వరదలపై అప్రమత్తంగా ఉండాలి: మంత్రి సత్యవతి రాథోడ్
- ప్రమాద నివారణ చర్యలు పటిష్టంగా చేపట్టాలి
- వరదల వల్ల విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా చూడాలి
- ఐటీడీఏలలో పరిస్థితులపై మంత్రి సత్యవతి రాథోడ్ వీడియో కాన్ఫరెన్సు
- మంత్రిగా రెండేళ్లు పూర్తిచేసుకున్న సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన కమిషనర్, అదనపు సెక్రటరీ, అదనపు సంచాలకులు
ఏటూరు నాగారం, భద్రాచలం, మన్ననూరు ఐటీడీఏ పరిధిలలో వర్షాలు, వరదల వల్ల ఏర్పడిన పరిస్థితులు, తీసుకుంటున్నచర్యలు, పాఠశాలల ప్రారంభం, విద్యార్థుల హాజరు, సీజనల్ వ్యాధులపై ఏటూరు నాగారం, ఉట్నూరు, భధ్రాచలం, కొత్తగూడెం, మన్ననూరు, మైదాన ప్రాంత ఐటీడీఏ ప్రాజెక్టు అధికారులు, సహాయ అధికారులు గౌతమ్, భవేశ్ మిశ్రా, అశోక్, చందనలతో మంత్రి సత్యవతి రాథోడ్ గిరిజన సంక్షేమ శాఖ కమిషనర్, కార్యదర్శి క్రిస్టినా జడ్ చోంగ్తు, అదనపు సంచాలకులు సర్వేశ్వర్ రెడ్డిలతో కలిసి నేడు హైదరాబాద్, డిఎస్ఎస్ భవన్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
వీడియో కాన్ఫరెన్సులో మంత్రి సత్యవతి రాథోడ్ వ్యాఖ్యలు:
- వరుసగా కురుస్తున్న వర్షాల వల్ల వరదల వల్ల ప్రజలకు నష్టం రాకుండా చూడాలి.
- గర్భిణీ స్త్రీలను వారి ప్రసవ గడువు తేదీల ప్రకారం హాస్పిటల్ లో చేర్పించే చర్యలు చేపట్టాలి.
- ఎవరికైనా అనారోగ్యం కలిగినా, ప్రమాదం జరిగినా రవాణా సదుపాయం లేకుండా మోసుకెళ్లే పరిస్థితి రాకుండా ముందే జాగ్రత్తలు తీసుకోవాలి.
- ఐటీడీఏ పరిధిలోని అధికారులందరితో వీడియో, టెలి కాన్ఫరెన్స్ నిర్వహించి ఎప్పటికప్పుడు పరిస్థితులను సమీక్షించి, తగినచర్యలు చేపట్టాలి.
- అనాథ పిల్లల కోసం ప్రభుత్వం అన్ని చర్యలు చేపడుతోంది. మీ దృష్టికి వచ్చిన వారి వివరాలు ఉన్నతాధికారులకు ఇవ్వాలి. వారికి సరైన సాయం అందేలా సహకరించాలి.
- గురుకులాలు ప్రారంభం కానందున వారిని ప్రస్తుతం దగ్గరున్న ఆశ్రమ పాఠశాలలో చేర్పించండి. దీనివల్ల వారికి స్కూల్ కు వచ్చినట్లు ఉంటుంది. ఆశ్రమ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం మంచిగా అందించండి.
- గతంలో పాఠశాలలు మూసేటప్పటికి ఉన్న విద్యార్థుల సంఖ్య, ఇప్పుడు పున: ప్రారంభం తర్వాత వచ్చే విద్యార్థుల సంఖ్య వివరాలు ఎప్పటికప్పుడు పంపించండి. విద్యార్థుల నమోదు తగ్గితే కారణాలు విశ్లేషించి, అందరినీ పాఠశాలలకు వచ్చే విధంగా చూడాలి.
- వర్షాల వల్ల సీజనల్ వ్యాధులు రాకుండా అన్ని చర్యలు చేపట్టాలి. మెడికల్ క్యాంపులు పెట్టాలి. ఏజన్సీలలో ప్రజలకు తగిన అవగాహన కల్పించాలి.
- వర్షాల వల్ల ప్రమాదాలు జరగకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి.
- ఇటీవల వర్షాలకు కొత్తగూడెం, గంగారాం వద్ద రోడ్లు కొట్టుకుపోయి ఒక వ్యక్తి చనిపోయారు. నేనే రెండు రోడ్ల మరమ్మతుల కోసం 10 లక్షల రూపాయలు ఇచ్చాను. ఇలాంటివి ఎక్కడైనా ఉంటే వెంటనే వాటి వివరాలు ఇవ్వండి. రోడ్లకు సంబంధించి తగిన ప్రతిపాదనలు రూపొందించి పంపించండి. వెంటనే వాటికి మంజూరు ఇచ్చే ప్రయత్నం చేస్తాం.
- అధికారులు స్వయంగా గ్రామాలు సందర్శించండి. స్థానిక పరిస్థితులు ఎప్పటికప్పుడు తెలుసుకుని తగిన చర్యలు చేపట్టాలి. సెలవులు ఉన్నాయి, అధికారులు అందుబాటులో లేరనే వార్తలు రావద్దు.
- ప్రతిరోజూ ఏజన్సీలలోని పరిస్థితులపై నివేదికలు పంపించాలి.
- మండలానికి ఒక అధికారిని ఇంఛార్జీగా నియమించి, బాధ్యతలు ఇవ్వండి.
ప్రస్తుతానికి వరదలు తగ్గాయని, అయినప్పటికీ ముందు జాగ్రత్తగా అన్ని ఐటీడీఏలలో పునరావాస కేంద్రాలు, హెల్ప్ లైన్ సెంటర్లు ఏర్పాటు చేశామని, పాఠశాలల్లో విద్యార్థుల నమోదుపై దృష్టి సారించామని, వసతులు మెరుగు కోసం అన్నిచర్యలు చేపట్టామని, సీజనల్ వ్యాధులపై డాక్టర్లతో చర్చించి అన్ని విధాల సిద్ధంగా ఉన్నామని, గర్భిణీ స్త్రీల ప్రసవ తేదీలను తీసుకుని, వారిని హాస్పిటల్స్ లో చేర్పించే విధంగా సంబంధిత అధికారులను అప్రమత్తం చేశామని ఐటీడిఏ ప్రాజెక్టు అధికారులు వివరించారు.
గిరిజన సంక్షేమ శాఖ మంత్రిగా సత్యవతి రాథోడ్ రెండేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా కమిషనర్ క్రిస్టినా జడ్ చోంగ్తు, గిరిజన గురుకులాల అదనపు కార్యదర్శి నవీన్ నికోలస్, అదనపు సంచాలకులు సర్వేశ్వర్ రెడ్డి మంత్రిని కలిసి పుష్పగుచ్చం ఇచ్చి, శుభాకాంక్షలు తెలిపారు.