పలు శాఖల సమన్వయంతోనే కరోనా కట్టడి: మంత్రులు తలసాని, మహ్మూద్ అలీ
- జీహెచ్ఎంసీలో కరోనా నియంత్రణపై ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం
రాష్ట్ర పశుసంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్, హోం మంత్రి మహ్మూద్ అలీ, నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, డిప్యూటి మేయర్ మోతె శ్రీలత శోభన్ రెడ్డి, జీహెచ్ఎంసీ కమిషనర్ డి.ఎస్.లోకేష్ కుమార్, హైదరాబాద్ కలెక్టర్ శ్వేత మహంతి, వివిధ శాఖలకు చెందిన ఉన్నతాధికారులు, నగరంలోని ప్రధాన ఆసుపత్రుల సూపరింటెండెంట్లు ఈ సమావేశానికి హాజరయ్యారు.
ఈ సందర్భంగా మంత్రులు శ్రీనివాస్ యాదవ్, మహ్మూద్ అలీలు మాట్లాడుతూ.. కోవిడ్ నియంత్రణలో భాగంగా నగరంలో చేపట్టిన ఇంటింటి ఫీవర్ సర్వే, అన్ని ప్రభుత్వ ఆసుపత్రులు, బస్తీ దవఖానాలు, ఏరియా ఆసుపత్రులలో నిర్వహిస్తున్న జ్వర పరిక్షలు, పెద్ద ఎత్తున చేపట్టిన పారిశుధ్య కార్యక్రమాలు, వివిధ శాఖల అధికార యంత్రాంగం అందిస్తున్న నిర్విరామ సేవల వల్ల కరోన నియంత్రణలోనే ఉందని పేర్కొన్నారు.
నగరంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల్లో పడకల లభ్యత, వ్యాక్సినేషన్, రెమిడిసర్ మందులు, ఆక్సిజన్ అందుబాటు తదితర అంశాలను వెబ్ సైట్ ద్వారా ప్రజలకు అందుబాటులో ఉంచామని తెలిపారు. భారత ప్రభుత్వం నుండి గత మూడు రోజులుగా కోవ్యాక్సిన్ టీకా సరఫరా లేనందున రెండో విడుత వ్యాక్సిన్ ను తాత్కాలికంగా నిలిపివేశామని తెలియజేశారు. నగరంలో కోవిడ్ సంబంధిత సమాచారాన్ని ప్రజలకు అందజేయడానికి జీహెచ్ఎంసీలో కోవిడ్ కంట్రోల్ రూంను ప్రత్యేకంగా ఏర్పాటు చేశామని, ఈ కంట్రోల్ రూంలో 040-211 111 11 అనే ఫోన్ నెంబర్ ను ప్రజలకు అందుబాటులో ఉంచామని తెలిపారు.
మరో నెలరోజుల్లో రుతుపవనాలు ప్రవేశిస్తున్నందున నగరంలోని నాలాల పూడికతీత పనులు ముమ్మరంగా చేపట్టాలని మంత్రి తలసాని ఆదేశించారు. ఇప్పటికే జీహెచ్ఎంసీలోని ఎంటమాలజి, ఇ.వి.డి.ఎం ల ఆధ్వర్యంలో కరోనా నివారణకై హైపోక్లోరైడ్ ద్రావకం స్ప్రేయింగ్ పెద్ద ఎత్తున జరుగుతోందని, దీంతో పాటు ఫైర్ సర్వీస్ ల సహకారాన్ని కూడా పొందాలని ఆదేశించామని మంత్రి తెలిపారు.
లాక్ డౌన్ సడలించిన సమయంలో స్వచ్ఛంద సంస్థలు, కార్పొరేట్ సంస్థలు తమ సహాయ సహకారాలను అందిస్తున్నాయని, అయితే లాక్ డౌన్ సమయంలో కూడా ఉచిత భోజన, ఇతర సదుపాయాలను అందించే స్వచ్ఛంద సంస్థలు లేదా వ్యక్తులు తమ సమీపంలోని పోలీస్ స్టేషన్లలో సమాచారం అందించి ముందస్తు అనుమతి తీసుకోవాలని తెలియజేశారు. రాజకీయాలకు అతీతంగా కరోనా నియంత్రణకు ప్రభుత్వానికి సహకరించాల్సిందిగా విజ్ఞప్తి చేశారు.
