గొర్రెల పంపిణీ కార్యక్రమం అద్భుతం.. ప్రశంసించిన జాతీయ సహకార అభివృద్ధి సంస్థ అధికారుల బృందం
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గొల్ల, కురుమల అభివృద్దిని దృష్టిలో ఉంచుకొని అమలు చేస్తున్న గొర్రెల పంపిణీ కార్యక్రమం అద్భుతంగా ఉందని జాతీయ సహకార అభివృద్ధి సంస్థ (NCDC) అధికారుల బృందం ప్రశంసిచింది. సోమవారం డిల్లీ నుండి వచ్చిన సుదీర్ కుమార్ శర్మ, ముఖేష్ కుమార్, బూపిందర్ సింగ్, తెహేదూర్ రహ్మాన్, VK దుబాసి, శ్రీనివాసులు లతో కూడిన NCDC అధికారుల బృందం మాసాబ్ ట్యాంక్ లోని పశుసంవర్ధక శాఖ కార్యాలయంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ను కలిశారు.
ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో కులవృత్తులను ప్రోత్సహించేందుకు అమలు చేస్తున్న గొర్రెల పంపిణీ, ఉచిత చేప పిల్లల పంపిణీ తదితర కార్యక్రమాల గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో పశుసంవర్ధక శాఖ కార్యదర్శి అనిత రాజేంద్ర, షీఫ్ ఫెడరేషన్ MD రాంచందర్ ఇతర అధికారులు పాల్గొన్నారు. ప్రధానంగా తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన గొర్రెల పంపిణీ కార్యక్రమం అమలు, సాధించిన ఫలితాల గురించి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా మంత్రి శ్రీనివాస్ యాదవ్ NCDC అధికారుల బృందంకు వివరించారు.
కులవృత్తుల పై ఆధారపడి జీవనం సాగిస్తున్న వారు ఆర్ధికంగా, సామాజికంగా అభివృద్ధి సాధించాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు నాయకత్వంలో అనేక కార్యక్రమాలను తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తుందని మంత్రి వివరించారు. అందులో భాగంగా రాష్ట్రంలో ఉన్న 7.61 లక్షల మంది గొల్ల కురుమలకు ( 20 గొర్రెలు, 1 పొటేలు చొప్పున) ఒక యూనిట్ ను 1.25 లక్షల రూపాయల ఖర్చుతో గొర్రెల యూనిట్లను 75 శాతం సబ్సిడీ పై పంపిణీ చేసే కార్యక్రమాన్ని 2017 సంవత్సరంలో ప్రారంభించినట్లు తెలిపారు. మొదటి విడతలో 79.16 లక్షల గొర్రెలను 3,76,985 మంది లబ్దిదారులకు పంపిణీ చేయగా, వాటికి ఒక కోటి 30 లక్షల గొర్రె పిల్లలు పుట్టాయని మంత్రి శ్రీనివాస్ యాదవ్ ప్రతినిధుల బృందానికి తెలిపారు.
పుట్టిన గొర్రె పిల్లల విలువ సుమారు 6500 కోట్ల రూపాయలు ఉంటుందని అన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన గొర్రెల పంపిణీ కార్యక్రమంతో అద్భుతమైన ఫలితాలు వచ్చాయని మంత్రి శ్రీనివాస్ యాదవ్ చెప్పారు. 2019 పశుగణన లెక్కల ప్రకారం గొర్రెల పంపిణీ, అభివృద్ధి లో తెలంగాణ రాష్ట్రం 1.92 కోట్ల గొర్రెల సంఖ్యతో దేశంలోనే అగ్రస్థానంలో నిలిచిందని చెప్పారు. గొర్రెల పంపిణీ కార్యక్రమంతో గొర్రెల సంపద అభివృద్ధి చెందటమే కాకుండా 1.22 లక్షల టన్నుల మాంసం ఉత్పత్తి జరిగిందని పేర్కొన్నారు.
