మహిళలు అన్ని రంగాల్లో ప్రతిభ కనబరుస్తూ పురుషులతో సమానంగా ముందుకు వెళ్తున్నారు: సునీతా లక్ష్మారెడ్డి

Related image

హైదరాబాద్: మహిళలు అన్ని రంగాల్లో ప్రతిభ కనబరుస్తూ పురుషులతో సమానంగా ముందుకు వెళ్తున్నారని తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాకిటి సునీతా లక్ష్మారెడ్డి అన్నారు. మ‌హిళ‌ల్లో నాయ‌క‌త్వ ల‌క్ష‌ణాలు, సామ‌ర్థ్యం పెంచేందుకు జాతీయ మహిళా క‌మిష‌న్ సారథ్యంతో తెలంగాణ రాష్ట్ర గ్రామీణాభివృద్ధి సంస్థ నిర్వహించిన 'షి ఈజ్ ఏ చేంజ్‌మేక‌ర్' కార్య‌క్ర‌మంలో తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాకిటి సునీతా లక్ష్మారెడ్డి పాల్గొన్నారు. క్షేత్ర‌స్థాయిలో గ్రామాల్లోని మ‌హిళా నేత‌ల్లో నాయ‌క‌త్వ ల‌క్ష‌ణాలు పెంచ‌డం కార్య‌క్ర‌మం ముఖ్య ఉద్దేశమని ఆమె అన్నారు. ఇందులో భాగంగా నిర్ణ‌యాలు ఎలా తీసుకోవాలి, ఎలా మాట్లాడాలి, చెప్పాలి, రాయాలో మహిళ‌ల‌కు శిక్ష‌ణ ఇస్తున్నారని అన్నారు.

ఈ కార్యక్రమంలో చైర్ పర్సన్ సునీతా లక్ష్మారెడ్డి మాట్లాడుతూ సమాజంలో మహిళలు పురుషులతో అన్ని రంగాల్లో సమానంగా ముందుకు వెళ్తున్నారని అన్నారు. బాల్య వివాహాలు, వరకట్నపు వేధింపులు, పనిచేయు ప్రదేశంలో లైంగిక వేధింపులు, చిన్న పిల్లలపై లైంగిక వేధింపులు, బాల కార్మికుల నిర్ములన, గృహహింస తదితర చట్టాలపై అవగాహన కల్పించారు. మహిళ తన సంతోషాలను స్వేచ్ఛను పక్కనపెట్టి కుటుంబ అవసరాలకు పరితపిస్తూ ఉంటుందని పేర్కొన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలను ఆడ మగ అనే తేడా లేకుండా సమానంగా పెంచాల్సిన అవసరం ఉందని బాల్యం నుంచే కుటుంబ సంప్రదాయాలను విలువలతో కూడిన జీవితం పైన అవగాహన కల్పించాల్సిన బాధ్యత తల్లిదండ్రులదే అన్నారు.

మహిళలు ఎదుర్కుంటున్న సమస్యలను తెలుసుకొని పరీక్షించడమే కాకుండా వారికి రక్షణగా మహిళా కమిషన్ నిలుస్తుందన్నారు. కమిషన్ మహిళలకు రక్షణ హక్కులపై అవగాహన కల్పించడంతో పాటు మహిళలకు అండగా నిలుస్తుందన్నారు. ‘ఆడపిల్ల చదువు ఇంటికి,సమాజానికి వెలుగు’ అని సునీతా లక్ష్మారెడ్డి పేర్కొన్నారు. అదే విధంగా చదువులో కానీ ఏ రంగంలో కానీ లింగ వివక్ష లేని సమాజాన్ని నిర్మించుకోవాలని కోరారు. కరోనా సమయంలో గ్రామ సర్పంచులు చేసిన సేవ చాల అభినందనీయం అని ఆమె అన్నారు. ఈ టర్మ్ లో సర్పంచులు చాల అదృష్టవంతులు అని ఆమె అన్నారు.

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మహిళల కోసం ఎన్నో సంక్షేమ పధకాలు అమల్లోకి తెచ్చారని ఆమె గుర్తుచేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గ్రామాల అభివృద్ధి కోసం ఎంతో కృషి చేస్తుందని ఆమె అన్నారు. అలాగే మహిళల రక్షణ కోసం విమెన్ సేఫ్టీ వింగ్, షీ టీమ్స్, భరోసా సెంటర్లు ఏర్పాటు చేసారని ఆమె అన్నారు. అలాగే ఇంట్లో సమస్యలతో కమిషన్ కి రాలేకపోయే వారికీ సోషల్ మీడియా ద్వారా కూడా కంప్లైంట్ చేయవచ్చని గుర్తు చేశారు. మీరు ఫేస్ బుక్, ట్విట్టర్, ఇంస్టాగ్రామ్ @SCWTelangana ద్వారా మరియు Email: [email protected] లేదా వాట్సాప్ 9490555533 ద్వారా కూడా  ద్వారా కూడా మహిళలకు జరిగే అన్యాయాన్ని కమిషన్ దృష్టికి తీసుకురావచ్చని చెప్పారు.

ఈ కార్యక్రమంలో మహిళా కమిషన్ కార్యదర్శి కృష్ణ కుమారి, టీఎస్ఐఆర్డి జాయింట్ డైరెక్టర్ నరేంద్రనాథ్ మరియు సెంటర్ హెడ్ నాగమణి తదితరులు పాల్గొన్నారు.

More Press Releases