ఏపీలో తొలిసారి ఓటు హక్కు వినియోగించుకోనున్న గవర్నర్ దంపతులు
ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ రాష్ట్ర ప్రథమ పౌరుని హోదాలో తొలిసారి ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఇప్పటికే రాష్ట్రంలో ఓటరుగా నమోదు అయిన గవర్నర్ దంపతులు బుధవారం జరిగే విజయవాడ నగర పాలక సంస్ధ ఎన్నికల పోలింగ్ లో ఓటు వేయనున్నారు.
గవర్నర్ పేట నగర న్యాయ స్దానముల ప్రాంగణానికి ఎదురుగా రాజ్ భవన్ కు సమీపంలోని చుండూరి వెంకట రెడ్డి ప్రభుత్వ నగర పాలక ఉన్నత పాఠశాల (సివిఆర్ జిఎంసి హైస్కూల్)లో ఏర్పాటు చేసిన పోలింగ్ స్టేషన్ లో ఉదయం 11గంటల ప్రాంతంలో బిశ్వ భూషణ్ హరిచందన్, సుప్రవ హరిచందన్ లు ఓటు హక్కును వినియోగించుకుంటారని గవర్నర్ కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. ఓటర్లకు ఎటువంటి ఇబ్బంది కలగనీయని రీతిలో రాజ్ భవన్ అధికారులు, జిల్లా యంత్రాంగం ఈ కార్యక్రమాన్ని సమన్వయ పరుస్తున్నారు.
రెడ్‌క్రాస్ సెంటెనరీ సైకిల్ ర్యాలీ గోడపత్రికను ఆవిష్కరించిన గవర్నర్:
సెంటెనరీ సైకిల్ ర్యాలీ యువతలో రెడ్ క్రాస్ సేవల పట్ల మరింత అవగాహనను కలిగించటమే కాకుండా, రెడ్‌క్రాస్ ఉద్యమంలో వారిని భాగస్వాములను చేయటానికి ప్రోత్సాహం అందిస్తుందని ఆంధ్రప్రదేశ్ గవర్నర్, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఏపీ స్టేట్ బ్రాంచ్ అధ్యక్షుడు బిశ్వభూషణ్ హరిచందన్ అన్నారు.
భారత దేశంలో రెడ్ క్రాస్ సేవలను ప్రారంభించి వంద సంవత్సరాలు పూర్తి అవుతున్న శుభ తరుణంలో ఆంధ్రప్రదేశ్ రెడ్ క్రాస్ శాఖ ప్రత్యేక కార్యక్రమాన్ని తీసుకుంది. శ్రీకాకుళం నుండి విజయవాడ వరకు సెంటెనరీ సైకిల్ ర్యాలీ పేరిట వినూత్న కార్యక్రమాన్ని నిర్వహిస్తుండగా దానిని సంబంధించిన గోడపత్రికను మంగళవారం గవర్నర్ ఆవిష్కరించారు.
మార్చి 16న శ్రీకాకుళంలో ప్రారంభమయ్యే ర్యాలీ మార్చి 25న విజయవాడ చేరుకోనుంది. ఈ సందర్భంగా గవర్నర్ హరిచందన్ మాట్లాడుతూ కోవిడ్ -19 లాక్ డౌన్ సమయంలో ఐఆర్సిఎస్ వాలంటీర్లు చేసిన సేవాకార్యక్రమాలు ప్రశంసనీయమన్నారు. రక్తదానం, చెట్ల పెంపకం వంటి స్వచ్ఛంద కార్యక్రమాల్లో యువత పాల్గొనాలని గవర్నర్ అన్నారు.
ర్యాలీలో పాల్గొనే సైక్లిస్టుల ఆరోగ్యం, భద్రత, అవసరమైనప్పుడు తక్షణ వైద్య సంరక్షణను అందించడం వంటివి కీలకమన్నారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని మాస్క్ వినియోగం మొదలు, శానిటైజేషన్, సామాజిక దూరం వంటి విషయాలపై శ్రద్ధ కనబరచాలని సూచించారు.
రెడ్‌క్రాస్ సెంటెనరీ సైకిల్ ర్యాలీ దేశంలో ఇదే మొదటిదని, శ్రీకాకుళం-విజయవాడ, అనంతపురం-విజయవాడల మధ్య రెండు మార్గాల్లో దీనిని చేపట్టనున్నట్లు రెడ్‌క్రాస్ ఎపి స్టేట్ బ్రాంచ్ చైర్మన్ డాక్టర్ ఎ. శ్రీధర్ రెడ్డి గవర్నర్‌కు తెలియజేశారు. ర్యాలీలో సుమారు 200 వరకు మంది సైక్లిస్టులు ఉంటారన్నారు.
రెడ్‌క్రాస్ ప్రధాన కార్యదర్శి ఎకె పరిడా మాట్లాడుతూ సెంటెనరీ సైకిల్ ర్యాలీ ప్రధానంగా మొక్కలు నాటటం, రక్తదానం చేయటం, ఆరోగ్యకరమైన జీవితాన్ని, శుభ్రమైన వాతావరణాన్ని పొందటం వంటి ఇతివృత్తాలకు ప్రచారం కల్పిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో గవర్నర్ కార్యదర్శి, ఐఆర్సిఎస్ ఏపీ స్టేట్ బ్రాంచ్ ఉపాధ్యక్షుడు ముఖేష్ కుమార్ మీనా తదితరులు పాల్గొన్నారు.