రానున్న రోజులలో తెలంగాణ రాష్రంత్ నుండి మాంసం ఎగుమతి చేసే దిశగా అభివృద్దిని సాధిస్తుందని తెలిపారు. పెరిగిన గొర్రెల ధరలను దృష్టిలో ఉంచుకొని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు సహృదయంతో 2 వ విడత లో గొర్రెల పంపిణీ కార్యక్రమం అమలుకు 1.25 లక్షల రూపాయలుగా ఉన్న యూనిట్ ధరను 1.75 లక్షల రూపాయాలకు పెంచడం జరిగిందని తెలిపారు. ఇందులో ప్రభుత్వ సబ్సిడీ 1,31,250 రూపాయలు కాగా, లబ్దిదారుడి వాటా 34,750 రూపాయలు ఉంటుందని ఆయన తెలిపారు. రెండో విడతలో 6,125 కోట్ల వ్యయంతో 3.5 లక్షల మంది అర్హులైన గొల్ల, కురుమలకు గొర్రెల యూనిట్లను పంపిణీ చేయనున్నట్లు మంత్రి శ్రీనివాస్ యాదవ్ చెప్పారు.
ప్రభుత్వం అమలు చేస్తున్న గొర్రెల పంపిణీ కార్యక్రమంతో గొల్ల, కురుమల కుటుంబాలు ఆర్ధికంగా అభివృద్ధి దిశలో పయనిస్తున్నాయని మంత్రి శ్రీనివాస్ యాదవ్ NCDC అధికారుల బృందానికి తెలిపారు. ఇదే కాకుండా రాష్ట్రంలో ఉన్న మత్స్యకారుల అభివృద్ధి, సంక్షేమం కోసం ఉచితంగా చేప పిల్లల పంపిణీ కార్యక్రమాన్ని కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తుందని చెప్పారు. ఇవే కాకుండా రాష్ట్రంలో ఉన్న అన్ని పశువైద్యశాలలను దశల వారిగా అన్ని రకాల సౌకర్యాలు, వసతులు కల్పిస్తూ అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. జీవాల వద్దకే వైద్య సేవలు తీసుకెళ్ళాలనే లక్ష్యంతో 100 సంచార పశువైద్య శాలలను ప్రారంభించడం జరిగిందని, 1962 టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా కాల్ సెంటర్ కు ఫోన్ వచ్చిన అరగంట లో సంచార పశువైద్య శాల వాహనం చేరుకొని వైద్యసేవలు అందిస్తుందని మంత్రి చెప్పారు.
జీవాలకు అవసరమైన అన్ని రకాల మందులు రాష్ట్రంలోని అన్ని పశువైద్య శాలల్లో అందుబాటులో ఉండే విధంగా అన్ని చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. రాష్ట్రంలోని గొర్రెల సంపదను దృష్టిలో ఉంచుకొని, రెండో విడతలో లబ్దిదారులకు అందజేసే గొర్రెల సంఖ్యను బేరీజు వేసుకొని వీటి ద్వారా ఉత్పత్తి అయ్యే మాంసానికి తెలంగాణ బ్రాండ్ ను జోడించి మాంసం ఎగుమతికి ఉన్న అవకాశాలను దృష్టిలో ఉంచుకొని ఒక నూతన విధానాన్ని తయారు చేస్తున్నట్లు ఈ సందర్భంగా మంత్రి అధికారుల బృందానికి వివరించారు.
అంతేకాకుండా గొర్రెల అమ్మకాలు, కొనుగోలు జరపటానికి తగిన సౌకర్యాలు, అవసరమైన ఏర్పాట్లతో పాటు చిన్నస్థాయి ప్రాసెసింగ్ యూనిట్ తో కూడిన గొర్రెల మార్కెట్ లను ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. ఇందుకు అవసరమైన భూసేకరణ కూడా ప్రారంభించినట్లు చెప్పారు. సమావేశంలో పాల్గొన్న అధికారుల బృందం రాష్ట్ర ప్రభుత్వ పనితీరు, పశుసంవర్ధక శాఖ అమలు చేస్తున్న కార్యక్రమాలు దేశానికే ఆదర్శంగా ఉన్నాయని కొనియాడారు.