గుంటూరులో ఆప్కో నూతన షోరూం ప్రారంభించిన హోంమంత్రి సుచరిత
విజయవాడ: చేనేత కార్మికుల ఉన్నతికి ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను సద్వినియోగం చేసుకుని ఆర్ధిక స్వావలంబన సాధించాలని రాష్ట్ర హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత సూచించారు. గుంటూరు లక్ష్మిపురం ప్రాంతంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఆప్కో షోరూంను మంగళవారం మంత్రి ప్రారంభించారు. వినియోగదారులకు అవసరమైన వస్త్ర శ్రేణిని అందుబాటులోకి తీసుకువచ్చేలా నేతన్నలు కొత్త వెరైటీలను సిధ్దం చేయాలని ఈ సందర్భంగా సుచరిత అన్నారు.
ఆప్కో ఛైర్మన్ చిల్లపల్లి మోహనరావు మాట్లాడుతూ.. ప్రస్తుత కాలానికి అనుగుణంగా సరిక్రొత్త వెరైటీలతో ఆప్కో షోరూంలను ప్రజలకు అందుబాటులోకి తీసువస్తున్నామన్నారు. చేనేత వస్త్రాల వినియోగం ద్వారా చేనేత కార్మికుల మనుగడకు సహాయ పడుతున్నామన్న విషయాన్ని ప్రజలు గుర్తించాలన్నారు. వారంలో ఒక్క రోజైనా ప్రతి ఒక్కరూ చేనేత వస్త్రాలను ధరించాలని కోరారు.
జ్యోతి ప్రజ్వలన చేసిన చేనేత, జౌళి శాఖ సంచాలకులు చదలవాడ నాగరాణి మాట్లాడుతూ.. తమ సంస్ధ మార్కెట్ ను పెంచుకునే క్రమంలో మరిన్ని నూతన షోరూంలను ప్రారంభించనున్నామన్నారు. ఈ కార్యక్రమంలో గుంటూరు శాసనమండలి సభ్యుడు లేళ్ల అప్పిరెడ్డి, తాడికొండ శాసనసభ సభ్యురాలు ఉండవల్లి శ్రీదేవి, గుంటూరు పశ్చిమ శాసనసభ సభ్యుడు మద్దాలి గిరిధరరావు, గుంటూరు తూర్పు శాసనసభ సభ్యుడు ముస్తఫా షేక్, జిల్లా పరిషత్ చైర్మన్ కత్తెర క్రిస్టినా, గుంటూరు మేయర్ కావటి శివనాగ మనోహర్ నాయుడు, ఆప్కో మండల వాణిజ్య అధికారి ప్రసాద్ రెడ్డి, పట్టణ ప్రముఖులు, అధికారులు పాల్గొన్నారు.