ఉన్నత అధికారులతో మంత్రి తలసాని సమీక్ష
హైదరాబాద్: ప్రజల సమస్యలను పరిష్కరించే విషయంలో అధికారులు అంకితభావంతో పని చేయాలని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చెప్పారు. మంగళవారం బుద్ధ భవన్ లో మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ స్పెషల్ చీఫ్ సెక్రెటరీ అరవింద్ కుమార్ తో కలిసి జీహెచ్ఎంసీ, రెవెన్యూ, వాటర్ వర్క్స్, ఆర్ & బీ, దేవాదాయ శాఖ, రైల్వే తదితర శాఖల ఉన్నత అధికారులతో సమీక్ష నిర్వహించారు.
ఈ సమావేశంలో జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్ కుమార్, వాటర్ వర్క్స్ ఎండీ దాన కిషోర్, హైదరాబాద్ జిల్లా కలెక్టర్ శర్మన్, వక్ఫ్ బోర్డ్ సీఈఓ షానవాజ్ ఖాసీం, ఎస్ఎన్డీపీ ఈఎన్సీ జియా ఉద్దిన్, హెచ్ఆర్డీసీఎల్ సీఈ సరోజరాణి, ల్యాండ్ అక్విజేషన్ అధికారి వెంకటేశ్వర్లు, టూరిజం ఎండీ మనోహర్, ఎస్ఈ అనిల్ రాజ్, రైల్వే అడిషనల్ డీఆర్ఎం సుబ్రహ్మణ్యం, మెట్రో సీజీఎం నరసింహ స్వామి, జోనల్ కమిషనర్ లు శ్రీనివాస్ రెడ్డి, రవి కిరణ్, దేవాదాయ శాఖ ఆర్జేసీ రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ చేపట్టిన అభివృద్ధి పనులు సకాలంలో పూర్తయ్యే విధంగా ఉన్నతాధికారులు పర్యవేక్షణ జరపాలని సూచించారు. బేగంపేట డివిజన్ లో గల పాటిగడ్డ లో స్థానిక ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకొని మల్టి ఫర్పస్ ఫంక్షన్ హాల్ నిర్మాణానికి ప్రభుత్వం 6 కోట్ల రూపాయలు మంజూరు చేసిందని తెలిపారు. ఆర్ & బీ శాఖకు చెందిన స్థలంలో మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా ఈ నెల 12వ తేదీన శంకుస్థాపన చేయడం జరిగిందని చెప్పారు. ఆర్ & బీ నుండి జీహెచ్ఎంసీకి భూమి బదిలీ చేసే ప్రక్రియను వేగవంతం చేయాలని ఆర్ & బీ ఈఎన్సీ గణపతి రెడ్డిని ఆదేశించారు. అదేవిధంగా సనత్ నగర్ నియోజకవర్గ పరిధిలోని సోమప్ప మఠంలో 2910 గజాలు, జీరా కాంపౌండ్ లో 2350 గజాల దేవాదాయశాఖ భూమిని జీహెచ్ఎంసీకి బదలాయించే ప్రక్రియను కూడా వేగవంతం చేయాలని దేవాదాయ శాఖ అధికారులను ఆదేశించారు.
సనత్ నగర్ లోని శ్యామల కుంట, రాంగోపాల్ పేటలోని వెంగళ రావ్ నగర్ లలో నిరుపేదలు ఇండ్లను నిర్మించుకొని ఎన్నో సంవత్సరాల నుండి నివసిస్తున్నారని, రికార్డులలో ఎఫ్టీఎల్ గా పేర్కొనబడిందని అన్నారు. కానీ ప్రస్తుతం అక్కడ నివసిస్తున్న వారు తమకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను నిర్మించి ఇవ్వాలని కోరుతున్నారని మంత్రి చెప్పారు. శ్యామల కుంట స్థలంపై కోర్టులో కేసు ఉందని అధికారులు తెలపగా, సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వెంగళ రావ్ నగర్ లో ఎంతమంది నివసిస్తున్నారు, ఎన్ని ఇండ్లు ఉన్నాయో ఇంటింటి సర్వే నిర్వహించి సమాచారం సేకరించాలని రెవెన్యూ అధికారులను ఆదేశించారు. బేగంపేట లో ముస్లీం గ్రేవ్ యార్డ్ ఏర్పాటు కోసం స్థలం కేటాయించాలని స్థానికులు గతంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ ప్రాంతంలో పర్యటించిన సమయంలో కోరారని మంత్రి గుర్తుచేశారు.
హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ కు లీజుపై కేటాయించినదని, అందులో నిరుపయోగంగా ఉన్న స్థలంలో సుమారు 2 ఎకరాల భూమిని కేటాయించేందుకు ఉన్న అవకాశాలను పరిశీలించాలని మంత్రి అధికారులను ఆదేశించారు. ఎంజీ రోడ్ లోని మహాత్మాగాంధీ విగ్రహం పరిసరాల సుందరీకరణ పనులపై సమీక్ష చేస్తూ అక్కడి ట్రాన్స్ ఫార్మర్ లను తరలించే పనులను త్వరితగతిన చేపట్టాలని విద్యుత్ అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం ఉన్న గాంధీ విగ్రహాన్ని యధావిధిగా ఉంచి అదనంగా మరొక గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేయడమే కాకుండా ఆ ప్రాంతాన్ని ఆకర్షణీయంగా తీర్చిదిద్దుతామని చెప్పారు. బన్సీలాల్ పేటలో పునరుద్ధరించిన నిజాం కాలం నాటి మెట్ల బావి అభివృద్ధి పనులను చేపట్టి ఆగస్టు 15 నాటికి ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని జీహెచ్ఎంసీ అధికారులకు చెప్పారు.
ఎంతో చారిత్రక గుర్తింపు కలిగిన బేగంబజార్ చేపల మార్కెట్ నిర్మాణ పనులపై సమీక్షించారు. భవన నిర్మాణ పనులు పూర్తయ్యాయని, సీవరేజ్ లైన్, కాంపౌండ్ వాల్ నిర్మాణ పనులు మిగిలి ఉన్నాయని అధికారులు వివరించగా, మిగిలిన పనులను కూడా త్వరితగతిన పూర్తి చేసి నెలరోజులలో ప్రారంభానికి సిద్ధం చేయాలని ఆదేశించారు. ట్రాఫిక్ సమస్య పరిష్కారం కోసం ఫతేనగర్ ఫ్లై ఓవర్ విస్తరణ పనులను చేపట్టేందుకు స్థల సేకరణ పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు. రాణిగంజ్, పతేనగర్, సనత్ నగర్ ఆర్యూబీల అభివృద్ధి, విస్తరణ పనులను చేపట్టేందుకుగాను మార్చి 2 వ తేదీన ఆర్ & బీ, జీహెచ్ఎంసీ, రైల్వే, తదితర శాఖల అధికారులతో కలిసి సందర్శించాలని సమావేశంలో నిర్ణయించారు.