అటవీ శాఖలోనూ మహిళలు పోటీపడి రాణించటం ఆహ్వానించదగిన పరిణామం: ప్రకాశ్ జవదేకర్
మిగతా రంగాల మాదిరిగానే అటవీ శాఖలోనూ మహిళలు పోటీ పడి రాణించటం ఆహ్వానించదగిన పరిణామం అన్నారు కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్.
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా దేశ వ్యాప్తంగా అటవీ శాఖలో పనిచేస్తున్న మహిళా అధికారులు, సిబ్బందికి మంత్రి శుభాకాంక్షలు తెలిపారు. మహిళా ఐ.ఎఫ్.ఎస్ అధికారుల వివరాలతో కూడిన *గ్రీన్ క్వీన్స్ ఆఫ్ ఇండియా – నేషన్స్ ప్రైడ్* అనే పుస్తకాన్ని మంత్రి ఆన్ లైన్ ద్వారా ఢిల్లీ నుంచి ఆవిష్కరించారు.
ప్రస్తుతం దేశవ్యాప్తంగా 284 మంది మహిళలు ఇండియన్ ఫారెస్ట్ సర్వీసులో వివిధ స్థానాల్లో రాణిస్తున్నారని, వారిలో ముగ్గురు (తెలంగాణ, రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్) అటవీ సంరక్షణ ప్రధాన అధికారులుగా (పీసీసీఎఫ్) రాణిస్తున్నారని మంత్రి వెల్లడించారు. (Total IFS india 2343. Women Officer's 284.)
మిగతా రంగాల మాదిరిగానే క్షేత్ర స్థాయిలో అడవుల్లో పనిచేసేందుకు కూడా మహిళలు, పోటీ పరీక్షల ద్వారా ఎంపికవ్వటం ఆహ్వానించదగిన పరిణామం అని ప్రకాశ్ జవదేకర్ అన్నారు. రానున్న రోజుల్లో అటవీ శాఖలో కూడా 33 శాతం మహిళా ఉద్యోగులు పనిచేయాలని ఆకాంక్షించారు. తెలంగాణ అటవీ శాఖలో సుమారు 30 శాతం మంది మహిళలు పనిచేస్తున్నారనే విషయాన్ని పీసీసీఎఫ్ ఆర్.శోభ, కేంద్ర మంత్రి దృష్టికి తీసుకురాగానే ఆయన అభినందించారు. కరోనా ప్రభావం తగ్గిన తర్వాత దేశ వ్యాప్తంగా అటవీ శాఖలో పనిచేస్తున్న మహిళా అధికారులతో ఒక సెమినార్ ను ఏర్పాటు చేసే విషయాన్ని పరిశీలించాలని మంత్రిని అధికారులు కోరారు.
ఆన్ లైన్ వేదికగా జరిగిన ఈ పుస్తకావిష్కరణ సమావేశానికి ఢిల్లీ నుంచి కేంద్ర మంత్రితో పాటు పలువురు అధికారులు, ఆయా రాష్ట్రాల్లో పని చేస్తున్నమహిళా ఐఎఫ్ఎస్ అధికారులు పాల్గొన్నారు.
హైదరాబాద్ అరణ్య భవన్ నుంచి పీసీసీఎఫ్ ఆర్.శోభతో పాటు, దేశంలో మొదటిసారిగా ఐఎఫ్ఎస్ కు ఎంపికైన సీ.ఎస్. రామలక్ష్మి (రిటైర్డ్), కమళా శోభనా రావు, రిటైర్డ్, సోనిబాల దేవి, ముఖ్యమంత్రి ఓఎస్డీ ప్రియాంక వర్గీస్ లు హాజరయ్యారు.
ఈ కార్యక్రమంలో కేంద్ర అటవీ శాఖ కార్యదర్శి ఆర్.పీ.గుప్త, డైరెక్టర్ జనరల్ సంజయ్ కుమార్, సెంట్రల్ IFS అసోసియేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు.