ రామ్ తాళ్లూరి, శ్రీ శేఖర్‌పులి, శ్రీ షేక్ రియాజ్, శ్రీ బొమ్మిడి నాయకర్, శ్రీ వై. శ్రీను తదితరులు పాల్గొన్నారు. •ఏడు కమిటీల ఏర్పాటు జనసేన పార్టీ కమిటీలను సోమవారం జరిగిన పార్టీ సమావేశంలో శ్రీ పవన్‌కళ్యాణ్ గారు ప్రకటించారు. సోమవారం ఏడు కమిటీలకు చైర్మన్లను ప్రకటించగా మరికొన్ని కమిటీలను త్వరలోనే వెల్లడిస్తామని ఆయన తెలిపారు. రాష్ట్ర లోకల్‌బాడీ ఎలక్షన్ కమిటీ చైర్మన్‌గా తమిళనాడు మాజీ చీఫ్ సెక్రటరీ శ్రీ పి.రామ్మోహన్రావు(ఐఏఎస్)ను నియమించారు. స్టేట్ కమిటీ ఫర్ మైనారిటీస్ చైర్మన్‌గా విద్యావేత్త శ్రీ అర్హం ఖాన్‌ను, రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ సంక్షేమ కమిటీ చైర్మన్‌గా దళిత ఉద్యమనేత శ్రీ అప్పికట్ల భరత్‌భూషణ్‌ను ఎంపిక చేశారు. రాష్ట్ర మహిళా సాధికారిత కమిటీ చైర్‌పర్సన్‌గా కర్నూలుకు చెందిన శ్రీమతి రేఖాగౌడ్ నియమితులయ్యారు. ప్రస్తుతం ఆమె వీర మహిళా విభాగం చైర్మన్‌గా ఉండగా, ఆ బాధ్యతల నుంచి మార్పు చేశారు. పార్టీ రాష్ట్ర నిర్వహణ కమిటీ చైర్మన్‌గా జనరల్ సెక్రటరీ శ్రీ తోట చంద్రశేఖర్ (ఐఏఎస్)ను నియమించారు. పబ్లిక్ గ్రీవెన్స్ కమిటీ రాష్ట్ర చైర్మన్‌గా జనసేన శాసన సభ్యులు శ్రీ రాపాక వరప్రసాద్ (రాజోలు) పేరును ఖరారు చేశారు. గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ మోనిటరింగ్ కమిటీ రాష్ట్ర చైర్మన్‌గా శ్రీ చింతల పార్ధసారథిని ఎంపిక చేశారు. రాష్ట్ర లోకల్ బాడీ ఎలక్షన్ కమిటీలో సభ్యులుగా శ్రీ పంతం నానాజీ(తూర్పుగోదావరి జిల్లా), శ్రీ బొలిశెట్టి శ్రీనివాస్ (తాడేపల్లిగూడెం), శ్రీ చిలకం మధుసూదన్‌రెడ్డి (ధర్మవరం), శ్రీ పితాని బాలకృష్ణ (ముమ్మడివరం), శ్రీ సయ్యద్ జిలాని (నరసరావుపేట), శ్రీ అంకెం లక్ష్మీశ్రీనివాస్ (పెడన), శ్రీ కోత పూర్ణచంద్రరావు (పలాస), పాటంశెట్టి సూర్యచంద్ర (జగ్గంపేట), శ్రీ సుందరపు విజయ్‌కుమార్ (యలమంచిలి), శ్రీ సుంకర శ్రీనివాస్ (కడప), శ్రీమతి ఘంటసాల వెంకటలక్ష్మి (దెందులూరు), కాకినాడ మాజీ మేయర్ శ్రీమతి పొలసపల్లి సరోజు, శ్రీ షేక్ రియాజ్ (ఒంగోలు), శ్రీ వై.శ్రీను (రాజమండ్రి), శ్రీ బాడన వెంకట జనార్ధన్ (ఎచ్చెర్ల), శ్రీ ఇంజా సోమశేఖర్‌రెడ్డి (ప్రొద్దుటూరు) తదితరులను నియమించారు. మిగిలిన కమిటీల సభ్యుల వివరాలను ఆయా కమిటీల చైర్మన్లతో మాట్లాడిన అనంతరం ప్రకటిస్తామని శ్రీ పవన్‌కళ్యాణ్ గారు వెల్లడించారు.