సీఎం కేసీఆర్ నాయకత్వంలో విలసిల్లుతున్న గిరిజన గురుకులాలు: మంత్రి సత్యవతి రాథోడ్
- దేశంలోని ప్రతిష్టాత్మక సంస్థలలో సీట్లు సాధిస్తున్న ఆదిమ గిరిజన తెగల విద్యార్థులు
- 21 సెంటర్ ఎక్సలెన్స్ కేంద్రాల అవిరామ కృషితో ఆరేళ్లలో అత్యుత్తమ సంస్థలలో 1286 మంది విద్యార్థులకు అడ్మిషన్లు
- ఈ ఏడాది 223 మందికి ఇంజనీరింగ్, మెడికల్ కోర్సులలో సీట్లు రావడం అభినందనీయం
- విద్యార్థుల భవిష్యత్ కోసం కష్టపడుతున్న ఉపాధ్యాయులు, అధికారులు, సిబ్బందికి ధన్యవాదాలు
- డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఓవర్సీస్ స్కాలర్ షిప్ ద్వారా గత ఆరేళ్లలో 230 మంది గిరిజన విద్యార్థులకు విదేశాల్లో ఉన్నత విద్యకు అవకాశం
ఈ విద్యా సంవత్సరం(2020-21)లో గిరిజన సంక్షేమ గురుకుల విద్యా సంస్థల నుంచి ఇంజనీరింగ్, మెడికల్ విభాగాల్లో 223 మంది విద్యార్థులు గొప్ప, గొప్ప విద్యా సంస్థల్లో సీట్లు సాధించడం పట్ల మంత్రి సత్యవతి రాథోడ్ విద్యార్థులకు, ఉపాధ్యాయులకు, అధికారులు, సిబ్బందికి శుభాకాంక్షలు తెలిపారు.
గత ఆరేళ్లలో(2017 నుంచి 2021) వరకు 1286 మంది విద్యార్థులు ఐఐటి, ఎన్ఐటి, ఐఐఐటి, జిఎఫ్టీఐ, ఎంబీబీఎస్, బిడిఎస్, బిఎస్సీ అగ్రికల్చర్, ఫార్మసీ, ఐఐఎస్ఈఆర్, ఎన్ఐఎస్ఈఆర్ , ప్రతిష్టాత్మక యూనివర్శిటీ ఇంజనీరింగ్ కాలేజీల్లో సీట్లు సాధించడం ఎంతో సంతోషకరమన్నారు.
విద్య ద్వారానే వికాసం జరుగుతుందని నమ్మిన ముఖ్యమంత్రి కేసీఆర్ దేశంలో ఎక్కడా లేనివిధంగా తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక గురుకులాలు పెట్టి, అత్యంత వెనుకబడిన, దళిత, గిరిజన విద్యార్థులకు నాణ్యమైన విద్య, పోషకాహారం అందించడంతో పాటు సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ కేంద్రాలను పెట్టి దేశంలోని ప్రముఖ ప్రవేశ పరీక్షలన్నింటికి అత్యుత్తమ శిక్షణ అందించడం ద్వారా ఈ వర్గాల పిల్లలు గొప్ప, గొప్ప విద్యా సంస్థల్లో ఉత్తమమైన కోర్సులలో సీట్లు సాధిస్తూ, తెలంగాణ రాష్ట్రానికి, గురుకుల విద్యా సంస్థలకు, వారి కుటుంబాలకు మంచిపేరు తీసుకొస్తున్నారని కొనియాడారు.
తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఆదిమ ఆదివాసీ, గిరిజన తెగల విద్యార్థుల కోసం ప్రత్యేకంగా రెండు గిరిజన గురుకుల జూనియర్ కాలేజీలను సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ కేంద్రాలుగా ఏర్పాటు చేయడంతో కోలార్, కోలమ్ తెగలకు చెందిన విద్యార్థులు కూడా జాతీయ స్థాయిలోని ఎన్ఐటి వంటి ప్రతిష్టాత్మక సంస్థలలో సీట్లు సాధించడం తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న కృషికి ప్రత్యక్ష నిదర్శనమన్నారు.
తెలంగాణ రాష్ట్ర గిరిజన సంక్షేమ గురుకుల విద్యా సొసైటీలో 21 గిరిజన సంక్షేమ గురుకుల కాలేజీలను సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ కాలేజీలుగా గుర్తించి, అక్కడ ఐఐటి-జేఈఈ, నీట్ పరీక్షలకు అత్యంత వెనుకబడిన గిరిజన ప్రతిభావంత విద్యార్థులకు శిక్షణ అందిస్తున్నామన్నారు. ఈ 21 సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ గిరిజన సంక్షేమ గురుకుల జూనియర్ కాలేజీలలో ఒక బాలుర, ఒక బాలికల కాలేజీని కేవలం ఆదిమ గిరిజన తెగల(పీవిటీజీ) విద్యార్థుల కోసం కేటాయించడం జరిగిందన్నారు.
