కోవిడ్ నియంత్రణకు సంబంధించి సీఎం ఆదేశాల ప్రకారం వెంటనే తగు చర్యలను ప్రారంభించాలి: మంత్రి హరీష్ రావు
హైదరాబాద్: రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు రాష్ట్ర ఆర్ధిక శాఖా మంత్రి హరీష్ రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ లు మంగళవారం బీఆర్కేఆర్ భవన్ లో రాష్ట్రంలోని కోవిడ్ పేషెంట్లకు ఆక్సిజన్ సరఫరాకై లిక్విడ్ ఆక్సిజన్ స్టోరేజ్ యూనిట్లు, పీఎస్ఏ ప్లాంట్ల నిర్మాణం, క్రయోజినిక్ ట్యాంకర్ల సరఫరా తదితర అంశాలపై సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా మంత్రి మరియు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ, రాష్ట్రంలో కోవిడ్ నియంత్రణకు సంబంధించి రాష్ట్ర ముఖ్యమంత్రి గారి ఆదేశాల ప్రకారం వెంటనే తగు చర్యలను ప్రారంభించాలని వైద్య శాఖ అధికారులను ఆదేశించారు.
ఆస్పత్రులలో చికిత్స పొందుతున్న కోవిడ్ పేషెంట్లకు ఆక్సిజన్ సరఫరా నిమిత్తం అవసరమైన పీఎస్ఏ ప్లాంట్లు, సామాగ్రి తదితర అంశాలకు సంబంధించి వెంటనే చర్యలు ప్రారంభించాలని ఆదేశించారు.
పరిశ్రమలు, ఐటీ శాఖల ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్, వైద్య, ఆరోగ్య శాఖ కార్యదర్శి రిజ్వి, ఆర్ధిక శాఖ ప్రత్యేక కార్యదర్శి రొనాల్డ్ రోస్, మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ డాక్టర్ రమేష్ రెడ్డి, టీఎస్ఎంఎస్ఐడీసీ మేనేజింగ్ డైరెక్టర్ చంద్రశేఖర్ రెడ్డి, మెగా ఇంజనీరింగ్ ప్రతినిధులు కృష్ణ తదితరులు పాల్గొన్నారు.