రెండు క్యాన్సర్లు వచ్చిన వ్యక్తికి రోబోటిక్ సర్జరీతో ఊరట
- తొలుత లుకేమియా.. ఆపై పాంక్రియాటిక్ క్యాన్సర్
- రోబోటిక్ సర్జరీ చేసి నయం చేసిన కిమ్స్ వైద్యులు
"హైదరాబాద్లోని ఫార్మారంగంలో పనిచేసే 36 ఏళ్ల వ్యక్తికి ఎక్యూట్ ప్రోమైలోసిటిక్ లుకేమియా (ఏపీఎంఎల్).. అంటే ఒక రకమైన రక్తక్యాన్సర్ వచ్చి, దానికి కీమోథెరపీ తీసుకుంటున్నారు. అంతలో అతడికి కామెర్ల వ్యాధి వచ్చింది. ఆ విషయం తెలుసుకోవడం 2-3 నెలలు ఆలస్యమైంది. సమస్య తీవ్రంగా ఉండటంతో అతడికి బయాప్సీ చేయించగా పాంక్రియాటిక్ క్యాన్సర్ అని తెలిసింది. దాంతో ఈ రెండో క్యాన్సర్ చికిత్స కోసం అతడు కిమ్స్ ఆసుపత్రికి వచ్చాడు. సమస్య తీవ్రత దృష్ట్యా అతడికి రోబోటిక్ సర్జరీ చేయాలని నిర్ణయించాం. తక్కువ సమయంలోనే సర్జరీకి తీసుకెళ్లాం. అత్యంత వేగంగా, కేవలం మూడున్నర గంటల కన్సోల్ టైంలోనే సర్జరీ పూర్తయింది. తర్వాత ఒక్క రోజు మాత్రమే ఐసీయూలో ఉంచి, మర్నాడే రూంలోకి పంపేశాం. ఐదో రోజున రోగిని డిశ్చార్జి చేశాం కూడా.
భారతదేశంలో అత్యంత వేగవంతంగా జరిగిన రోబోటిక్ సర్జరీల్లో ఇదొకటని చెప్పుకోవచ్చు. రోగి చాలా త్వరగా, చాలా బాగా కోలుకున్నాడు. పాంక్రియాటిక్ క్యాన్సర్లలో రోబోటిక్ సర్జరీ చేయించడం వల్ల ఐసీయూలో ఉండాల్సిన అవసరం దాదాపుగా రాదు. రాబోయే రోజుల్లో నేరుగా థియేటర్ నుంచి రూంకి మారుస్తారు. అదే ఓపెన్ సర్జరీ చేస్తే కనీసం రెండు రోజులు ఐసీయూలో ఉంచాలి. ఈ కేసులో ఓపెన్ సర్జరీ కంటే బయాప్సీ రిపోర్టు చాలా మెరుగ్గా వచ్చింది. సాధారణంగా 12 లింఫ్నోడ్లను తీస్తే సరిపోతుంది. అలాంటిది ఈ వ్యక్తి నుంచి 37 లింఫ్ నోడ్లను తీశాం. దీనివల్ల అతడి పాంక్రియాస్ (క్లోమం)లో క్యాన్సర్ ఉనికి దాదాపుగా ఉండదు. పాంక్రియాటిక్ క్యాన్సర్లు వచ్చినప్పుడు సాధారణంగా ఓపెన్ సర్జరీ అయితే అది అతుక్కోవడం కూడా చాలా కష్టం అవుతుంది. కుట్లు వేయడం సాధ్యం కాదు. అందువల్ల రోగి కోలుకునే అవకాశాలు తక్కువని చెబుతారు. అదే రోబోటిక్ సర్జరీ అయితే ఈ సమస్యలేవీ ఉత్పన్నం కావు.
ఈ రోబోటిక్ సర్జరీలో కిమ్స్ ఆస్పత్రికి చెందిన సర్జికల్ ఆంకాలజిస్టులు డాక్టర్ వెంకటేశ్, డాక్టర్ మాధవితో పాటు సిస్టర్ స్వప్న పాల్గొన్నారు. సర్జరీకి సాయం చేయడంలో ఆమె చాలా కీలకపాత్ర పోషించారు" అని కిమ్స్ ఆసుపత్రి సీనియర్ కన్సల్టెంట్ సర్జికల్ ఆంకాలజిస్టు, రోబోటిక్ సర్జన్ డాక్టర్ మధు దేవరశెట్టి తెలిపారు.