వైన్ షాప్ ల కేటాయింపులో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు రిజర్వేషన్లు చరిత్రాత్మకం: మంత్రి శ్రీనివాస్ గౌడ్
హైదరాబాద్: భారత దేశంలో ఎక్కడా లేని విధంగా ఎస్సీ, ఎస్టీ, బీసీలు ఆర్థికంగా బలపడేందుకు వైన్ షాప్ ల కేటాయింపులో రిజర్వేషన్లు కల్పించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి కే. చంద్ర శేఖర రావు క్యాబినెట్ సమావేశంలో తీసుకున్న చరిత్రాత్మక నిర్ణయంపై రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ, బీసీ ఉద్యోగ సంఘాల, తెలంగాణ గెజిటెడ్ ఉద్యోగుల కేంద్ర సంఘం (టీజీవో) ఆధ్వర్యంలో రాష్ట్ర అబ్కారీ, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ని కలసి కృతజ్ఞతలు తెలియజేశారు.
రాష్ట్రంలో వైన్ షాపుల కేటాయింపులో ఎస్సీ, ఎస్టీలతో పాటు, గౌడలకు రిజర్వేషన్ కల్పించినందుకుగాను హైదరాబాద్ లోని రవీంద్రభారతిలోని తన కార్యాలయంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ ఉద్యోగ సంఘాల, టీజీవో కేంద్ర సంఘం అధ్యక్షురాలు మమత ఆధ్వర్యంలో మంత్రి శ్రీనివాస్ గౌడ్ ని కలసి ఘనంగా సన్మానించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం సీఎం కేసీఆర్ గారు దేశంలో ఎక్కడా లేని విధంగా వైన్ షాపుల కేటాయింపులో ఎస్సీల కు 10 శాతం, ఎస్టీలకు 5 శాతం, గౌడ కులస్తులకు 15 శాతం రిజర్వేషన్లను కేటాయించి చరిత్రాత్మక నిర్ణయం తీసుకుందన్నారు మంత్రి శ్రీనివాస్ గౌడ్.
వీటితో పాటు ఎస్సీ, ఎస్టీ, బీసీ ,మైనారిటీలు ఆర్థికంగా బలపడాలన్న ఉద్దేశంతోనే రాష్ట్రంలో 1000 గురుకులాలను ఏర్పాటు చేయటం జరిగిందన్నారు. అన్ని కులాల అభివృద్ధి కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి కృషి చేస్తున్నారని తెలిపారు. గొల్ల, కురుమలకు గొర్లు ఇవ్వడం ద్వారా వారి అభివృద్ధికి పాటుపడుతున్నారని, అదే విధంగా ముదిరాజులకు చేపపిల్లలు, ట్రాలీలు, బండ్లు ఇచ్చి వారి అభ్యున్నతికి కృషి చేస్తున్నారన్నారు. రాష్ట్రంలో కుల వృత్తుల అన్నింటికీ పూర్వ వైభవం వస్తుందని, చిన్న చిన్న కులాల అభివృద్ధికి గతంలో పూలే కృషి చేశారని, పూలే తర్వాత అభినవ పూలేగా రాష్ట్ర ముఖ్యమంత్రి కే.చంద్ర శేఖర్ రావు పాటుపడుతున్నారని అన్నారు. అన్ని రంగాలలో రిజర్వేషన్లు కల్పించడం ద్వారా వారిని పైకి తీసుకురావాలన్న ఉద్దేశ్యంతో ముఖ్యమంత్రి కృషి చేయడం గొప్ప విశేషమని అన్నారు. ఇది దేశంలో పెద్ద మార్పును తీసుకువస్తుందని, అన్ని రాష్ట్రాల నుండి కూడా మంచి డిమాండ్ వస్తుందని, తద్వారా అందరూ బాగుపడతారని మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఉద్యోగ సంఘాల ప్రతినిధులకు వెల్లడించారు.
ఈ కార్యక్రమంలో టీజీవో కేంద్ర సంఘం ప్రధాన కార్యదర్శి ఎ.సత్యనారాయణ, టీజీవో కేంద్ర సంఘం నాయకులు సహదేవ్, వెంకటయ్య, ఎంబీ కృష్ణ యాదవ్, గండూరి వెంకటేశ్వర్లు, హరికృష్ణ, సుభాష్ తదితరులు పాల్గొన్నారు.