నగర అభివృద్ధి, పర్యావరణ పరిరక్షణ ప్రభుత్వ లక్ష్యం: మంత్రి వెల్లంపల్లి
విజయవాడ: తూర్పు నియోజకవర్గం పరిధిలోని 4వ డివిజన్ నందు రూ.148 లక్షల అంచనాలతో ఆధునీకరించిన గురునానక్ నగర్ స్విమ్మింగ్ పూల్ ను రాష్ట్ర దేవాదాయ మరియు ధర్మాదాయ శాఖామంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు ప్రారంభించారు. కార్యక్రమములో నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, కమిషనర్ ప్రసన్న వెంకటేష్, డిప్యూటీ మేయర్లు బెల్లం దుర్గ, అవుతు శ్రిశైలజ మరియు తూర్పు నియోజకవర్గ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్ తదితరులు పాల్గొన్నారు.
గురునానక్ నగర్ స్విమ్మింగ్ పూల్ ను ప్రారంభించిన సందర్భంలో మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ రూ. 148 లక్షల ప్రభుత్వ మరియు నగరపాలక సంస్థ నిధులతో ఈ ప్రాంత ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా స్విమ్మింగ్ పూల్, వాకింగ్ ట్రాక్, పార్క్ లను అభివృద్ధి పరచుటకు ఈ ప్రభుత్వం శంకుస్థాపన చేయుట, సంవత్సర కాలంలోనే పూర్తి స్థాయిలో ప్రజలకు అందుబాటులో తీసుకురావటం జరిగిందని అన్నారు. ప్రధానంగా నగరంలో రోడ్లు, డ్రెయిన్లు మొదలగు అనేక అభివృద్ధి పనులను చేపట్టుటతో పాటుగా నగర పర్యావరణాన్ని కాపాడేలా అనేక ప్రాంతాలలో పార్క్ లను ఆధునీకరించి ప్రజలకు ఆహ్లాదాన్ని అందించుట జరుగుతుందని పేర్కొన్నారు.
ప్రజలకు ఆరోగ్యం ఉండాలనే ఉద్దేశ్యంతో పలు ప్రదేశాలలో వాకింగ్ ట్రాక్ ల ఏర్పాటు, పర్యావరణాన్ని పరిరక్షించుకోనే విధంగా పార్క్ లను కూడా సుందరంగా తీర్చిదిద్దుట జరుగుతుందని అన్నారు. గత ప్రభుత్వంతో పోల్చుకొంటే వై.ఎస్.ఆర్ ప్రభుత్వం రెండున్నర సంవత్సరాలలో అనేక అభివృద్ధి పనులు చేపట్టి ప్రజలకు అందుబాటులోనికి తీసుకువస్తున్న విషయం ప్రజలు అందరు గమనిస్తున్నారని పేర్కొన్నారు. పార్టీలకు అతీతంగా దేవినేని అవినాష్ నాయకత్వంలో తూర్పు నియోజకవర్గంలోని అన్ని డివిజన్లు అభివృద్ధి చెందేలా చర్యలు చేపట్టి వాటిని ఆచరణలోకి తీసుకువస్తున్నారని కొనియాడారు.
అదే విధంగా నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి మాట్లాడుతూ తూర్పు నియోజకవర్గ అభివృద్ధియే లక్ష్యంగా దేవినేని అవినాష్ కృషి చేస్తునారని అన్నారు. నగరాభివృద్ధియే లక్ష్యంగా నగరపాలక సంస్థ అనేక అభివృద్ధి పనులు చేపట్టి వాటిని సకాలంలో పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావటం జరుగుతుందని అన్నారు. నగర కమిషనర్ ప్రసన్న వెంకటేష్ మాట్లాడుతూ గురునానక్ నగర్ నందు సుమారు 1.5 కోట్ల అంచనాలతో స్విమ్మింగ్ పూల్ ను ఆధునీకరించుటతో పాటుగా చిన్న పార్క్, పాత్ వే మరియు జిమ్ ఏర్పాటు చేయుట జరిగిందని అన్నారు. ప్రజలకు సౌకర్యవంతముగా ఉండేలా ఈ స్విమ్మింగ్ పూల్ ను అన్ని రకాల సౌకర్యాలతో పూర్తి స్థాయిలో అభివృద్ధి పరిచినట్లు, స్థానిక ప్రజలు వీటిని సక్రమముగా సద్వినియోగ పరచుకోవాలని ఆకాంక్షించారు.
తూర్పు నియోజకవర్గ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్ మాట్లాడుతూ గౌరవ మంత్రివర్యులు, నగరపాలక సంస్థ పాలక పక్షం మరియు అధికారుల సహకారంతో నియోజక వరాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి పరచేలా తన వంతు కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు. పనులు చేపట్టి కేవలం సంవత్సర కాలంలోనే పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావటం సంతోషకరమని, ముఖ్యమంత్రి నాయకత్వంలో అందరి సహకారంతో సుమారు 350 కోట్ల అభివృద్ధి పనులు ఈ రెండున్నర సంవత్సరాలలో ప్రజలకు అందుబాటులోకి తీసుకురావటం జరిగిందని అన్నారు. అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యంగా నియోజకవర్గాన్ని తిర్చిదిద్దగలనని తెలియజేసారు.
కార్యక్రమములో పలువురు కార్పొరేటర్లు, వై.సి.పి నాయకులు రుహుల్లా మరియు నగరపాలక సంస్థ చీఫ్ ఇంజనీర్ యం.ప్రభాకరరావు, స్పోర్ట్స్ ఆఫీసర్ ఉదయ కుమార్, ఎ.డి.హెచ్ శ్రీనివాసు,హెల్త్ ఆఫీసర్ శ్రీదేవి, శానిటరీ ఇన్స్ పెక్టర్ రాయలు మరియు ఇతర అధికారులు స్థానిక కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.
సచివాలయాల సిబ్బంది పనితీరు పరిశీలన: నగర పాలక సంస్థ కమిషనర్
భవానీపురం ప్రాంతములోని వి.యం.సి కళ్యాణమండపం, ప్రియదర్శిని కాలనీ, పోలీస్ కాలనీ, నేతాజీ స్కూల్ ఆవరణలో గల 126, 127, 131 మరియు 132 సచివాలయాలను కమిషనర్ ప్రసన్న వెంకటేష్ ఆకస్మికoగా పరిశీలించి సిబ్బంది యొక్క పని విధానము పరిశీలించారు. సచివాలయ సిబ్బంది హాజరు, మూవ్మెంట్ రిజిస్టర్ను పరిశీలిస్తూ, విధి నిర్వహణలో ప్రతి ఒక్కరు సమయపాలన పాటించి భాద్యతగా తమకు కేటాయించిన విధులను సక్రమముగా నిర్వర్తించాలని అన్నారు.
సచివాలయంలోని రికార్డులను పరిశీలించి ప్రజల సమస్యలపై వచ్చే దరఖాస్తులపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. సచివాలయ ఉద్యోగుల హాజరు శాతాన్ని పరిశీలించి, ప్రభుత్వం అమలు చేస్తున్న అన్ని సంక్షేమ పథకముల వివరాలు మరియు లబ్దిదారుల జాబితా మొదలగు వివరాలు అన్నియు ప్రజలకు అందుబాటులో ఉండేలా విధిగా డిస్ ప్లే బోర్డు నందు ఉంచాలని ఆదేశించారు.స్థానిక కార్పొరేటర్ పడిగపాటి చైతన్య రెడ్డి పాల్గొన్నారు.