పల్లె ప్రగతి కార్యక్రమంలో రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలి: మంత్రి ఎర్రబెల్లి
- పల్లె ప్రగతి నిరంతర ప్రక్రీయ.. పల్లెలను పరిశుభ్రంగా, పచ్చధనంతో ఉండేలా స్థానిక ప్రజాప్రతినిధులు, గ్రామ పంచాయతీ కార్యదర్శులు కృషి చేయాలి
- రాష్ట్రంలోని గ్రామాలలో అభివృద్ది కార్యక్రమాలు చేపట్టడానికి ప్రతినెలా 275 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం గ్రాంటుగా విడుదల చేస్తున్నది
పల్లెప్రగతి కార్యక్రమంలో రాజకీయాలకు అతీతంగా అందరూ భాగస్వాములు కావాలని మంత్రి కోరారు. పుట్టి పెరిగిన ఊరి రుణం ప్రతి ఒక్కరు తీర్చుకోవాలని సూచించారు. రాష్ట్రంలో పచ్ఛదనం, పరిశుభ్రత పెంపొందించాలనే లక్ష్యంతో నాలుగవ విడత పల్లెప్రగతి కార్యక్రమం నిర్వహించబడుతున్నదని, పారిశుధ్యం, మౌళిక సధుపాయాలు, ఆరోగ్యం, హరితహారం, విద్యుత్తు సమస్యల పరిష్కారం మొదలగు అంశాలకు ఈ కార్యక్రమంలో ప్రాధాన్యతనిస్తున్నట్లు మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు తెలిపారు.
రాష్ట్రంలోని గ్రామాలలో అభివృద్ది కార్యక్రమాలు చేపట్టడానికి 2019 సంవత్సరం సెప్టెంబర్ నుండి ఇప్పటి వరకు 6500 కోట్ల రూపాయలను గ్రామాలకు గ్రాంటు మంజూరు చేశామని మంత్రి తెలిపారు. గ్రామ పంచాయతీలలో అభివృద్ది పనులు చేపట్టడానికి నిధుల కొరత లేదన్నారు. సిరిగిరిపురం గ్రామంలో పల్లెప్రగతి కార్యక్రమం క్రింద 59 లక్షల 30వేల రూపాయల వ్యయంతో వివిద అభివృద్ది పనులును చేపట్టడం జరిగిందని అయన చెప్పారు. సిరిగిరిపురం గ్రామంలో త్రాగునీటిని 55 లక్షల వ్యయంతో మిషన్ భగీరథ పథకం క్రింద అందిస్తున్నామని మంత్రి తెలిపారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ గత ఏడేళ్ల కాలంలో రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజల సంక్షేమం, అభివృద్ది కోసం ఎన్నో వినూత్నమైన పథకాలను రాష్ట్రంలో అమలు చేస్తున్నారని మంత్రి దయాకర్రావు తెలిపారు. రైతుబంధు, రైతు భీమా, కళ్యాణలక్ష్మి, ఆసరా పెన్షన్లులాంటి దాదాపు 100కు పైగా పథకాలను రాష్ట్రంలో అమలు చేస్తున్నామని మంత్రి తెలిపారు.
పల్లెప్రగతి కార్యక్రమం అమలు వల్ల గ్రామాలు పరిశుభ్రంగా ఉన్నాయని, వానాకాలంలో పరిశుభ్రత లేకపోవడం వల్ల వచ్చే విషజ్వరాలు, అంటువ్యాధులు పూర్తిగా అరికట్టబడ్డాయని ఆయన అన్నారు. పల్లెప్రగతి కార్యక్రమం మూడు విడతలలో గ్రామాలలో ఏళ్ల తరబడి పెండింగ్లో ఉన్న సమస్యలు పరిష్కారం అయ్యాయని మంత్రి తెలిపారు. గ్రామాలలో పేరుకు పోయిన తడి, పొడి చెత్తను ప్రతి రోజు ఉదయం డంపింగ్ యార్డుకు తరలించడానికి హరితహారం పథకం కింద నాటిన మొక్కలను సంరక్షించడానికి నీరు పోయడానికి రాష్ట్రంలోనున్న 12,769 గ్రామాలకు ట్రాక్టర్లు, ట్రాలీలు, ట్యాంకర్లు సమకూర్చడం జరిగిందని మంత్రి తెలిపారు. రాష్ట్రంలో ట్రాక్టర్, ట్రాలీ, ట్యాంకర్ లేని గ్రామ పంచాయతీలు లేవని అన్నారు.
