మహిళా చట్టాలు కేవలం మహిళలే కాదు పురుషులు కూడా తెలుసుకోవాలి: సునీతా లక్ష్మారెడ్డి
యాదాద్రి భువనగిరి జిల్లా: మహిళా చట్టాలు కేవలం మహిళలే కాదు పురుషులు కూడా తెలుసుకోవాలని, తద్వారా మహిళలకు కల్పించిన హక్కుల పట్ల అవగాహన కలుగుతుందని అన్నారు. ఆడపిల్లలపై సమాజ ఆలోచన విధానంలో మార్పు రావాలని తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాకిటి సునీతా లక్ష్మారెడ్డి అన్నారు.
మంగళవారం యాదాద్రీ జిల్లా పర్యటనలో భాగంగా ప్రభుత్వ బాలికల వసతి గృహమును ఆకస్మిక తనిఖీ చేసి బాలికల వసతి సౌకర్యాలను గురించి తెలుసుకున్న తెలంగాణ రాష్ట్ర మహిళా కమీషన్. అనంతరం జిల్లాలోని సఖి కేంద్రాన్ని సందర్శించడం జరిగింది. ఈ సందర్భంగా సఖి నిర్వాహకురాలు లావణ్య ద్వారా సఖి కార్యకలాపాలను అడిగి తెలుసుకొని సఖి కేంద్రం ద్వారా మరిన్ని సేవలందించేందుకు కృషి చేయాలని సూచించారు. కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో మహిళా సాధికారత, గృహ హింస, పని చేసే చోట లైంగిక వేధింపులు అంశాలపై నిర్వహించిన సెమినార్ లో చైర్ పర్సన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ కార్యక్రమంలో జిల్లా, కలెక్టరు పమేలా సత్పతి, జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ దీపక్ తివారి, రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యులు షహీన్ అఫ్రోజ్, కుమ్మ ఈశ్వరీబాయి, కొమ్ము ఉమాదేవి, గద్దల పద్మ, సుద్ధం లక్ష్మి, కటారి రేవతి, కమిషన్ సెక్రటరీ కృష్ణ కుమారి, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి మందడి ఉపేందర్రెడ్డి, జిల్లా మహిళా శిశు సంక్షేమ అధికారి కృష్ణవేణి పాల్గొన్నారు. ఈ సందర్భంగా చైర్ పర్సన్ మాట్లాడుతూ ఆడ, మగ బేధాభిప్రాయం చూపిస్తూ పిల్లను పెంచకుడదని, సమాన హక్కులు కల్పిస్తూ పెంచాల్సిన భాధ్యత ప్రతిఒక్కరిపై ఉందన్నారు.
ముఖ్యంగా బాల్య వివాహాలు అరికట్టడం, గృహ హింస, బార్య భర్తల వివాదాలు, యుక్త వయసులో ఎదురయ్యే ప్రేమ తదితర వంటి సమస్యలపై సఖి, ఎంఎస్కే ద్వారా పాఠశాలల్లో మరియు కళాశాలల్లో పిల్లలకు అవగహన కల్పించాలన్నారు. మహిళలు, ఆడపిల్లలు అనీమియా భారిన పడకుండా చూడాల్సిన అవసరం ఉందన్నారు. ఎవరైనా న్యాయం కోసం ఆర్థికంగా అడ్వకేట్ ను నియమించుకోలేని వారికి డీ.ఎల్.ఎస్.ఏ ద్వారా ఉచితంగా న్యాయ సహాయాన్ని, అడ్వకేట్ ను ఏర్పాటు చేయాలని సూచించారు.
సైబర్ నేరాల పెరుగుతుండడంతో స్మార్ట్ ఫోన్ ద్వారా తమ వ్యక్తిగత డిటైల్స్ ఇతరులతో పంచుకోవద్దని అన్నారు. మ్యారేజీ యాక్టు ప్రకారం ప్రతి పెళ్లిని రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని, గ్రామాలలో పంచాయితీ సెక్రటరీలు మ్యారేజీ రిజిస్ట్రేషన్స్ పై మహిళలను చైతన్యపరచాలని తెలిపారు. పోష్ చట్టం ప్రకారం ప్రతి శాఖలో అంతర్గత పిర్యాదుల కమిటీనీ నియమించాలని, పని చేసే చోట మహిళలకు రక్షణ కల్పించడానికి ఈ చట్టన్ని తెచ్చారని చెప్పారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడ్డాక మహిళలను ప్రత్యేకంగా గౌరవిస్తూ వారికి సమాన హక్కులు కల్పిస్తోందన్నారు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడ లేని విధంగా మహిళల ఆరోగ్యం, సంక్షేమం పట్ల అనేక పథకాలు చేపట్టిందని, రెసిడెన్షియల్ పాఠశాలలు, వసతి గృహాలలో నాణ్యమైన భోజన వసతి, విద్య కల్పించారని, అంబేద్కర్ ఓవర్సీస్ నిధి ద్వారా విదేశీ చదువులకు 20 లక్షలు ఆర్ధిక సహాయం అందిస్తున్నారని, కళ్యాణలక్ష్మి, షాదీముబారక్ ద్వారా ఆడపిల్లల వివాహాలకు ఆర్ధిక మనోబలం కల్పించారని, ఆరోగ్య లక్ష్మి, కెసిఆర్ కిట్స్ ద్వారా మాతా శిశువులకు ఆరోగ్య, వైద్య సదుపాయాలు కల్పిస్తున్నారని, మహిళలు అన్నింటిలో ఎదగాలని, మహిళల ఆలోచనలకు అనుగుణంగా అన్ని విధాలుగా సహాయం అందిస్తున్నారని అన్నారు.
షీ - టీమ్స్, సఖీ సెంటర్స్, సైబర్ టీమ్స్, ఎన్ఆర్ఐ సెల్ మరియు మహిళలను వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దడానికి వీ-హబ్ ను ఏర్పాటు చేసిందని చెప్పారు. మహిళలు మోసపోకుండా రక్షణాత్మక చర్యలు చేపట్టడం జరిగిందని తెలిపారు. హింస లేని సమాజం కోసం మన వంతు కృషి చేద్దామని పిలుపునిచ్చారు. కమిషన్ మహిళలకు రక్షణ హక్కులపై అవగాహన కల్పించడంతో పాటు మహిళలకు అండగా నిలుస్తుందన్నారు. మహిళలు ఏ సమస్య వచ్చిన అధర్యపడకుండ దృఢంగా ఉండాలని, ప్రతి సమస్యకి ఒక పరిష్కారం ఉంటుందని అన్నారు. అలాగే ఇంట్లో సమస్యలతో కమిషన్ కి రాలేకపోయే వారికీ సోషల్ మీడియా ద్వారా కూడా కంప్లైంట్ చేయవచ్చని గుర్తు చేశారు.
మీరు ఫేస్ బుక్, ట్విట్టర్, ఇంస్టాగ్రామ్ లో @SCWTelangana ద్వారా మరియు ఇమెయిల్ [email protected] మరియు హెల్ప్ లైన్ 181 లేదా కమిషన్ వాట్సప్ నంబర్ 9490555533 ద్వారా కూడా మహిళలకు జరిగే అన్యాయాన్ని కమిషన్ దృష్టికి తీసుకురావచ్చని తెలియజేశారు. అనంతరం మహిళా సమస్యలపై జిల్లాలోని అన్ని శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించడం జరిగింది.