హోం మంత్రి మహమూద్ అలీ మాట్లాడుతూ.. కరోనా గురించిన సమాచారాన్ని ప్రజలకు అందించేందుకు హెల్ప్ లైన్, కంట్రోల్ రూంల గురించి పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించాలని సూచించారు. నగరంలో ఉన్న బస్తీ దవఖానాల పనితీరు సంతృప్తికరంగా ఉందని, ఈ బస్తీ దవఖానాల్లో అవసరమైతే అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగించేలా ఆక్సిజన్ లాంటి సదుపాయాలను కూడా కల్పించాలని తెలియజేశారు.
కరోనా నియంత్రణలో తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన చర్యలు మొత్తం దేశానికే ఆదర్శవంతంగా ఉన్నాయని అన్నారు. ప్రస్తుతం ఉన్న అన్నపూర్ణ కేంద్రాల ద్వారా ప్రధాన ఆసుపత్రుల వద్ద భోజనాన్ని అందించే మొత్తాన్ని పెంచాలని సూచించారు. నగరంలో చేపట్టిన ఇంటింటి సర్వే ద్వారా ఇప్పటికే 9 లక్షలకు పైగా ఇళ్లలో ఫీవర్ సర్వేను నిర్వహించి జ్వరంతో బాధపడుతున్నవారికి ఉచిత మెడికల్ కిట్ లను అందజేశామని తెలిపారు.
నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి మాట్లాడుతూ.. కరోన నియంత్రణలో భాగంగా ప్రభుత్వం ప్రకటించిన లాక్ డౌన్ ను మరింత కఠినంగా అమలు చేయాలని సూచించారు. నగరంలో అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగించేందుకు సర్కిళ్లవారిగా ప్రత్యేక ఐసోలేషన్ కేంద్రాలను ముందుస్తుగా ఏర్పాటు చేశామని తెలియజేశారు. నగరంలో పారిశుధ్య కార్యక్రమాలను మరింత ముమ్మరంగా చేపట్టేందుకు క్షేత్రస్థాయి తనిఖీలను తిరిగి ప్రారంభించనున్నట్లు మేయర్ పేర్కొన్నారు.
కాగా, గ్రేటర్ హైదరాబాద్ లో కరోనా నియంత్రణకు చేపట్టిన చర్యలు, కోవిడ్ కంట్రోల్ రూం ద్వారా అందిస్తున్న సేవలను జీహెచ్ఎంసీ కమిషనర్ డి.ఎస్.లోకేష్ కుమార్ వివరించారు. హైదరాబాద్ లోని ప్రధాన ఆసుపత్రులలో ఆక్సిజన్ సరఫరా, అత్యవసర మందుల లభ్యత, బెడ్ ల పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షించి నగరవాసులకు సమచారాన్ని అందజేస్తున్నామని హైదరాబాద్ కలెక్టర్ శ్వేత మహంతి వెల్లడించారు.
నగరంలోని అన్ని ప్రధాన ఆసుపత్రులలో మొత్తం బెడ్ ల సంఖ్య, ఆసుపత్రుల్లో చేరిన పాజిటీవ్ రోగుల సంఖ్య, ఆక్సిజన్ నిల్వలు, రెమిడిసర్ మందుల అందుబాటు తదితర వివరాలను గాంధీ, ఫీవర్ హాస్పిటల్, కింగ్ కోఠి, ఉస్మానియా, నిమ్స్, సరోజిని దేవి, ఎర్రగడ్డ తదితర ఆసుపత్రుల సూపరింటెండెంట్లు తెలియజేశారు.