ఇది మత్స్య చరిత్రలో ఒక శుభదినం: మంత్రి తలసాని
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో మత్స్యరంగంలో విదేశీ సంస్థ పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావడం తెలంగాణ ప్రభుత్వం మత్స్య రంగంలో అభివృద్ధి సాధించింది అనేందుకు నిదర్శనం అని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ శుక్రవారం తెలిపారు. మత్స్యకారులు ఆర్దికంగా అభివృద్ధి సాధించాలనే లక్ష్యంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనేక కార్యక్రమాలను అమలు చేస్తుందని భారతదేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కులవృత్తులపై ఆధారపడి జీవనం సాగిస్తున్న బడుగు, బలహీన వర్గాల చేయూతను అందించడం ద్వారా గ్రామీణ ఆర్ధిక వ్యవస్థను బలోపేతం చేయాలనే కృతనిశ్చయంతో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు నాయకత్వంలోని తెలంగాణ ప్రభుత్వం ముందుకు సాగుతుందని పేర్కొన్నారు.
ప్రధానంగా మత్స్యకారుల కుటుంబాలలో ఆర్ధికంగా, సామాజికంగా వెలుగులు నింపాలనే ప్రత్యేక ఆలోచనతో మత్స్యకారుల జీవనోపాధిని మెరుగుపర్చడం, మత్స్యకారుల కోసం వివిధ సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్న విషయాన్ని మంత్రి శ్రీనివాస్ యాదవ్ వివరించారు. ఇందుకోసం గతంలో ఎన్నడూ లేని విధంగా మత్స్య శాఖకు పెద్ద ఎత్తున నిధులను కేటాయించడం, రాష్ట్రంలోని అన్ని నీటి వనరులలో ఉచితంగా చేప పిల్లలు, రొయ్య పిల్లలను విడుదల చేస్తున్న విషయాన్ని గుర్తుచేశారు. అంతేకాకుండా అత్యాధునిక పద్దతులలో చేపల పెంపకాన్ని ప్రోత్సహించే విధంగా కేజ్ కల్చర్ యూనిట్ లను అందజేయడం, చేప పిల్లల ఉత్పత్తి కేంద్రాలను బలోపేతం చేయడం వంటి చర్యలను చేపట్టినట్లు చెప్పారు.
మత్స్యకారులు చేపలను మార్కెటింగ్ చేసుకొనేందుకు గాను 2017-18 సంవత్సరంలో సమీకృత మత్స్య అభివృద్ధి పథకం క్రింద 1000 కోట్ల రూపాయల వ్యయంతో సబ్సిడీపై వాహనాలను అందజేసినట్లు, నూతన మార్కెట్ ల నిర్మాణం, అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పించడం చేస్తున్నట్లు తెలిపారు. నీలి విప్లవం కార్యక్రమం క్రింద చేప పిల్లల ఉత్పత్తి కేంద్రాలు, దాణా మిల్లుల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల కారణంగా రాష్ట్రంలో మత్స్య సంపద భారీగా పెరిగిందని, ఇందుకు 2016-17 సంవత్సరంలో 1.99 లక్షల తన్నులు ఉండగా, 2020-21 సంవత్సరం నాటికి 3.49 లక్షల టన్నులకు పెరగడమే నిదర్శనంగా ఆయన పేర్కొన్నారు.
రాష్ట్రంలో నూతనంగా నిర్మించిన కాళేశ్వరం తదితర ప్రాజెక్టుల వలన పెరిగిన నీటి విస్తీర్ణంను పూర్తిస్థాయిలో వినియోగించుకోనేందుకుగాను రాష్ట్ర ప్రభుత్వం ఆక్వా హబ్ ల ఏర్పాటును ప్రోత్సహిస్తుందని చెప్పారు. అందులో భాగంగా మిడ్ మానేరు రిజర్వాయర్ లో 210 ఎకరాల నీటి విస్తీర్ణంలో ఏర్పాటు చేసేందుకు ప్రణాలికలను సిద్దం చేయడం జరిగిందని తెలిపారు. దీనిలో 120 ఎకరాల విస్తీర్ణంలో 1000 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో మంచినీటి చేపల పెంపకం చేపట్టడానికి అమెరికాలో స్థాపించబడిన ఫిష్ ఇన్ సంస్థ మున్సిపల్ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు చొరవతో ముందుకొచ్చిందని, ఇది మత్స్య చరిత్రలో ఒక శుభదినంగా ఆయన అభివర్ణించారు.
ఈ ప్రాజెక్ట్ వలన ప్రత్యక్షంగా 3 వేల మత్స్యకారుల కుటుంబాలకు, పరోక్షంగా స్థానికంగా ఉన్న 2 వేల మంది కు ఉపాధి అవకాశాలు లభిస్తాయని మంత్రి శ్రీనివాస్ యాదవ్ వివరించారు. మిడ్ మానేరు రిజర్వాయర్ పరిధిలోని తంగాల్లపల్లి, చీర్లవంచ, చింతలతన గ్రామాల పరిధిలో TSIIC ద్వారా 120 భూమిని కేటాయించేందుకు చర్యలు చేపట్టినట్లు వివరించారు. ఫిష్ ఇన్ సంస్థ తెలంగాణ రాష్ట్రంలో మత్స్య రంగ సమగ్ర అభివృద్ధి కై పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావడానికి తన అమెరికా పర్యటనలో ఎంతో కృషి చేసిన మున్సిపల్ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు కు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.