మొబైల్ దంత సంరక్షణ బస్సును ప్రారంభించిన ఏపీ గవర్నర్ హరిచందన్!
జిల్లా శిశు సంక్షేమ కమిటీ చొరవతో డాక్టర్ శ్రీధర్ ఓరల్ హెల్త్ ఫౌండేషన్ సహకారంతో ఏర్పాటు చేసిన మొబైల్ దంత సంరక్షణ విభాగాన్ని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ జెండా ఊపి ప్రారంభించారు. మంగళవారం రాజ్ భవన్‌లో ఆవరణలో ఈ ప్రత్యేక కార్యక్రమం జరిగింది. జిల్లాలోని చిన్నారుల దంత పరీక్షల కోసం నిర్ధేశించిన ఈ బస్సు గురించి గవర్నర్ ఆసక్తిగా తెలుసుకున్నారు. అనంతరం స్వయంగా గవర్నర్ మొబైల్ బస్సును సందర్శించి, మొబైల్ దంత సంరక్షణ యూనిట్ లో ఏర్పాటు చేసిన దంత పరీక్ష పరికరాలు, ఇతర సౌకర్యాలను గవర్నర్ పరిశీలించారు.
కృష్ణ జిల్లాలోని అన్ని శిశు సంరక్షణ సంస్థలలో ఉంటున్న అనాథ, పాక్షిక అనాధ పిల్లలకు దంత సంరక్షణను అందించే ప్రయత్నాన్ని శిశు సంక్షేమ కమిటీ ఛైర్మన్ బీవీఎస్ కుమార్ వివరించారు. జిల్లాలోని వివిధ ప్రదేశాలలో ఉన్న 92 పిల్లల సంరక్షణ సంస్థలలో అనాథ పిల్లలకు ఆశ్రయం కల్పించడం ద్వారా పిల్లలు బాల కార్మికులుగా మారకుండా రక్షించడం, పునరావాసం కల్పించే క్రమంలో వారు అనుసరిస్తున్న తీరును శిశు సంక్షేమ కమిటీ చైర్మన్ గవర్నర్‌కు వివరించారు.
అనాథ పిల్లల కోసం ఏర్పాటు చేసిన ఈ దంత సంరక్షణ కార్యక్రమం ద్వారా రానున్న మూడు నెలల్లో జిల్లాలోని అన్ని పిల్లల సంరక్షణ సంస్థలకు వెళ్లి అవసరమైన పరీక్షలు, చికిత్సలను అందిస్తామని గవర్నర్ కు తెలిపారు. అవసరమైన వారికి రూ.2000 ఖర్చుతో కూడిన క్లిప్‌లను అందిస్తామన్న పౌండేషన్ ఛైర్మన్ డాక్టర్ శ్రీధర్ రెడ్డి ప్రయత్నాలను గవర్నర్ ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో గవర్నర్ కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా, గవర్నర్ జాయింట్ సెక్రటరీ అర్జున రావు, రాజ్ భవన్ అధికారులు పాల్గొన్నారు.