రాష్ట్రంలోని గ్రామాలలో 116 కోట్ల రూపాయల వ్యయంతో 19472 పకృతి వనాలు ఏర్పాటు చేస్తున్నామని, అందులో 19298 ప్రకృతి వనాలు పూర్తై వినియోగంలోకి వచ్చాయని, మిగతా 174 ప్రకృతి వనాల నిర్మాణం పూర్తి చేసిన వెంటనే వినియోగంలోకి తీసుకురావాలని ఆయన చెప్పారు. అదేవిధంగా 1554 కోట్ల రూపాయల వ్యయంతో 12728 వైకుంఠధామాల నిర్మాణాన్ని చేపట్టడం జరుగగా, ఇప్పటికే 12,386 వైకుంఠదామాల నిర్మాణం పూర్తి అయ్యాయని, మిగతా వైకుంఠధామాల నిర్మాణాన్ని నాలుగవ విడత పల్లెప్రగతి కార్యక్రమంలో పూర్తి చేసి వినియోగంలోకి తీసుకరావాలని మంత్రి కోరారు.
గ్రామాలలోని తడి, పొడి చెత్తను తరలించడానికి రాష్ట్ర వ్యాప్తంగా 319 కోట్ల రూపాయల వ్యయంతో 12776 డంపింగ్ యార్డుల నిర్మాణాన్ని చేపట్టామని, అందులో 12686 డంపింగ్ యార్డులు పూర్తై వినియోగంలోకి వచ్చాయని మంత్రి తెలిపారు. అసంపూర్తిగా ఉన్న 90 డంపింగ్ యార్డులను వెంటనే పూర్తి చేసి వినియోగంలోకి తీసుకురావాలని ఆదేశించారు. పర్యావరణ పరిరక్షణకు గ్రామంలో ప్రతి ఇంటికి 6 మొక్కలను సరఫరా చేస్తున్నామని ఆయన తెలిపారు. నాటిన ప్రతి మొక్కను సంరక్షించాలని ఆయన కోరారు. చనిపోయిన మొక్కల స్థానంలో ఎప్పటికప్పుడు కొత్త మొక్కలను నాటాలని ఆయన కోరారు.
దేశంలోనే ఎక్కడ లేని విధంగా గ్రామాలను సమగ్రంగా అభివృద్ది చేయాలనే సంకల్పంతో రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో మూడు విడతలలో పల్లెప్రగతి కార్యక్రమాన్ని విజయవంతంగా అమలు పరిచామని, ఇదే స్పూర్తితో పల్లెప్రగతి నాలుగవ విడత కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందని విధ్యాశాఖామంత్రి సభితాఇంద్రారెడ్డి తెలిపారు. పల్లెప్రగతి కార్యక్రమం అమలు వల్ల గ్రామాలలో పచ్చదనం, పరిశుభ్రత వెళ్లి విరుస్తుందన్నదని ఆమె తెలిపారు. పల్లెప్రగతి కార్యక్రమంలో భాగంగా సమకూర్చిన ట్రాక్టర్లు, ట్రాలీలు, ట్యాంకర్లు, వైకుంఠధామాలు, పల్లె ప్రకృతి వనాలు, డంపింగ్ యార్డులు, హరితహరం కార్యక్రమం క్రింద చెట్ల పెంపకం వల్ల గ్రామాల ముఖచిత్రం పూర్తిగా మారిపోయిందని తెలిపారు.
రాష్ట్రంలోని గ్రామాలలో వివిధ అభివృద్ది కార్యక్రమాలు చేపట్టడానికి గ్రామ పంచాయతీలకు ప్రతినెల గ్రాంటును విడుదల చేస్తున్నామని రాష్ట్ర పంచాయతీరాజ్ కమీషనర్ రఘునంధన్రావు తెలిపారు. గ్రామాలలో అమలు చేస్తున్న పచ్చధనం, పరిశుభ్రత, ఇతర కార్యక్రమాల అమలు ఆధారంగా మార్కులు వేసి ర్యాంకింగ్ ఇస్తున్నామని ఆయన తెలిపారు.
రంగారెడ్డి జిల్లా కలెక్టర్ అమెయ్కుమార్, రంగారెడ్డి జిల్లా పరిషత్ చైర్మన్ డాక్టర్ తీగల అనితహరినాథ్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే తీగల క్రిష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. సిరిగిరిపురం గ్రామ సర్పంచ్ కార్యక్రమానికి అధ్యక్షత వహించారు.
అంతకు ముందు మంత్రులు సిరిగిరిపురం గ్రామంలోని పల్లెపకృతి వనాన్ని సందర్శించి మొక్కలను నాటారు. అనంతరం సిరిగిరిపురం గ్రామంలో పర్యటించి ఇంటర్నల్ రోడ్లను, వైకుంఠధామాన్ని, డంపింగ్ యార్డును మంత్రులు పరిశీలించారు.