మహిళలు తలుచుకుంటే జరగనిది ఉండదు: మంత్రి జగదీష్ రెడ్డి
- వర్తమానానికి స్ఫూర్తిదాయకం
- సేవలు మరింత విస్తరించాలి
- అంత్యోదయ మహిళా పరస్పర సహకార పొదుపు సంఘం 22 వార్షికోత్సవం
సోమవారం సూర్యపేట జిల్లా కేంద్రంలో ఆర్థిక సమతా మండలి ఆధ్వర్యంలో 22 సంవత్సరాల క్రితం ఆవిర్భావించిన అంత్యోదయ మహిళా పరస్పర సహకార పొదుపు సంఘం 22వ సర్వసభ్య సమావేశానికి మంత్రి జగదీష్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్, మున్సిపల్ చైర్మన్ అన్నపూర్ణమ్మ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతూ.. నారీ లోకం నడుం బిగిస్తే జరగని పని అంటూ ఉండదన్నారు. అందుకు కరీంనగర్ జిల్లా ముల్కనూర్ పాల సొసైటీ ముందు వరుసలో ఉండగా అదే వరసలో సూర్యపేటకు చెందిన అంత్యోదయ సొసైటీ నిలిచిందని ఆయన కొనియాడారు. అందుకు మహిళలు సంఘటితమై ఏర్పరచుకున్న సొసైటీలో క్రమశిక్షణ, నిబద్ధతలను పాటించడమే కారణం అని ఆయన చెప్పారు.
ఎన్నో ప్రభుత్వ సంస్థలను నష్టాల పలుజేసి రాత్రికి రాత్రే మూసివేస్తున్న తరుణంలో మహిళలు ఏర్పరచుకున్న అంత్యోదయ మహిళా పరస్పర సహకార పొదుపు సంఘం ఏకంగా 22వ సంవత్సరంలోకి అడుగిడడం అభినందనీయమన్నారు. అటువంటి సంస్థ పురోగతిలో ప్రభుత్వంగా భాగస్వామ్యం చేస్తే తప్పకుండా తోడ్పాటునందిస్తానని మంత్రి జగదీష్ రెడ్డి సంఘానికి హామీ ఇచ్చారు.
ఇంకా ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్, మున్సిపల్ వైస్ చైర్మన్ కిశోర్ తదితరులు పాల్గొన్నారు.