హరితహారం కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి
ఆసిఫాబాద్- కుమ్రం భీం, జూలై 5: కెరమెరి మండలం సాకడ, మెట్ట పిప్రి, సూర్ద పూర్, ధనోర, గాయాగం, కొఠారి, గ్రామాల్లో 7వ విడత హరితహారం కార్యక్రమంలో భాగంగా అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి ఆదివాసులతో కలిసి మొక్కలు నాటారు.
అనంతరం మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మాట్లాడుతూ... హరితహారం కార్యక్రమంతో పాటు సీఎం కేసీఆర్ మార్గనిర్ధేశనంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన విప్లవాత్మకమైన పంచాయతీరాజ్, పురపాలక చట్టాలతో పచ్చదనం పెంపునకు అధిక ప్రాధాన్యతను ఇస్తున్నారన్నారు. నాటిన మొక్కలలో కనీసం 85 శాతం మొక్కలను కాపాడే బాధ్యత స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులపై ఉందని ఆయన పేర్కొన్నారు. గ్రామ పంచాయతీల్లో, పట్టణాల్లో పచ్చదనానికి పది శాతం నిధులు కేటాయించారని, నర్సరీలను ఏర్పాటు చేశారని తెలిపారు. ఇదే స్ఫూర్తిని కొనసాగిస్తూ ఏడవ విడత హరితహారం కార్యక్రమాన్ని ప్రజలను భాగస్వామ్యం చేస్తూ తెలంగాణకు హరితహారం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో తెలంగాణలో అటవీ విస్తీర్ణం తగ్గిపోయిందని, ఆ నష్టాన్ని ఇప్పుడు భర్తీ చేసుకోవాల్సి ఉందన్నారు. ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా మొక్కలు పెంచితే భవిష్యత్ తరాలకు ఢోకా ఉండదన్నారు. పర్యావరణాన్ని నిర్లక్ష్యం చేయడం వల్ల కరోనా లాంటి మహామ్మారులు మనల్ని పట్టిపీడిస్తున్నాయని పేర్కొన్నారు. ఆక్సిజన్ దొరక్క చాలా ఇబ్బందులు పడటం మనం చూశామన్నారు. ప్రాణవాయువును అందించే చెట్లను కాడుకోవడంతో పాటు విరివిగా మొక్కలు నాటి సంరక్షించాలి అని కోరారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ పురాణం సతీష్, ఎమ్మెల్యే ఆత్రం సక్కు, జడ్పీ చైర్ పర్సన్ కోవా లక్మి, కలెక్టర్ రాహుల్ రాజ్ తదితరులు పాల్గొన్నారు.