జులై 1 నుండి పట్టణ ప్రగతి కార్యక్రమం: మంత్రి తలసాని
హైదరాబాద్: ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించి పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని చేపట్టారని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. పట్టణాల సమగ్ర అభివృద్ధి కోసం చేపట్టిన పట్టణ ప్రగతి కార్యక్రమం జులై 1 నుండి 10 వ తేదీ వరకు నిర్వహించడం జరుగుతుందని పేర్కొన్నారు. 1 వ తేదీ గురువారం ఉదయం 9.30 గంటలకు ఖైరతాబాద్ నియోజకవర్గ పరిధిలోని దుర్గానగర్ పార్క్ లో స్థానిక ఎమ్మెల్యే దానం నాగేందర్, మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, కార్పొరేటర్ విజయారెడ్డి లతో కలిసి పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు.
పట్టణ ప్రగతి కార్యక్రమం నిర్వహణ కోసం జీహెచ్ఎంసీ పరిధిలో 955 ప్రత్యేక టీం లను ఏర్పాటు చేసినట్లు వివరించారు. పట్టణాలు పరిశుభ్రంగా, పచ్చదనంతో కళకళ లాడుతూ ఉండాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు పట్టణ ప్రగతి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని వివరించారు. పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా చెత్త, వ్యర్ధాలను తొలగించడం, డ్రైనేజీ లను శుభ్రపర్చడం, దోమల నివారణ కోసం పాగింగ్ చేయడం, హరితహారం కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటడం వంటి కార్యక్రమాలను ప్రజల భాగస్వామ్యంతో నిర్వహించడం జరుగుతుందని వివరించారు.
కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించాలని జీహెచ్ఎంసీ కమిషనర్, జోనల్ కమిషనర్ లకు ఆదేశాలు జారీ చేసినట్లు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు. ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, కార్పొరేటర్ లు వారి వారి ప్రాంతాలలో జరిగే పట్టణ ప్రగతి కార్యక్రమంలో విధిగా పాల్గొని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు నిర్దేశించిన లక్ష్యాలను సాధించేలా విజయవంతం చేయాలని కోరారు. అంతేకాకుండా వాటర్ వర్క్స్, రెవెన్యూ, ఎలెక్ట్రికల్ తదితర శాఖల అధికారులు కూడా పట్టణ ప్రగతి కార్యక్రమాలకు తమవంతు సహకారం అందించాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆదేశించారు.