మహిళల అభ్యున్నతికి పెద్దపీట: విజయవాడ మేయర్ రాయన భాగ్యలక్ష్మి
విజయవాడ: మహిళా పక్షపాతిగా సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి దేశానికే ఆదర్శంగా నిలిచారని మేయర్ రాయన భాగ్యలక్ష్మి పేర్కొన్నారు. అన్ని రంగాల్లోనూ మహిళలకు పెద్దపీట వేశారన్నారు. అమ్మఒడి పథకం నుంచి ఇళ్ల స్థలాల రిజిస్ట్రేషన్ ప్రక్రియ వరకు ప్రతి సంక్షేమ పథకం కూడా మహిళలకు అధిక ప్రాదాన్యత కల్పించుట హర్శనియమని, దసరా పండుగ ముందే వచ్చినట్లు ఈ సంబరాలు నిర్వహించుట పట్ల మహిళలు అందరి తరపున ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలియజేశారు. గర్భిణీలు, బాలింతలకు పౌష్టికాహారం అందజేస్తూ.. ఇటీవల పోషకాహార మాసోత్సవాలను కూడా ఘనంగా నిర్వహించుకోవడం జరిగిందన్నారు.
సెంట్రల్ నియోజకవర్గ పరిధిలోని అరండల్ పేట A.P.J అబ్దుల్ కలాం మున్సిపల్ ఉర్దూ స్కూల్ 23, 24 మరియు 25 డివిజన్లకు సంబందించి వై.ఎస్.ఆర్ ఆసరా కార్యక్రమములో సెంట్రల్ నియోజకవర్గ శాసన సభ్యుడు మల్లాది విష్ణువర్ధన్ పాల్గొని స్థానిక కార్పొరేటర్లతో కలసి 293 గ్రూపులకు వారి రూ.2,46,25,888/-రూపాయలు చెక్కును అందించారు. అదే విధంగా తూర్పు నియోజకవర్గ పరిధిలోని 4,10 మరియు 11వ డివిజన్లకు సంబందించి ఓంకార్ కళ్యాణ మండపం నందు జరిగిన కార్యక్రమములో తూర్పు నియోజకవర్గ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్, డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గ స్థానిక కార్పొరేటర్ల తో కలసి 252 గ్రూపులకు వారి రూ. 2,57,03,063/-రూపాయలు చెక్కును అందించారు.
ఈ కార్యక్రమములో పలువురు కార్పొరేటర్లు, వైసీపీ శ్రేణులు బొప్పన భవకుమార్, నగరపాలక సంస్థ యు.సి.డి అధికారులు సిబ్బందితో పాటుగా స్వయం సహాయక సంఘాల మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
పశ్చిమ నియోజక వర్గ పరిధిలో “వై.ఎస్.ఆర్ ఆసరా“ 2వ విడత కార్యక్రమం:
“వై.ఎస్.ఆర్ ఆసరా“ 2వ విడత సంబరాలు కార్యక్రమములో భాగంగా శనివారం పశ్చిమ నియోజక వర్గ పరిధిలోని 34, 35 డివిజన్ లకు సంబందించి కేదారేశ్వరి పేట వి.యం.సి కళ్యాణ మండపం నందు మరియు 39, 41 మరియు 42 డివిజన్లకు సంబందించి విద్యాధర పురం షాదిఖానా నందు ఏర్పాటు చేసిన కార్యక్రమమాలలో దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు, నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, ఎ.పి.ఐ.ఐ.సి కార్పొరేషన్ చైర్మన్ పుణ్యశీల మరియు ఆయా డివిజన్ల కార్పొరేటర్లు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మహిళల ఆర్థికాభివృద్ధికి ప్రణాళికాబద్దంగా కృషి చేస్తూ వారిలో ఆర్ధిక పరిపుష్టిని పెంపొందించి మనోదర్యాన్ని నింపే దిశగా వైఎస్సార్సీపీ ప్రభుత్వం కృషి చేస్తోందని అన్నారు. డ్వాక్రా రుణాల మంజూరు, సున్నావడ్డీ, చేతి వృత్తులకు సంబంధించి రుణాలను మంజూరు చేస్తున్నామన్నారు. ప్రతి అక్కచెల్లెమ్మ వారి కాళ్లపై వారు నిలబడేలా ఐటీసీ, రిలయన్స్, అమూల్ లాంటి పలు కంపెనీలను భాగస్వాములను చేస్తూ వ్యాపార మార్గాలను చూపించడం జరుగుతోందన్నారు. వీటిని సద్వినియోగం చేసుకుంటూ జీవనోపాధులు పెంపొందించుకోవాలని డ్వాక్రా మహిళలకు సూచించారు.