ఇప్పటివరకు 1927 మంది జర్నలిస్టులకు ఆర్థిక సహాయం అందించాం: అల్లం నారాయణ
హైదరాబాద్: జర్నలిస్టుల సంక్షేమ నిధి నుండి కరోనా బారిన పడిన జర్నలిస్టులకు 3 కోట్ల 56 లక్షల 70 వేల రూపాయల ఆర్థిక సహాయం అందించామని తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమి చైర్మన్ అల్లం నారాయణ తెలిపారు. జర్నలిస్టుల సంక్షేమం కొరకు ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ముందు చూపుతో ఏర్పాటు చేసిన జర్నలిస్టుల సంక్షేమ నిధి జర్నలిస్టులకు రక్షణ కవచం లాగా మారిందని అన్నారు.
ఇప్పటివరకు 1640 మంది పాజిటివ్ వచ్చిన జర్నలిస్టులకు 20వేల రూపాయల చొప్పున 3 కోట్ల 28 లక్షల రూపాయలను, హోం క్వారంటైన్ లో 87 మంది జర్నలిస్టులకు 10వేల రూపాయల చొప్పున 8 లక్షల 70 వేల రూపాయలను అందించామని తెలిపారు. వివిధ జిల్లాలకు చెందిన జర్నలిస్టులకు కరోన బారిన పడిన మరో 200 మంది జర్నలిస్టులకు పాజిటివ్ వచ్చిన నేపథ్యంలో మీడియా అకాడమీకీ ఆర్థిక పరమైన ఒత్తిడి వల్ల వీరికి 10వేల రూపాయల చొప్పున ఆర్థిక సహాయాన్ని సంక్షేమ నిధి నుండి వచ్చిన వడ్డీ ద్వారా ఇరవై లక్షల రూపాయలను మంజూరు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. దీంతో ఇప్పటి దాకా 1927 మంది జర్నలిస్టులకు 3 కోట్ల 56 లక్షల 70 వేల రూపాయల ఆర్థిక సహాయంను అందించమని ఆయన తెలిపారు.
కరోనా సమయంలో అత్యవసర విధులు నిర్వహించిన పారిశుద్ధ్య కార్మికులు, వైద్య సిబ్బంది, పోలీసు సిబ్బందితో సరి సమానంగా కరోనా గురించి వాస్తవ సమాచారం ప్రజలకు అందించడంలో జర్నలిస్టులు కీలక పాత్ర పోషించారని అన్నారు. జర్నలిస్టుల సంక్షేమ నిధి మూలధనం 34 కోట్ల 50 లక్షల రూపాయల నుంచి వచ్చిన వడ్డీతో మాత్రమే ఈ కార్యకలాపాలను నిర్వహించామని చెప్పారు.
జర్నలిస్టుల సంక్షేమ నిధి నుండి వచ్చిన వడ్డీతో ఇప్పటి వరకు మరణించిన జర్నలిస్టుల కుటుంబాలకు లక్ష రూపాయల ఆర్థిక సహాయం, పెన్షన్లు, ట్యూషన్ ఫీజులు, దీర్ఝ కాలిక వ్యాధులు/ప్రమాదాల బారిన పడిన జర్నలిస్టులకు 50 వేల చొప్పున ఆర్థిక సహయంతో పాటు కరోనా విపత్తు సాయం అన్నీ కలిపి ఇప్పటి వరకు జర్నలిస్టుల కుటుంబాలకు 9 కోట్ల 50 లక్షల రూపాయలను ఖర్చు చేశామని ఆయన అన్నారు.
ఇలాంటి సంక్షేమ నిధి కాని, జర్నలిస్టులను ఆదుకోవడంగాని దేశంలో ఎక్కడా లేదని ఆయన తెలిపారు. భవిష్యత్తులో కూడా శిక్షణ, సంక్షేమం అనే రెండు కార్యక్రమాలను లక్ష్యంగా తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమి పని చేస్తుందని మరొకసారి ఆయన గుర్తు చేశారు.