కొనుగోళ్లకు అనుగుణంగా చెల్లింపులు: తెలంగాణ పౌరసరఫరాల సంస్థ చైర్మన్
- పర్యవేక్షణకు విజిలెన్స్ బృందాలు
- పౌరసరఫరాల సంస్థ చైర్మన్ మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి
రెండు, మూడు రోజుల్లో రైతులకు చెల్లింపులు జరిగేలా చూడాలని అధికారులను ఆదేశించారు. అధికారుల అలసత్వం వల్ల రైతులు ఇబ్బందులకు గురైతే కఠిన చర్యలు తీసుకోవడానికి ఏమాత్రం వెనకాడబోమని హెచ్చరించారు. ఆలస్యంగా చెల్లింపులు జరుగుతున్న జిల్లాలపై ప్రధానంగా దృష్టిసారించాలని ఇందుకోసం పౌరసరఫరాల సంస్థ విలిజెన్స్ అండ్ ఎన్ఫోర్స్ మెంట్ అధికారులతో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
జిల్లాల్లో ఎంత ధాన్యం కొనుగోలు చేశారు, ఓపిఎంఎస్ నమోదు చేశారు. రెండింటికి మధ్య ఉన్న వ్యత్యాసాలు, ఓఓఎంఎస్ నమోదులో ఎదురవుతున్న సమస్యలు, ఆలస్యానికి గల కారణాలు, కొనుగోలు చేసిన ధాన్యంలో ఎంత ధాన్యం మిల్లులకు తరలించారు. ఏ ఏ మిల్లుల్లో మిల్లర్ అక్నాలెడ్జ్ సమస్య ఉంది, సమస్య ఉన్న మిల్లులను విధిగా సందర్శించడం, చెల్లింపుల ఆలస్యానికి కారణాలపై విశ్లేషణ, చెల్లింపులను వేగవంతం చేయడానికి చేపడుతున్న చర్యలను ఈ బృందాలు ప్రధానంగా సమీక్షిస్తాయని తెలిపారు.
ధాన్యం కొనుగోళ్లు, చెల్లింపులపై గురువారంనాడు పౌరసరఫరాలభవన్ లోని తన కార్యాలయంలో ప్రొక్యూర్మెంట్, ఫైనాన్స్, విజిలెన్స్ అధికారులతో సమీక్షించారు. కొన్ని జిల్లాల్లో చెల్లింపుల్లో ఎందుకు ఆలస్యం జరుగుతుందని ప్రశ్నించారు. ధాన్యం కొనుగోలు వివరాలను మిల్లర్లు ట్రక్ షీట్లో నమోదు చేయడంలో జాప్యం జరుగుతున్న దగ్గర చెల్లింపుల్లో ఆలస్యం జరుగుతుందని అధికారుల వివరణపై ఛైర్మన్ స్పందిస్తూ అవసరమైన చోటా కొంతమందిని తాత్కాలికంగా నియమించుకోవడం, ప్రొక్యూర్మెంట్ తక్కువగా ఉన్న జిల్లాల నుండి తాత్కాలికంగా కొంతమంది సిబ్బందిని ఆయా జిల్లాలకు సర్దుబాటు చేయాలని సూచించారు.
కొనుగోలు కేంద్రాల నిర్వహకులు కొనుగోలు చేసిన ధాన్యం వివరాలను ఎప్పటికప్పుడు ఆన్లైన్లో నమోదు చేయాలని, అలాగే రైస్ మిల్లర్లు కూడా ధాన్యాన్ని వెంటనే దించుకుని వివరాలను ట్రక్ షీట్లో నమోదు చేయాలని ఈ విషయంలో ఎక్కడ జాప్యం జరిగినా దాని ప్రభావం మద్దతు ధర చెల్లింపులపై పడుతుందన్న విషయాన్ని గుర్తించి అధికారులు పనిచేయలన్నారు. దించుకున్న ధాన్యానికి మిల్లర్ అక్నాలెడ్జ్ ఇవ్వకుండా జాప్యం చేస్తే దీనికి జిల్లా మేనేజరే బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. రైతులకు చెల్లింపుల్లో ఆలస్యం జరిగితే సంబందిత అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
రైతాంగం అభివృద్ధికి ముఖ్యమంత్రి కేసీఆర్ ఇస్తున్న ప్రాధాన్యతను గుర్తించి దానికి అనుగుణంగా అధికారులు పనిచేయాలని అన్నారు. ప్రస్తుతం పౌరసరఫరాల సంస్థకు ధాన్యం కొనుగోళ్లకు మించిన ప్రాధాన్యత మరొకటిలేదని, ఇతర అంశాలను పక్కన పెట్టి కొనుగోళ్లకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలన్నారు.
రేషన్ డీలర్ల విజ్ఞప్తి మేరకు రూ.28 కోట్లు విడుదల
ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు ఆదేశాల మేరకు దీర్ఘకాలికంగా పెండింగ్ లో ఉన్న రేషన్ డీలర్ల కమీషన్ రూ. 28 కోట్లను విడుదల చేసినట్లు ఛైర్మన్ మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. రేషన్ డీలర్ల సమస్యలపై గురువారం నాడు సంబంధిత అధికారులు, రేషన్ డీలర్లతో ఆయన సమావేశమయ్యారు. రేషన్ డీలర్లు ప్రభుత్వానికి అప్పగించాల్సిన గన్నీ సంచుల ధరను కూడా ఒక్కో సంచి ధర రూ. 18 నుండి రూ. 21కి పెంచడం జరిగింది. దీన్ని దృష్టిలో పెట్టుకుని ప్రతి గన్నీ సంచిని రేషన్ డీలర్లు విధిగా పౌరసరఫరాల సంస్థకు అప్పగించాలని ఆదేశించారు. ధాన్యం కొనుగోళ్లు పెరగడంతో గన్నీ సంచుల వినియోగం కూడా పెరిగిందని ప్రభుత్వ అవసరాలను దృష్టిలో పెట్టుకుని రేషన్ డీలర్లు పనిచేయాలని విజ్ఞప్తి చేశారు. కమీషన్ విడుదల చేయడం పట్ల అఖిల తెలంగాణ రాష్ట్ర రేషన్ డీలర్ల సమాఖ్య అధ్యక్షులు దొమ్మాటి రవీందర్, సభ్యులు టి.లక్ష్మణ్, అజీజ్ లు హర్షం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమాలకర్, ఛైర్మన్ మారెడ్డి శ్రీనివాస్ రెడ్డిలకు కృతజ్ఞతలు తెలిపారు.