నిర్మాణ వ్య‌ర్థాల తరలింపుకు టోల్ ఫ్రీ నెంబర్ : మంత్రి కేటీఆర్

Related image

  • నిర్మాణ వ్య‌ర్థాల తరలింపుకు టోల్ ఫ్రీ నెంబర్ 18001201159
హైదరాబాద్, జూన్ 25: గ్రేటర్ హైదరాబాద్ లో నిర్మాణ వ్య‌ర్థాల తరలింపుకు టోల్ ఫ్రీ నెంబర్ 18001201159 అనే నెంబర్ కు ఫోన్ చేయాలని రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి కె.టి.రామారావు కోరారు. భవన నిర్మాణ వ్యర్థాల నిర్వ‌హ‌ణ ప్లాంట్ ను నాగోల్‌లోని ఫ‌తుల్లాగూడ‌లో రాష్ట్ర ఐటీ, పుర‌పాల‌క శాఖ మంత్రి కేటీఆర్ నేడు ప్రారంభించారు. వెట్ ప్రాసెసింగ్ సాంకేతిక ప‌రిజ్ఞానంతో నిర్మించిన ఈ వ్య‌ర్థాల నిర్వ‌హ‌ణ ప్లాంట్‌ ద్వారా రోజుకు 500 ట‌న్నుల నిర్మాణ వ్య‌ర్థాల పున‌ర్వినియోగం చేస్తారు.

ఎల్బీనగర్ శాసన సభ్యుడు డి.సుధీర్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి ఎమ్మెల్సీలు ఎగ్గె మల్లేశం, బి.దయానంద్, పర్యాటక సంస్థ ఛైర్మన్ శ్రీనివాస్ గుప్తా, డిప్యూటి మేయర్ మోతె శ్రీలత శోభన్ రెడ్డి, నాగోల్ కార్పొరేటర్ అరుణ యాదవ్, రాంకీ ఎన్విరో ఎం.డి గౌతమ్ రెడ్డి, తదితరులు పాల్గొన్న ఈ సమావేశంలో మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. హైదరాబాద్ నగరంలో ఇప్పటికే జీడిమెట్లలో 500 మెట్రిక్ టన్నుల సామర్థ్యం గల ప్లాంట్ ను ఏర్పాటు చేశామని తెలిపారు.

ప్రస్తుతం ప్రారంభించిన ఫతుల్లాగూడ ప్లాంట్ తో పాటు నగరంలో మరో రెండో భవన నిర్మాణ వ్యర్థాల రీసైక్లింగ్ ప్లాంట్లను ఏర్పాటు చేయనున్నట్లు తెలియజేశారు. హైదరాబాద్ నగరంతో పాటు రాష్ట్రంలోని ఇతర ప‌ట్ట‌ణాల్లో కూడా క్లస్టర్ పద్దతిలో ఇదే తరహా నిర్మాణ వ్య‌ర్థాల నిర్వ‌హ‌ణ ప్లాంట్ల‌ను ఏర్పాటు చేస్తామ‌న్నారు. హైదరాబాద్ నగరంలో భవన నిర్మాణ వ్యర్థాలను చెరువుల్లో, నాలాల్లో, కాలువల్లో వేసే పద్దతికి స్వస్తి చెప్పాలని, ఈ వ్య‌ర్థాల త‌ర‌లింపున‌కు టోల్ ఫ్రీ నంబ‌ర్ 18001201159 అందుబాటులోకి తెచ్చామని తెలిపారు.

గ్రేటర్ హైదరాబాద్ లో ఘన వ్యర్థాల నిర్వహణకు చేపట్టిన పలు చర్యల వల్ల ఘన వ్యర్థాల సేకరణ గతంలో 3వేల మెట్రిక్ టన్నులు ఉండగా ప్రస్తుతం ఇది 7,500 మెట్రిక్ టన్నులకు పెరిగిందని వివరించారు. గార్బేజ్ కలెక్షన్ పాయింట్లను 70కి పెంచామని, వీటిని వంద పాయింట్లను చేపట్టనున్నట్లు తెలిపారు. నగరంలో చెత్తను సేకరించేందుకు 90 ఆధునిక భారీ వాహనాలను ప్రవేశపెట్టామని తెలిపారు.

జవహర్ నగర్ లో చెత్త నుండి విద్యుత్ ఉత్పత్తి చేసే 20 మెగా వాట్ల ప్లాంట్ ను ప్రారంభించామని మరో 28 మెగా వాట్ల ప్లాంట్ ను కూడా ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. పొడిచెత్తతో విద్యుత్ ఉత్పత్తి చేస్తుండగా తడి చెత్తతో ఎరువుల తయారి చేస్తున్నామని తెలిపారు. ఎల్బీనగర్ లోనే రూ. 450 కోట్ల వ్యయంతో పలు ఫ్లైఓవర్లు, అండర్ పాస్ ల నిర్మాణం జరుగుతోందని గుర్తు చేశారు. గత సంవత్సరం భారీ వర్షాల వల్ల వచ్చిన వరదముంపును నివారించేందుకు తొలి దశగా రూ. 858 కోట్ల వ్యయంతో నాలాల అభివృద్ది చేపట్టడానికి పరిపాలన సంబంధిత మంజూరు ఇచ్చినట్లు తెలిపారు.

More Press Releases