క్యాన్సర్ వ్యాధిగ్రస్తుడిని పరామర్శించి ధైర్యం చెప్పిన పవన్ కల్యాణ్
అభిమాని ఆకాంక్షను నెరవేర్చిన జనసేనాని
రూ.లక్ష ఆర్ధిక సాయం
క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న తన అభిమాని, జనసైనికుడు పాతకూటి బుడిగయ్యను జనసేన అధ్యక్షులు పవన్ కల్యాణ్ పరామర్శించారు. మంగళవారం ఉదయం హైదరాబాద్ లోని జనసేన కార్యాలయంలో బుడిగయ్య, ఆయన కుటుంబం పవన్ కళ్యాణ్ గారిని కలిశారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ గారు అతని ఆరోగ్య పరిస్థితిపై కుటుంబ సభ్యులను ఆరా తీశారు. వైద్య ఖర్చుల నిమిత్తం రూ.లక్ష ఆర్ధికసహాయం అందించారు. తన అభిమాని త్వరగా కోలుకోవాలని భగవతుండిని ప్రార్ధిస్తూ వినాయకుడి విగ్రహాన్ని బహూకరించారు. దేవుడు బుడిగయ్యకు మంచి చేయాలని ఆకాంక్షించారు. ప్రకాశం జిల్లా త్రిపురాంతకం మండలం, అన్నసముద్రం గ్రామానికి చెందిన బుడిగయ్య పవన్‌కళ్యాణ్ గారికి వీరాభిమాని.
గత కొంతకాలంగా క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నారు. కీమో థెరపీ తీసుకుంటూ కూడా జనసేన పార్టీ కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొన్నారు. వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉండడంతో కొంతకాలంగా మంచానికే పరిమితం అయ్యారు. పవన్‌కళ్యాణ్ గారిని చూడాలన్న తన కోరికను స్థానిక జనసేన నాయకులకు తెలియపరచగా, విషయం పార్టీ అధినేత దృష్టికి తీసుకు వచ్చారు. బుడిగయ్యను పరామర్శించేందుకు అన్నసముద్రం వస్తానని చెప్పారు. ఈలోగా అతన్ని అంబులెన్స్ లో ప్రశాసన్‌నగర్‌లో జనసేన పార్టీ ప్రధాన కార్యాలయానికి తీసుకువచ్చారు. వ్యాధి ఎంత కాలం నుంచి ఉంది? చికిత్స ఎక్కడ చేయిస్తున్నారు అన్న విషయాలను అతని భార్యను అడిగి తెలుసుకున్నారు. మంగళగిరిలో ఎన్.ఆర్.ఐ ఆసుపత్రి వైద్యులతో తాను స్వయంగా మాట్లాడుతానని పవన్‌కళ్యాణ్ గారు తెలిపారు. బుడిగయ్య ఆరోగ్య పరిస్థితులను ఎప్పటికప్పుడు చూడాలని ఎర్రగొండపాలెం నుంచి జనసేన అభ్యర్థిగా నిలిచిన డా.గౌతమ్ కు సూచించారు