మాస్టర్ గంధం భువన్ ను అభినందించిన గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్

Related image

విజయవాడ: యూరప్ ఖండంలోనే ఎతైన శిఖరంగా పేరుగాంచిన రష్యాలోని మౌంట్ ఎల్బ్రస్ పర్వతాన్ని అధిరోహించిన మాస్టర్ గంధం భువన్ ను ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ అభినందించారు. కేవలం ఎనిమిది సంవత్సరాల మూడు నెలల వయస్సులో 5642 మీటర్ల ఎత్తెన మౌంట్ ఎల్బ్రస్ శిఖరాన్ని చేరుకున్న అతి పిన్న వయస్కుడైన బాలునిగా  భువన్ ప్రపంచ రికార్డు సృష్టించిన క్రమంలో మరిన్ని విజయాలు సాధించాలని గవర్నర్ ఆశీర్వదించారు.

గురువారం రాజ్ భవన్ లో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో భువన్ ను అక్కున చేర్చుకున్న గవర్నర్ అంతర్జాతీయ స్ధాయిలో పేరు ప్రఖ్యాతులు సాధించి భారతదేశ కీర్తి పతాకను నలుదిశలా ఎగురువేయాలని కొనియాడారు. సీనియర్ ఐఎఎస్ అధికారి, మైనారిటీ సంక్షేమ శాఖ ప్రత్యేక కార్యదర్శి గంధం చంద్రుడు కుమారుడైన భువన్ ప్రస్తుతం మూడవ తరగతి చదువుతుండగా, శిక్షకులు అందించిన మెళుకువలు, తల్లిదండ్రుల ప్రోత్సాహం వల్లే తాను ఈ రికార్డును సాధించగలిగనని గవర్నర్ కు వివరించాడు.

కర్నూలు జిల్లా స్వస్ధలంగా కలిగిన మాస్టర్ భువన్ చిన్ననాటి నుండి క్రీడలలో ఉత్సాహం ప్రదర్శించగా, తనయుని ప్రతిభను గుర్తించి తగిన ప్రోత్సాహం అందించటం శుభ పరిణామమని గవర్నర్ గంధం చంద్రుడిని అభినందించారు. ఈ సందర్భంగా బిశ్వభూషణ్ హరిచందన్ మెమొంటోతో భువన్ ను ప్రత్యేకంగా సత్కరించారు. కార్యక్రమంలో గవర్నర్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఆర్ పి సిసోడియా తదితరులు పాల్గొన్నారు.

More Press Releases