అంతర్రాష్ట్రకార్మికులకు అందుబాటులో వైద్యసేవలు: మంత్రి జగదీష్ రెడ్డి

Related image

  • తెలంగాణ రాష్ట్రంలో ఏ ఒక్కరూ ఆందోళన చెందొద్దు
  • ప్రజా ఆరోగ్య పరిరక్షణలో ముఖ్యమంత్రి కేసీఆర్ బృహత్ ప్రణాళికలు
  • స్థానిక పౌరులతో సమానంగా అంతర్ రాష్ట్ర కార్మికులకు సౌకర్యాలు
  • దామరచర్ల పవర్ ప్లాంట్ లో 30 పడకల ఆసుపత్రి ప్రారంబించిన మంత్రి జగదీష్ రెడ్డి
  • పాల్గొన్న ట్రాన్స్కో&జెన్కో సీఎండీ దేవులపల్లి ప్రభాకర్ రావు
దామరచర్ల మండలం వీర్ల పాలెం వద్ద రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తున్న4,000 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి కేంద్రంలో పనిచేసే అంతర్ రాష్ట్ర కార్మికులు ఎవరూ ఆరోగ్యం విషయంలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. స్థానికులతో సమానంగా అంతర్ రాష్ట్ర కార్మికులకు వైద్య సేవలు అందించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ సిద్ధంగా ఉన్నారని ఆయన తెలిపారు.

నల్లగొండ జిల్లా మిర్యాలగూడ నియోజకవర్గ పరిధిలోని దామరచర్ల మండలం వీర్లపాలెం వద్ద రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తున్న పవర్ ప్లాంట్ ప్రాంగణంలో కోటి 25 లక్షల రూపాయల అంచనా వ్యయంతో నూతనంగా నిర్మించిన 30 పడకల ఆసుపత్రిని ట్రాన్స్కో&జెన్కో సీఎండీ దేవులపల్లి ప్రభాకర్ రావుతో కలసి ప్రారంభించారు. అనంతరం ఆయన మీడియా తో మాట్లాడుతూ 2022 నాటికి యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ పూర్తి చేసి నాలుగు వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి లక్ష్యంగా ప్రారంభించిన ఈ పవర్ ప్లాంట్ కు కరోనా మహమ్మారి అవాంతరంగా మారిందన్నారు.

పవర్ ప్లాంట్ నిర్మాణం కోసం సుదూర ప్రాంతాల నుండి సుమారు ఎనిమిది వేల మంది కార్మికులు తరలి వచ్చారని ఆయన చెప్పారు. దాంతో నిర్మాణం వేగవంతం అవుతున్న సమయంలో కరోనా మహమ్మారి ఒక ఉపద్రవంగా వచ్చిపడడంతో భయాందోళనకు గురైన కార్మికులు వాపస్ వెళ్లి పోయారన్నారు. అటువంటి సమయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ స్పందించి ప్లాంట్ ప్రాంగణంలో 30 పడకల ఆసుపత్రి నిర్మాణానికి శ్రీకారం చుట్టాలని అదేశించారన్నారు.

అందుకు అనుగుణంగా నిర్మాణం చేపట్టిన ఏజెన్సీ నెల రోజుల వ్యవధిలోనే ఆసుపత్రి పూర్తి చేశారన్నారు. దాంతో నాలుగు వేల మంది కార్మికులు తిరిగి పనులలోకి దిగారన్నారు. మిగితా కార్మికులు కూడా తిరిగి వచ్చేందుకు తమ సంసిద్ధత వ్యక్తం చేస్తున్నారన్నారు. ఇక్కడ ప్రారంభించిన 30 పడకల ఆసుపత్రిలో ఆక్సిజన్ సిలిండర్లను అందుబాటులో ఉంచామన్నారు. కోవిడ్ తో సహా ఇక్కడ అన్ని రకాల వైద్య సేవలు అందించేందుకు వీలుగా సిబ్బందిని నియమించడం జరిగిందన్నారు.

అంతేగాకుండా కోవిడ్ ను నియంత్రించేందుకుగాను ఇప్పటికే 1000 మంది కార్మికులకు వ్యాక్సిన్ ఇవ్వడం జరిగిందన్నారు. మిగితా కార్మికులకు కూడా వ్యాక్సిన్ ఇచ్చేందుకు అధికారులు సిద్డంగా ఉన్నారన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో డైరక్టర్ జగత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అనంతరం పవర్ ప్లాంట్ ప్రాంగణంలో విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి, ట్రాన్స్కో&జెన్కో సీఎండీ దేవులపల్లి ప్రభాకర్ రావులు వేర్వేరుగా మొక్కలు నాటారు.
నల్లగొండ జిల్లా దామరచర్ల మండలం వీర్లపాలెం వద్ద రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తున్న యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ ప్రాంగణంలో కోటి 25 లక్షల రూపాయలతో నిర్మించిన 30 పడకల ఆసుపత్రిని ప్రారంబించిన అనంతరం పవర్ ప్లాంట్ ప్రాంగణంలో మొక్కను నాటుతున్న రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి, ట్రాన్స్కో&జెన్కో సీఎండీ దేవులపల్లి ప్రభాకర్ రావులు

 

More Press Releases