యావత్ ప్రపంచానికే దళిత బంధు ఓ రోల్ మోడల్: మంత్రి జగదీష్ రెడ్డి
- ముఖ్యమంత్రి కేసీఆర్ సాహసోపేత నిర్ణయానికి నిదర్శనం
- ఇది ప్రగతిశీల ప్రభుత్వం
- అన్ని వర్గాలను ఒప్పించే సత్తా ముఖ్యమంత్రి కేసీఆర్ కుంది
- భారతదేశానికి అంబెడ్కర్ రాజ్యాంగమే శ్రీరామరక్ష
- ఆర్థిక వెనుకబాటు తనమే కాదు సామాజిక అంతరాలు రూపు మాపేందుకే దళితబంధు
- రంజాన్, క్రిష్మస్, బతుకమ్మ పండుగలు అధికారికంగా నిర్వహించింది ఈ ప్రభుత్వంలోనే
- ఆయా పండుగలకు నూతన వస్త్రాలు అందించిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ ది
- ముఖ్యమంత్రి కేసీఆర్ దత్తత గ్రామం వాసాలమఱ్ఱి లో దళిత బంధు పథకం ప్రారంభం
దళితబంధు పథకం అమలులో బాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్ దత్తత తీసుకున్న భోనగిరియదాద్రి జిల్లా తుర్కపల్లి మండలం వాసాలమఱ్ఱి గ్రామంలో దళితబంధు లబ్ధిదారులకు ఆయన యూనిట్లు పంపిణీ చేశారు. స్థానిక ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ గొంగిడి సునీతా మహేందర్ రెడ్డి, శాసన మండలి సభ్యులు ఎలిమినేటి కృష్ణారెడ్డి, జిల్లా ప్రజారిషత్ చైర్మన్ ఎలిమినేటి సందీప్ రెడ్డి, జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ముఖ్యమంత్రి కేసీఆర్ దత్తత గ్రామం వాసాలమఱ్ఱి గ్రామంలో ఎంపిక చేసిన తొలి పదిమంది లబ్ధిదారులకు మంత్రి జగదీష్ రెడ్డి యూనిట్లను పంపిణీ చేశారు. అనంతరం మంత్రి జగదీష్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఒక నాడు తెలంగాణ ఒక స్వప్నం అని, కలలు కనే వాళ్ళు చాలా మంది ఉంటారని కానీ అవి నిజం చేసే వాళ్ళు కొందరే ఉంటారని ఆ కొందరు మహానుభావులలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఒకరని తెలంగాణ స్వప్నం నిజం చేసిన స్వాపనికుడు ఆ మహానేత అని ఆయన కొనియాడారు.
అదే స్వప్నం దళిత బంధు అని ఆ స్వప్నం రేపటి నిజం అవుతుందని ఆయన చెప్పారు. దళితబంధు కేవలం కుటుంబానికో పది లక్షలు ఇచ్చే పథకం ఎంత మాత్రం కాదని ఈ ప్రపంచానికి గొప్ప మార్గదర్శనంగా నిలబడే పథకంగా రూపొదిద్దుకుంటుందని ఆయన అన్నారు. తెలంగాణ సాధన కొరకు ఉద్యమ నాయకుడిగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నికలను కేంద్రంగా మార్చి 36 పార్టీలను ఒప్పించి తెలంగాణ సాదించారో అదే పద్దతిలో దళితబంధు పథకాన్ని ప్రపంచానికే ఓ రోల్ మోడల్ పథకంగా రూపొందించారని ఆయన చెప్పారు.
