తప్పని పరిస్థితుల్లో మాత్రమే వరికి ప్రాధాన్యత ఇవ్వాలి: తెలంగాణ మంత్రి జగదీష్ రెడ్డి
మిర్యాలగూడ: తప్పనిసరి పరిస్థితుల్లో మాత్రమే వరిని సాగుచేయాలని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. కూరగాయల సాగుతో అధిక ఆదాయం లభిస్తుందన్నారు. ప్రత్యేకించి బోర్ల కింద భూములలో కూరగాయల సాగే మేలని ఆయన సూచించారు. పట్టణప్రగతి, పల్లెప్రగతి కార్యక్రమంలో భాగంగా బుధవారం రోజున ఆయన నల్లగొండ జిల్లా మిర్యాలగూడ నియోజకవర్గంలో సుడిగాలి పర్యటన నిర్వహించారు.
స్థానిక శాసనసభ్యుడు నలబోతు భాస్కర్ రావు ఆధ్వర్యంలో ఏర్పాటైన ఈ పర్యటనలో దామరచర్ల మండలం నేనావత్ తండాలో ఏర్పాటు చేసిన మేఘా హరితాహారం కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఒకే సమయంలో ఐదు వేల మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంబించడంతో పాటు పల్లె ప్రకృతి వనాన్ని ఆయన ప్రారంభించారు. అదే విదంగా మిర్యాలగూడ మండలం యాద్గారిపల్లితో పాటు దామరచర్ల మండలం రాజగట్టు, ఇరికిగూడెం, వాడపల్లిలలో నూతనంగా నిర్మించిన వైకుంఠ దామలను మంత్రి జగదీష్ రెడ్డి ప్రారంభించారు.
దానితో పాటుగా మిర్యాలగూడ మండలం ఉట్లపల్లి వద్ద అదే మండల పరిధిలోనీ కొత్తగూడెంలలో నూతనంగా నిర్మించిన రైతు వేదికలతో పాటు వాడపల్లి గ్రామంలో బీసీ సంక్షేమ భవనాన్ని, పల్లె ప్రకృతి వనాలను ఆయన ప్రారంభించారు.
ఈ సందర్భంగా మిర్యాలగూడ మండలం ఉట్లపల్లి గ్రామంలో ప్రకృతి వనంతో పాటు రైతువేదికను ప్రారంభించిన అనంతరం జరిగిన బహిరంగ సభలో మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడారు. భూమి నుండి బంగారం పండించాలి అనుకునే రైతులు మూస పద్దతిలో చేస్తున్న వ్యవసాయానికి స్వస్తి పలకాలని ఆయన సూచించారు. కందికున్న డిమాండ్ పై యావత్ రైతాంగం దృష్టి సారించాలన్నారు.
పట్టణ ప్రగతి, పల్లె ప్రగతి కార్యక్రమంలో మంచి ఫలితాలు వస్తున్నాయన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సంకల్పం నెరవేరే దూరం దగ్గరలోనే ఉందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఇంకా ఈ కార్యక్రమంలో స్థానిక శాసనసభ్యుడు యన్.భాస్కర్ రావు, రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు రామచంద్ర నాయక్, మిర్యాలగూడ జడ్పీటీసీ తిప్పన విజయసింహా రెడ్డి, స్థానిక ఎంపీపీ సరళా హనుమంత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.