చేపల పెంపకం బహులాభదాయకం: మంత్రి జగదీష్ రెడ్డి
- సాంప్రదాయ పంటలకు స్వస్తి పలకండి
- చేపల పెంపకానికి సమృద్ధిగా నీరు
- వరితో పోలిస్తే చేపల పెంపకంతోటే అధిక లాభాలు
- నార్కెట్ పల్లి మండలంలోనీ అమ్మనబోలులో చేపల పెంపకాన్ని పరిశీలించిన మంత్రి జగదీష్ రెడ్డి, పాల్గొన్న శాసనసభ్యుడు చిరుమర్తి లింగయ్య
ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని తెలంగాణ ప్రభుత్వం చేపల పెంపకాన్ని ప్రోత్సహిస్తుందని ఆయన తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో సమ్రుద్దిగా నీరు లభిస్తున్నందున రైతాంగం చేపల పెంపకంపై దృష్టి సారించాలని ఆయన రైతాంగానికి విజ్ణప్తి చేశారు.
నల్లగొండ జిల్లా నార్కెట్ పల్లి మండల పరిధిలోని అమ్మనబోలు గ్రామంలో బద్దం రాంరెడ్డి అనే రైతు కిందటి సంవత్సరం నుండి తనకున్న పది ఎకరాల వ్యవసాయ భూమిలో పెంచుతున్న చేపల పెంపకాన్ని మంత్రి జగదీష్ రెడ్డి గురువారం మధ్యాహ్నం స్థానిక శాసనసభ్యుడు చిరుమర్తి లింగయ్యతో కలసి సందర్శించారు.
అనంతరం ఆయన స్థానిక రైతులతో సాంప్రదాయ పంటలపై ఇష్టా గోష్టిగా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతూ కిందటి యేడాది వానాకాలం నుండి ఇప్పటి వరకు చేపల పెంపకాన్ని కొనసాగిస్తున్న రైతు రామిరెడ్డిని అభినందించారు. చేపల పెంపకంపై రాంరెడ్డి ఎదుర్కొన్న సాధక బాధకాలను అక్కడి రైతులకు వివరించిన మంత్రి జగదీష్ రెడ్డి వ్యవసాయంలో విపలవాత్మకమైన మార్పులు అవసరమన్నారు.
అందులో అన్నింటినీ పోల్చి చూసినప్పుడు తెలంగాణ రాష్ట్రంలో చేపల పెంపకం అధిక లాభాలు ఇస్తుందని ఇక్కడి రైతు రాంరెడ్డి రుజువు పర్చారని ఆయన అన్నారు. అటువంటి రైతు స్ఫూర్తిగా యావత్ రైతాంగం ప్రత్యామ్నాయ పంటల వైపు దృష్టి సారించాలన్నారు.
వేరుశనగ, కందులు, పెసర, మినుములతో పాటు చేపల పెంపకంపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. తద్వారా తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు గడించవచ్చన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో స్థానిక శాసనసభ్యుడు చిరుమర్తి లింగయ్య, నార్కెట్ పల్లి ఎంపీపీ సూదిరెడ్డి నరేందర్ రెడ్డి, మాజీ ఎంపీపీ రేగట్టి మల్లికార్జున్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.