ఈ కాలేజీలో ఇచ్చిన శిక్షణ వల్ల గత ఆరేళ్లలో ఐఐటిలలో 262 మంది, ఎన్ఐటీ, ఐఐఐటి, జిఎఫ్టిఐలలో 341 మంది, ఎంబీబీఎస్ లో 141 మంది, బిఎస్సీ అగ్రికల్చర్, ఫార్మసీలలో 49 మంది, ఐఐఎస్ఈఆర్, ఎన్ఐఎస్ఈఆర్లలో 13 మంది, యూనివర్శిటీ ఇంజనీరింగ్ కాలేజీలలో 313 మంది, ఇతర ఉన్నత విద్యాకోర్సులలో 127 మంది సీట్లు సాధించడం పట్ల ఈ వర్గాల తరపున ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి ధన్యవాదాలు చెబుతున్నాను అన్నారు. మొత్తంగా 1286 మంది గిరిజన విద్యార్థులు గిరిజన గురుకులాల్లో అందించిన అత్యుత్తమ శిక్షణ, మార్గదర్శనం ఆధారంగా తమ ప్రతిభను చాటుకుని ప్రతిష్టాత్మక కోర్సులలో అడ్మిషన్లు సాధించడం పట్ల మరోసారి వారికి శుభాకాంక్షలు చెప్పారు.
గత రెండేళ్లుగా కోవిడ్ మహమ్మారి వల్ల తరగతులు సరిగా జరగకపోయినా.. ఆన్లైన్ విద్య, విద్యార్థుల వద్దకే ఉపాధ్యాయుల కార్యక్రమం ద్వారా 2019-20 సంవత్సరంలో ఐఐటి-41, ఎన్ఐటి-43, జిఎఫ్టిఐ-05, ఎంబీబీఎస్-35, బిడిఎస్-05, 2020-21 సంవత్సరంలో ఐఐటి-73, ఎన్ఐటి-58, ఐఐఐటి మరియు జిఎఫ్టీఐ-39, ఎంబీబీఎస్ -43, బిడిఎస్-10 సీట్లు సాధించడం గిరిజన గురుకుల విద్యా సంస్థల ఉపాధ్యాయులు, అధికారులు, సిబ్బంది చిత్తశుద్ధికి, అంకిత భావానికి నిదర్శనమని, వారందరికీ అభినందనలు తెలిపారు.
దేశంలో ప్రతిష్టాత్మకమైన కోర్సులలో ఆదిమ గిరిజన తెగలైన కోలార్ తెగకు చెందిన పి. మహేందర్ ఎన్ఐటీ-అగర్తలలో బయో టెక్నాలజీ మరియు బయో కెమికల్ ఇంజనీరింగ్ లో, టి. నాగరాజు ఎన్ఐటి-అరుణాచల ప్రదేశ్ లో మెకానికల్ ఇంజనీరింగ్, ఎం. సాయికుమార్ ఎన్ఐటి-ఔరంగాబాద్ లో ఎలక్ర్టానిక్స్ సిస్టమ్ ఇంజనీరింగ్ కోర్సులో, కోలామ్ తెగకు చెందిన కె. విశ్వనాథ్ ఎన్ఐటీ – అరుణాచల ప్రదేశ్ లో మెకానికల్ ఇంజనీరింగ్ సీట్లు సాధించడం నిజంగా చాలా ఆదిమ గిరిజన తెగలు గర్వించే గొప్ప విషయమన్నారు.
2020-21 అకాడమిక్ సంవత్సరంలో 90 మందికి నీట్ కోచింగ్ ఇవ్వగా, ఈ ఏడాది 100 మంది విద్యార్థుల(50 మంది బాలికలు, 50 మంది బాలురు)కు శిక్షణ అందించామమన్నారు. వీరిలో 90మంది సీట్లు సాధించడం విశేషమన్నారు. అంతేకాకుండా మొదటి సారిగా గిరిజన గురుకుల సంస్థల నుంచి ముగ్గురు విద్యార్థులు ఎయిమ్స్ లో సీట్లు సాధించడంతో మన తెలంగాణ రాష్ట్ర విద్యా నాణ్యత, గిరిజన గురుకులాల పటిష్టమైన శిక్షణకు తార్కాణంగా నిలుస్తోందన్నారు.
వీరితో పాటు విదేశాల్లో ఉన్నత విద్య చదువుకునేందుకు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఓవర్సీ్స్ స్కాలర్ షిప్ ద్వారా రాష్ట్రంలో గత ఆరేళ్లలో కేవలం గిరిజన విద్యార్థులే 230 మంది లబ్ది పొందారన్నారు. ఈ ఒక్క సంవత్సరంలోనే 50మందికి లక్ష్యంగా పెట్టుకుంటే 40 మంది విద్యార్థులు ఓవర్సీస్ స్కాలర్ షిప్ సాధించి, విదేశాల్లో సీట్లు సాధించడం నిజంగా గర్వకారణమన్నారు. వీరందరికీ శుభాకాంక్షలు తెలిపారు.