జీవవైవిధ్యంతోనే మానవ మనుగడ: మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి
- "జీవవైవిధ్య రచ్చ బండ" ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించిన మంత్రి అల్లోల
- అంతర్జాతీయ జీవవైవిధ్య దినోత్సవ వర్చువల్ సమావేశంలో పాల్గొన్న మంత్రి
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. “మా పరిష్కారాలు ప్రకృతిలో ఉన్నాయి” అని గత ఏడాది నినాదానికి కొనసాగింపుగా “మేము పరిష్కారంలో భాగం” (We are part the Solution) అనే థీమ్ తో ఈ సంవత్సరం అంతర్జాతీయ జీవవైవిధ్య దినోత్సవాన్ని జరుపుకుంటున్నామన్నారు. మనమందరం ప్రకృతితో కలసి సామరస్యంగా జీవించడమేనని పేర్కొన్నారు.
మానవ జీవితంపై ప్రకృతి విపత్తులు, కరోనా మహమ్మారులు ఒకదాని వెంట మరొకటి దాడి చేస్తూ.. మనుగడకు ముప్పు వాటిల్లజేస్తున్నాయని తెలిపారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో మనం యధార్థాన్ని గ్రహించి మసలుకోవాల్సిన అవసరముందని, లేదంటే భవిష్యత్తు ప్రశ్నార్థకమయ్యే అవకాశముందన్నారు. అభివృద్ధి పేరుతో మనం ఇప్పటికే ఎంతో విలువైన ప్రకృతి సంపదను కొల్పోయామని, అయినా ఇప్పటికీ ఎంతో మిగిలివున్న ప్రకృతి సంపందను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి మనిషిపైనా ఉందన్నారు.
ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు పర్యావరణ పరిరక్షణ, జీవవైవిధ్య సంరక్షణకు అధిక ప్రాధన్యతనిస్తూ చేపట్టిన వివిధ కార్యక్రమాలు సత్ఫలితాలు ఇస్తున్నాయన్నారు. హరితహార కార్యక్రమ ఫలితాలు ఇప్పుడు రాష్ట్ర మంతా మన కళ్లముందు కనిపిస్తున్నాయని వెల్లడించారు. పెద్ద ఎత్తున మొక్కలు నాటి, వాటిని సంరక్షించడం వల్ల తెలంగాణలో 4% పచ్చదనం పెరిగిందన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం జీవవైవిధ్య పరిరక్షణలో భాగంగా అమలు చేస్తున్న పునరుద్దరణ చర్యల వల్ల అడవుల్లో వృక్ష, జంతు జాతులు బాగా వృద్ది చెందాయని తెలిపారు. తెలంగాణలోని అనేక ప్రాంతాలు వైవిధ్యభరితమైన జీవ, వృక్ష సంపదకు కేంద్రంగా ఉన్నాయన్నారు. ప్రత్యేక లక్షణాలను సొంతం చేసుకొని తెలంగాణకు తలమానికమైన మన్ననూరు తూర్పు పొడ ఎడ్లను స్వదేశి జాతి పరిరక్షణగా మన భారత ప్రభుత్వం గుర్తించిందన్నారు.
జీవవైవిద్య పరిరక్షణ చట్టం -2002ను ప్రజల్లోకి తీసుకువెళ్ళాల్సిన అవసరం ఎంతైనా ఉందని అభిప్రాయపడ్డారు. గ్రామాల్లో జీవవైవిధ్య యాజమాన్య కమిటీలు ఆయా ఆవాస ప్రాంతాల్లోని సంప్రదాయ, జీవవైవిధ్య వనరుల్ని సంరక్షించేందుకు తోడ్పాటునందించాలన్నారు. ప్రజలందరికీ జీవవైవిధ్య చట్టంపై అవగాహన కల్పించేందుకు “జీవవైవిధ్య రచ్చ బండ” (బయోడైవర్సిటీ చౌపాల్) అనే ప్రచార కార్యక్రమాన్ని ఈ రోజున ప్రారంభించామన్నారు. జీవవైవిధ్య, పర్యావరణ పరిరక్షణకు కృషి చేస్తున్న జీవవైవిధ్య మండలి అధికారులు, పర్యావరణవేత్తలకు ఈ సందర్భంగా ఆయన అభినందనలు తెలియజేశారు.
ఈ సమావేశంలో పీసీసీఎఫ్ ఆర్.శోభ, జీవవైవిధ్య మండలి సభ్య కార్యదర్శి కాళీచరణ్ యస్. కర్తాడే, మధ్యప్రదేశ్ స్టేట్ బయోడైవర్సిటీ బోర్డు మాజీ సభ్య కార్యదర్శి శ్రీనివాస మూర్తి, తదితరులు పాల్గొన్నారు.