ఇది ప్రగతిశీల ప్రభుత్వం అని అన్నివర్గాలను ఒప్పించే సత్తా ముఖ్యమంత్రి కేసీఆర్ కుందని ఆయన పేర్కొన్నారు. భిన్న వైరుధ్యాలతో ఉండే సమాజంలో అన్ని వర్గాలను కలుపుకుని పోతూ ఆచరణలో దళితబంధు పథకాన్ని విజయవంతం చెయ్యాలి అన్నదే ముఖ్యమంత్రి కేసీఆర్ సంకల్పం అన్నారు. బాబా సాహెబ్ అంబెడ్కర్ రచించిన రాజ్యాంగమే ముఖ్యమంత్రి కేసీఆర్ కు స్ఫూర్తిదాయకమన్నారు. భారతదేశంతో పాటు మరెన్నో దేశాలకు స్వతంత్రం సిద్దించినా అనతి కాలంలోనే ఎన్నో దేశాలు చిన్నా బిన్నం అయ్యాయన్నారు. భారతదేశం ఇప్పటికి నిలదొక్కుకున్నది అంటే అందుకు అంబెడ్కర్ రాసిన రాజ్యాంగమే కారణమన్నారు.
అందుకే మహాత్మాగాంధీ, అంబేద్కర్ ల కలల సాకారానికై ముఖ్యమంత్రి కేసీఆర్ తనకొచ్చిన అవకాశాలను వినియోగించుకుంటూ అన్నార్తులు, అనాధాలు లేని అద్భుతమైన సమాజం నిర్మాణానికి పునాదులు వేస్తున్నారన్నారు. అందులో భాగమే దళితబంధు పథకమని తద్వారా ఆర్థిక వెనుకబాటుతనంతో పాటు సామాజిక అంతరాలు రూపొందించేందుకు బ్రహ్మ ష్ట్రంలా ఉపయోగ పడుతుందని మంత్రి జగదీష్ రెడ్డి తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తొలి నాళ్ళలో వచ్చిన రంజాన్ పండుగకు అధికారికంగా ఇఫ్తార్ ఇవ్వాలని నిర్ణయిస్తే అందరూ వణికిపోయారన్నారు.
ఇఫ్తార్ మాత్రమే కాకుండ ముఖ్యమంత్రి కేసీఆర్ మరో అడుగు ముందుకేసి రంజాన్ కు నూతన వస్త్రాల ప్రధానం అన్న రోజున చాలా మంది ఓట్లతో లెక్కలేసి ఆలోచనలు చేశారన్నారు. అయితే మనం చేసేది ధర్మబద్ధమైనది, న్యాయబద్ధమైనదని బావించినందునే అందరిని ఒప్పించి ఒక్క రంజాన్ కే పరిమితము చేయకుండా క్రిస్మస్, బతుకమ్మ లకు నూతన వస్త్రాలను అధికారికంగా అందజేసే సరికొత్త ఒరవడికి ముఖ్యమంత్రి కేసీఆర్ శ్రీకారం చుట్టారన్నారు.
అదే పద్దతిలో మొదలు పెట్టిన దళితబంధు కూడా విజయవంతం అవుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. తెలంగాణ ఉద్యమంలో ఉద్యమ నాయకుడిగా ముఖ్యమంత్రి కేసీఆర్ వెంట నడవాల్సిన సందర్భంలోనూ అనేక అనుమానాలు వ్యక్తం చేశారన్నారు. నడిచేటప్పుడు సందేహాలు వ్యక్తం చేశారన్నారు. తెలంగాణ వస్తదో రాదో అన్న అనుమానపడ్డ వారి సంఖ్య కోకొల్లలు ,రాకుండ అడ్డుపడ్డ వారు, కుట్రలు, కుతంత్రాలు, ద్రోహాలు మోసాలు ఉండనే ఉన్నాయన్నారు.
అన్నింటినీ పటాపంచలు చేయడమే కాకుండ వచ్చిన తెలంగాణలో తిరుగులేని ప్రజాభినంతో అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్ గొప్ప పాలనా దక్షుడిగా యావత్ భారతదేశంలో కీర్తింపబడుతున్న శుభసందర్బంలో మొదలు పెట్టిన పథకమే దళిత బంధు అని ఇది నిర్విరామ ప్రక్రియ అని ఆయన తెలిపారు.