విజయవాడను సుందర నగరంగా తీర్చిదిద్దుకుందాం: మంత్రి బొత్స సత్యనారాయణ
- పచ్చదనం పెంపునకు ప్రతిన బూనుదాం: ఎమ్మెల్యే మల్లాది విష్ణు
ప్రభుత్వం ఇచ్చిన ఒక్క పిలుపుతో ప్రజలు ముందుకొచ్చి వేలాది మొక్కలను నాటడం అభినందనీయమన్నారు. మొక్కలను నాటి వదిలేయడమే కాకుండా వాటిని పరిరక్షించే బాధ్యత కూడా తీసుకోవాలని సూచించారు. మొక్కల సంరక్షణకు ట్రీ గార్డులను ఏర్పాటు చేసుకోవాలని, దీని ద్వారా 95 శాతానికి పైగా మొక్కలను కాపాడుకోవచ్చన్నారు. చెట్ల పెంపకంతో కాలుష్యం తగ్గుతుందని, ప్రకృతి వైపరీత్యాలను సైతం నివారించవచ్చని వెల్లడించారు. తద్వారా వాతావరణ సమతుల్యతను కాపాడి, జీవ వైవిధ్యాన్ని పెంపొందించవచ్చన్నారు. కనుక ప్రతి ఒక్కరూ బాధ్యతగా ఒక మొక్కను దత్తత తీసుకోవాలని పిలుపునిచ్చారు. అన్ని రకాల రహదారులు, విద్యాసంస్థలు, పారిశ్రామిక సంస్థలు, ఆస్పత్రులు, ప్రభుత్వ కార్యాలయాల్లో విరివిగా మొక్కలు నాటాలన్నారు. ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు, స్వచ్ఛంద సంస్ధలు సైతం పర్యావరణ పరిరక్షణలో ప్రజలను భాగస్వాములను చేసేలా అవగాహన కల్పించాలని సూచించారు. రానున్న రోజుల్లో విజయవాడ నగరాన్ని ఒక సుందర నగరంగా తీర్చిదిద్దుకుందామన్నారు.
అనంతరం మల్లాది విష్ణు మాట్లాడుతూ.. భవిష్యత్ తరాలు భూమిపై మనుగడ సాధించాలంటే పర్యావరణాన్ని కాపాడుకోవాల్సిన అవసరముందన్నారు. పట్టణాలన్నీ కాంక్రీట్ జంగిల్స్ గా మారుతున్న ప్రస్తుత తరుణంలో మొక్కల పెంపకాన్ని ఒక మహా యజ్ఞంలా చేపట్టవలసిన అవసరం ఉందన్నారు. పర్యావరణ పరిరక్షణ, కాలుష్య రహిత సమాజ నిర్మాణ కోసం ఏటా వర్షా కాలంలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని అటవీశాఖ నిర్వహిస్తుందని వెల్లడించారు. జగనన్న పచ్చతోరణం పేరిట రాష్ట్రంలో కొన్ని లక్షల మొక్కలు నాటుతుండగా నగరంలో ఇప్పటివరకు 15వేల మొక్కలను నాటినట్లు పేర్కొన్నారు.
ఈ వర్షాకాలంలో ప్రతి డివిజన్ లోనూ కనీసం వెయ్యి మొక్కలు నాటే విధంగా కార్యక్రమాలు చేపట్టబోతున్నట్లు తెలిపారు. పెరుగుతున్న కాలుష్యం, కరోనా లాంటి మహమ్మారి నుంచి బయటపడాలంటే మొక్కలను పెంచడమే మార్గమన్నారు. రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి పర్యావరణ పరిరక్షణకై ప్లాస్టిక్ పై యుద్ధం ప్రకటిస్తూ వాటి వాడకాన్ని చాలా వరకు తగ్గించడం జరిగిందన్నారు. కొత్తగా నిర్మాణాలు చేపడుతున్న 17వేల లేఅవుట్ లలోనూ తప్పనిసరిగా మొక్కలు పెంచాలనే నిబంధనను రాష్ట్ర ప్రభుత్వం విధించడం జరిగిందన్నారు. ఈ తరుణంలో ప్రతిఒక్కరూ పచ్చదనం పెంపునకు ప్రతిన బూనాల్సిన ఆవశ్యకత ఉందని మల్లాది విష్ణు అన్నారు. విజయవాడ నగర సర్వతోముఖాభివృద్ధికి కృషి చేస్తామన్న మంత్రి బొత్స సత్యనారాయణ గారికి ఈ సందర్భంగా మల్లాది విష్ణు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.
కార్యక్రమంలో ఎమ్మెల్సీ కరీమున్నీసా, నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, డిప్యూటి మేయర్లు బెల్లందుర్గ, అవుతు శైలజ, నియోజకవర్గ వైఎస్సార్ సీపీ కార్పొరేటర్లు, నగర పాలక సంస్థ కమిషనర్ ప్రసన్న వెంకటేష్, సిఈ ఎం.ప్రభాకరరావు, ఎస్ఈ వై.వి కోటేశ్వరరావు, ఈఈ వి.శ్రీనివాస్, ఉద్యానవన శాఖ అధికారి జె. జ్యోతి, వీఎంసీ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.