2023 నాటికి యాదాద్రి పవర్ ప్లాంట్ పూర్తి: మంత్రి జగదీష్ రెడ్డి
- నిర్మాణం పై కోవిడ్ ప్రభావం చూపింది
యాదాద్రి పవర్ ప్లాంట్ నిర్మాణం ప్రారంభ దశలో కొందరు కుట్రలు చేసి గ్రీన్ ట్రిబ్యునల్ కు వెళ్లి ఆపే ప్రయత్నం చేశారని ఆయన ఆరోపించారు. అటువంటి అవాంతరాలను అధిగమించి నిర్మాణంలో పురోగతిని సాధించినట్లు ఆయన వెల్లడించారు. నల్లగొండ జిల్లా దామరచర్ల మండలం వీర్లపాలెం వద్ద రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తున్న యాదాద్రి పవర్ ప్లాంట్ ను ఆయన మంగళవారం రోజున ట్రాన్స్కో&జెన్కో సి యం డి దేవులపల్లి ప్రభాకర్ రావు తో కలసి సందర్శించారు.
అనంతరం నిర్మాణం పురోగతిపై ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సమీక్షా సమావేశంలో ఆయన పాల్గొన్నారు. అనంతరం మంత్రి జగదీష్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ భవిష్యత్ తరాల అవసరాలను దృష్టిలో పెట్టుకొని ముఖ్యమంత్రి కేసీఆర్ అత్యంత ప్రతిష్టాత్మకంగా మొదలు పెట్టిన ఈ నిర్మాణం వేగవంతంగా జరుగుతున్న సందర్భంలోనే కరోనా వైరస్ వ్యాప్తి చెందడంతో పనులు కొంత మేరకు మందగించాయన్నారు. కరోనా మొదటి దశ పూర్తి అయి పనులు తిరిగి వేగవంతం అయ్యేసరికి కరోనా రెండో వేవ్ రావడంతో కొంత అవాంతరం ఏర్పడిందని ఆయన చెప్పారు.
అయినా ట్రాన్స్కో&జెన్కో సి యం డి దేవులపల్లి ప్రభాకర్ రావు ఇతర ఉన్నతాధికారుల సూచన మేరకు ఇక్కడ పనిచేస్తున్న కార్మికులకు అందుబాటులో వైద్యం అందించాలని నిర్ణయించామన్నారు. ఇప్పటికే అయిదు యూనిట్లు నిర్మాణంలో ఉన్నాయని మరో యూనిట్ కు టెండర్ల ప్రక్రియ పూర్తి అయిందని ఆయన వెల్లడించారు. ట్రాన్స్కో &జెన్కో సి యం డి దేవులపల్లి ప్రభాకర్ రావు మాట్లాడుతూ ఇప్పటికే జెన్కో ఆధ్వర్యంలో రాష్ట్రంలో 4,000 మెగావాట్ల థర్మల్ పవర్ ఉందన్నారు. ఇక్కడ నిర్మిస్తున్న పవర్ ప్లాంట్ తో మరో 4,000 వేల మెగావాట్ల ఉత్పత్తి కాబోతుందన్నారు.
కరోనా సమయంలోనూ నిర్మాణం పనులు ఎక్కడ ఆగడం లేదన్నారు. ఎప్పటికప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్మాణం పురోగతిపై సమీక్షిస్తున్నారని ఆయన చెప్పారు. ఈ సమీక్షా సమావేశంలో బి హెచ్ ఇ ఎల్ డైరెక్టర్ సిసోడియా, ట్రాన్స్కో డైరెక్టర్లు అజయ్,సచ్చితానంద్, టి ఆర్ కే రావు, కోల్ సి యం డి జె యస్ రావు తదితరులు పాల్గొన్నారు.