60రోజుల్లో కమాండ్ కంట్రోల్ సెంటర్ పనులు పూర్తి కావాలి: మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి
హైదరాబాద్: ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు నగరంలో అత్యధునాతన టెక్నాలజీతో నిర్మిస్తున్న పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ నిర్మాణ పనులను రాష్ట్ర రోడ్లు-భవనాలు, గృహ నిర్మాణ మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి బుధవారం పరిశీలించారు. కమాండ్ కంట్రోల్ సెంట్రల్ నిర్మాణ ప్రాంగణమంతా డీజీపీ మహేందర్ రెడ్డి, ఆర్ అండ్ బి అధికారులతో కలసి కలియతిరిగారు. ఈ సందర్భంగా పలు సూచనలు చేశారు.
దేశంలోనే ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో పటిష్ట భద్రతను అందించేందుకు అత్యధునాతన టెక్నాలజీతో ఆర్ అండ్ బి శాఖ ఆధ్వర్యంలో పొలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ నిర్మిస్తున్నామని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ దృఢ సంకల్పంతో నిర్మిస్తున్న ఈ అత్యధునాతన సాంకేతిక కట్టడం ప్రపంచంలోనే అద్భుతమైన నిర్మాణాల్లో ఒకటిగా నిలుస్తుందన్నారు.
ముఖ్యమంత్రి ఆదేశాలకు అనుగుణంగా 60 రోజుల్లో నిర్మాణ పనులు పూర్తి కావాలని వర్క్ ఏజెన్సీ షాపూర్ పల్లోన్జీ ప్రతినిధులను మంత్రి ఆదేశించారు. రెండు నెలల్లో పనులు పూర్తి చేసే విధంగా రోజువారీగా చేయాల్సిన పనులపై ఏజెన్సీ/వెండర్ ల వారీగా పర్ట్ చార్ట్ రూపొందించుకొని పనులు చేయాలన్నారు. దాని ప్రకారం రోజు విడిచి రోజు పనుల పురోగతిని సమీక్షించుకోవాలని అన్నారు.
టీమ్ లాగా ఏర్పడి బ్లాక్ ల వారిగా పని విభజించుకుని టార్గెట్ పెట్టుకుని పని చేయాలని అన్నారు. లాక్ డౌన్ నేపథ్యంలో పనులు కాస్త నెమ్మదించిన.. ఇప్పడు రెట్టింపు సంఖ్యలో కార్మికులను వినియోగించి నిర్మాణ పనుల్లో వేగం పెంచాలన్నారు. కచ్చితంగా మూడు షిప్టులల్లో 24 గంటలు నిరంతరాయంగా వేగంగా పనులు జరిగేలా చూడాలని అధికారులను, వర్క్ ఏజెన్సీని ఆదేశించారు.
నిర్మాణ పనులను వారానికి ఒకసారి ఆకస్మికంగా తనిఖీ చేస్తానని ఈ సందర్భంగా మంత్రి తెలిపారు. మంత్రి వెంట రాష్ట్ర డీజీపీ మహేందర్ రెడ్డి, ఆర్ అండ్ బి ఈఎన్సీ గణపతి రెడ్డి, వర్క్ ఏజెన్సీ ప్రతినిధులు, పలువురు అధికారులు పాల్గొన్నారు.