అమీర్ పేట, సనత్ నగర్ లలో స్విమ్మింగ్ పూల్ లను ప్రారంభించిన మంత్రి తలసాని
హైదరాబాద్: విద్యార్థులు వేసవి సెలవుల సమయాన్ని వృధా చేయకుండా వేసవి శిభిరాలను సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పిలుపునిచ్చారు. మంగళవారం అమీర్ పేట లోని డీకే రోడ్ లో గల గురు గోబింద్, సనత్ నగర్ లోని వెల్ఫేర్ గ్రౌండ్ లో గల స్విమ్మింగ్ పూల్ లను మంత్రి ప్రారంభించారు. సనత్ నగర్ వెల్ఫేర్ గ్రౌండ్ లో స్విమ్మింగ్ పూల్ ఓపెనింగ్ అనంతరం విద్యార్ధులను సమస్యలు అడిగి తెలుసుకున్నారు.
స్విమ్మింగ్ పూల్ కు పెన్సింగ్ ఏర్పాటు చేయాలని మంత్రిని కోరగా, వెంటనే చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తల్లిదండ్రులు తమ పిల్లలను చదువుతో పాటు క్రీడలలోను ప్రోత్సహించాలని అన్నారు. క్రీడల వలన మానసికంగా, శారీరకంగా ఎంతో అభివృద్ధి సాధిస్తారని తెలిపారు. ప్రభుత్వం క్రీడాకారులను ప్రోత్సహించేలా అనేక అవకాశాలను కల్పిస్తుందని చెప్పారు. కరోనా కారణంగా స్విమ్మింగ్ పూల్స్ ను మూసివేయడం జరిగిందని, అవసరమైన అభివృద్ధి పనులను పూర్తిచేసి తిరిగి వినియోగంలోకి తీసుకురావడం జరిగిందని వివరించారు.
క్రీడాకారుల కోసం 5 కోట్ల రూపాయల తో స్పోర్ట్స్ కాంప్లెక్స్ ను నిర్మించిన విషయాన్ని గుర్తుచేశారు. అంతేకాకుండా నగరంలోని అన్ని పార్క్ లలో ఓపెన్ జిమ్ లను ఏర్పాటు చేయడంతో పాటు పలు కాలనీలు, బస్తీలలో గల కమ్యునిటీ హాల్స్ లలో కూడా జిమ్ లను ఏర్పాటు చేసిన విషయాన్ని వివరించారు. ప్రతి ఒక్కరు పని వత్తిడుల నుండి ఉపశమనం పొందడంతో పాటు ఆరోగ్య రిత్యా కూడా రోజులో కొంత సమయం వ్యాయామం, స్విమ్మింగ్ వంటి వాటి కోసం కేటాయించాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ లు కొలన్ లక్ష్మి బాల్ రెడ్డి, సరళ, జోనల్ కమిషనర్ రవి కిరణ్, డీసీ మోహన్ రెడ్డి, ఈఈ ఇందిర, స్పోర్ట్స్ ఇన్ స్పెక్టర్ మాధవి, హార్టి కల్చర్ డీడీ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.