భారత హాకీ జట్టుకు అభినందనలు తెలిపిన మంత్రి శ్రీనివాస్ గౌడ్
హైదరాబాద్: 4 దశాబ్దాల అనంతరం మన హాకీ జట్టు టోక్యో ఒలింపిక్స్ లో దేశ కీర్తి పతాకాన్ని రెపరెపలాడించిన సందర్భంగా తెలంగాణ హాకీ అసోసియేషన్ ఆధ్వర్యంలో రవీంద్రభారతిలో ని మంత్రి కార్యాలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సంబరాల్లో రాష్ట్ర అబ్కారీ, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ పాల్గొని హాకీ జట్టకు అభినందనలు తెలియజేశారు.
ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. నాలుగు దశాబ్దాల అనంతరం మన హాకీ క్రీడాకారుల బృందం ఒలింపిక్స్ లో దేశ కీర్తి పతాకాన్ని రెపరెపలాడించడం ఎంతో సంతోషంగా వుందన్నారు. ఒలింపిక్స్ లో కాంస్య పతకం సాధించడంతో భారత్‌లో హాకీ ఆటకు పునర్ వైభవాన్ని తీసుకవచ్చారన్నారు మంత్రి శ్రీనివాస్ గౌడ్. టోక్యో ఒలింపిక్స్ లో కాంస్య పతకం సాధించినందుకు భారత హాకీ జట్టుకు అభినందనలు తెలిపారు. చిరకాల స్వప్నాన్ని నెరవేర్చిన క్రీడాకారులకు శుభాకాంక్షలు తెలిపారు.
కాంస్య పతకం కోసం జరిగిన పోటీలో బలమైన ప్రత్యర్థిని జర్మనీ జట్టును ఎదుర్కొని గెలిచారు. ఇదే స్ఫూర్తిని కొనసాగిస్తూ రానున్న రోజుల్లో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. ఒలింపిక్స్ లో సాధించిన కాంస్య పతకాన్ని కొవిడ్ యోధులైన వైద్యులు, ఆరోగ్య సిబ్బందికి అంకితం ఇచ్చిన హాకీ జట్టు కెప్టెన్ మన్‌ప్రీత్ సింగ్, కోచ్ గ్రాహమ్ రీడ్ లకు ఈ సందర్భంగా అభినందనలు తెలిపారు.
ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలో క్రీడల అభివృద్ధి కి సీఎం కేసీఆర్ నేతృత్వంలో పెద్ద పీట వేస్తున్నారన్నారు. క్రీడా పాలసీని రూపోందించటానికి క్యాబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. తెలంగాణ రాష్ట్రంను క్రీడా హబ్ గా అభివృద్ధి చేస్తున్నామన్నారు మంత్రి శ్రీనివాస్ గౌడ్. ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ కేకు కట్ చేసి, బాణాసంచా కాల్చి తన సంతోషాన్ని హాకీ క్రీడాకారులతో కలసి షేర్ చేసుకున్నారు.
ఈ కార్యక్రమంలో స్పోర్ట్స్ చైర్మన్ అల్లిపురం వెంకటేశ్వర రెడ్డి, తెలంగాణ హాకీ అసోసియేషన్ అధ్యక్షుడు సరల్ తల్వార్, చైర్మన్ కొండ విజయ్, ఉపాధ్యక్షుడు రఘునందన్ రెడ్డి, కోశాధికారి భాస్కర్ రెడ్డి, కల్యాణి సింగ్, విద్యాసాగర్, పాండు రంగా రెడ్డి, ప్రవీణ్ రెడ్డి, తెలంగాణ హాకీ జట్టు క్రీడాకారులు, క్రీడాభిమానులు, తదితరులు పాల్గొన్నారు.