తెలంగాణ హోంమంత్రిని కలిసిన ఉజ్బెకిస్తాన్ రాయబారి
హైదరాబాద్ - సెప్టెంబర్ 17: ఉజ్బెకిస్తాన్ రాయబారి దిల్‌షోద్ అఖతోవ్ రాష్ట్ర హోం మంత్రి మహ్మద్ మహమూద్ అలీని తన అధికారిక నివాసంలో మర్యాదపూర్వకంగా శుక్రవారం నాడు కలిశారు. ఈ సందర్భంగా ఉజ్బెకిస్తాన్ నాగరికత మరియు భారతదేశంతో సంబంధాలపై చర్చించారు. తెలంగాణ రాష్ట్రంలో ఉజ్బెకిస్తాన్ దేశ వ్యాపార సంస్థలు వ్యాపారం చేయాలని భావిస్తున్నాయని చెప్పారు.
హోంమంత్రి మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం అన్ని వ్యాపార సంస్థలకు చక్కటి అవకాశాలు కల్పిస్తుందని తెలిపారు. ముఖ్యంగా, రాష్ట్ర ఐ.టి శాఖా మంత్రి కల్వకుంట్ల తారక రామారావు చొరవతో పలు కంపెనీలు తెలంగాణ రాష్ట్రంలో తమ కార్యాలయాలను ఏర్పాటు చేశాయని పేర్కొన్నారు.తెలంగాణ రాష్ట్ర గంగా-జమునా విధానాన్ని మరియు ప్రభుత్వ పథకాలను రాయబారి ప్రశంసించారు. ఈ సమావేశంలో ప్రాజెక్ట్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ మహమ్మద్ మీర్ నాసిర్ అలీ ఖాన్ మరియు మేనేజింగ్ ఆఫీసర్ అనుపమ్ కపూర్ తదితరులు పాల్గొన్నారు.